RRR: కొంత రుణం.. బాండ్లతో!
ABN, Publish Date - Nov 14 , 2024 | 04:11 AM
రీజనల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణభాగం నిర్మాణం విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ రహదారి నిర్మాణానికి ఇప్పటిదాకా పబ్లిక్-ప్రైవేట్-పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ), హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్‌ఏఎం), బిల్డ్-ఆపరేట్-టోల్ (బీవోటీ) పద్ధతులను పరిశీలించిన సర్కారు.. తాజాగా ‘ఇన్‌విట్’ విధానంపై దృష్టి సారించింది.
ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం నిర్మాణానికి కొత్తగా ‘ఇన్‌విట్’ విధానం
భారం పడకుండా నిధుల సేకరణకు యోచన
టోల్, ఇతరత్