CM Revanth Reddy: మాఫీకి మార్గమిదీ!
ABN, Publish Date - May 18 , 2024 | 05:20 AM
పంట రుణాల మాఫీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. రుణమాఫీ పథకం కోసం పంద్రాగస్టును గడువుగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. రూ.2 లక్షల దాకా ఉన్న రైతుల పంట రుణాలను ఒకేసారి మాఫీ చేసేందుకు ప్రత్యేకంగా ‘రైతు సంక్షేమ కార్పొరేషన్’ (ఫార్మర్ వెల్ఫేర్ కార్పొరేషన్- ఎఫ్‌డబ్ల్యూసీ) ఏర్పాటుచేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం తెలిసిందే.
సెక్షన్-8 కింద రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రణాళిక
హామీగా ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రూపేణా ఆదాయ వనరులు
రైతుల పంట రుణాల మాఫీకి
రేవంత్ సర్కారు కార్యాచరణ
కార్పొరేషన్ పేరుతో ఒకేసారి
బ్యాంకుల నుంచి రూ.32వేల కోట్లు
ఆ వెంటనే రైతులకు ఏకకాలంలో
రూ.2 లక్షల రుణమాఫీ అమలు
బ్యాంకులకు రుణం నెలవారీ
వాయిదాలుగా 10-15 ఏళ్లలో చెల్లింపు
ట్రెజరీలో రెండు వేర్వేరు ఖాతాలు..
ప్రతినెలా ఆదాయం మళ్లింపు
మాఫీకి ఏపీ ఫార్ములానే..
కార్పొరేషన్‌కు చట్టబద్ధత కోసం బిల్లు
హైదరాబాద్, మే 17 (ఆంధ్రజ్యోతి): పంట రుణాల మాఫీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. రుణమాఫీ పథకం కోసం పంద్రాగస్టును గడువుగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. రూ.2 లక్షల దాకా ఉన్న రైతుల పంట రుణాలను ఒకేసారి మాఫీ చేసేందుకు ప్రత్యేకంగా ‘రైతు సంక్షేమ కార్పొరేషన్’ (ఫార్మర్ వెల్ఫేర్ కార్పొరేషన్- ఎఫ్‌డబ్ల్యూసీ) ఏర్పాటుచేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం తెలిసిందే. ఈ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా కార్యాచరణ ప్రణాళికపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పంట రుణాలను ఒకేసారి మాఫీ చేయాలంటే సుమారు రూ.32వేల కోట్లు కావాలి. ఒకేసారి ఇంతపెద్ద మొత్తం ఖజానా నుంచి సమకూర్చడం అంటే కష్టం. అందుకే ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగంగా సర్కారు ‘ఎఫ్‌డబ్ల్యూసీ ఏర్పాటు’ ఆలోచన చేసింది. ఈ కార్పొరేషన్‌కు ఆదాయ మార్గాలను చూపించి రుణమాఫీకి అవసరమయ్యే రూ.32 వేల కోట్లను కార్పొరేషన్ పేరుతోనే బ్యాంకుల నుంచి ఒకేసారి అప్పుగా తీసుకోనుంది. ఆ నిధులతో బ్యాంకులు, సహకార సంఘాల్లో రూ.2లక్షల దాకా రైతులు తీసుకున్న పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేయనుంది.
మాఫీ కోసం తీసుకున్న రూ.32వేల కోట్లను వాయిదాల పద్ధతిలో బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించనుంది. అయితే ఎఫ్‌డబ్ల్యూసీకి చట్టబద్ధత తప్పనిసరి. అందుకే.. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదం తీసుకొని కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పిస్తారు. రుణమాఫీ కోసం తీసుకున్న అప్పును నెలవారీ వాయిదాల్లో 10-15 ఏళ్లలో కార్పొరేషన్ ద్వారానే బ్యాంకులకు సర్కారు చెల్లించనుంది. ఇందుకు హామీగా ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల రూపేణ ఆదాయాన్ని చూపనుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రూ.2 లక్షల రుణమాఫీ పథకం అత్యంత కీలకమైనది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియగానే సీఎం రేవంత్‌రెడ్డి ఈ అంశంపై దృష్టిసారించారు. ఈనెల 15వ తేదీన సమీక్ష కూడా నిర్వహించారు. కాగా రుణమాఫీకి సంబంధించి రాజస్థాన్, మహారాష్ట్ర సహా ఇతరా రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలపై అధ్యయనం చేయాలని అధికారులను రేవంత్ ఆదేశించారు.
రాజస్థాన్‌లో అప్పటి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కూడా రూ. 2 లక్షల రుణమాఫీ పథకాన్ని అమలుచేసింది. రూ. 18 వేల కోట్ల రుణాలను మాఫీ చేసింది. అయితే అక్కడ 2 హెక్టారు ్ల(5 ఎకరాల) వరకు పరిమితి విధించుకొని అమలుచేశారు. 2014లో ఏపీలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం... రైతు సాధికార సంస్థను ఏర్పాటుచేసి రుణమాఫీ ప్రక్రియ చేపట్టింది. ఆ తర్వాత ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం కూడా ‘ఎస్‌డీసీ’(స్టేట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్) ఏర్పాటుచేసి రుణమాఫీ పథకాన్ని అమలుచేసింది. రేవంత్ కూడా రుణమాఫీ కోసం ఈ పంథాలోనే ఆలోచన చేసి ఎఫ్‌డబ్ల్యూసీ ఆలోచన చేశారు. కాగా ఆగస్టు-15 వరకు రుణమాఫీ ప్రక్రియ పూర్తయితే... ఖరీఫ్ కోసం రైతులకు కొత్త రుణాలు తీసుకునే అవకాశం కలుగుతుంది.
సెక్షన్- 8 కింద కార్పొరేషన్ ఏర్పాటు
రైతు సంక్షేమ కార్పొరేషన్‌ను కంపెనీల చట్టం సెక్షన్-8 కింద ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. లాభాపేక్ష లేని(నాన్ ప్రాఫిట్) కార్పొరేషన్‌ను ఏర్పాటుచేయడానికి సెక్షన్-8 ఉపయోగపడుతుంది. రైతు సంక్షేమం, వ్యవసాయరంగ అభివృద్ధిని కారణాలుగా చూపించి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. ఈ కార్పొరేషన్ పేరిట రెండు బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. ఇవికూడా ట్రెజరీలోనే ఉంటాయి. రెగ్యులర్ అకౌంట్‌తోపాటు ‘ఎస్ర్కో’(ఈఎ్‌ససీఈఆర్‌వో) అకౌంట్‌ను ఏర్పాటుచేస్తారు. ఈ ఎస్ర్కో అకౌంట్‌లోనే ప్రతినెలా చెల్లించాల్సిన వాయిదాలకు సరిపడా నిధులు జమచేస్తారు. ఈ అకౌంట్ నుంచి నేరుగా బ్యాంకులకు ‘ఈఎంఐ’ వెళ్లిపోయేలా ప్రత్యేకంగా యంత్రాగాన్ని తయారుచేస్తారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలకు వచ్చే ఆదాయాన్ని, పంట ఉత్పత్తుల అమ్మకాలపై మార్కెట్ సెస్ రూపంలో వచ్చే ఆదాయాన్ని కార్పొరేషన్‌కు బదిలీ చేయొచ్చు. అయితే ఇది సరిపోదు. సర్కారుకు ఏడాదికి ఆబ్కారీ శాఖ నుంచి సుమారు రూ. 20 వేల కోట్లు, జీఎస్టీ ద్వారా సుమారు రూ. 51 వేల కోట్లు, సేల్స్ ట్యాక్స్ ద్వారా రూ. 40 వేల కోట్లు, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల ద్వారా సుమారు రూ. 19 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఇందులోంచి నెలవారీగా కొంత కార్పొరేషన్‌కు బదిలీ చేసి, చెల్లించేలా ప్రణాళిక రూపొందిస్తోంది.
Updated Date - May 18 , 2024 | 05:35 AM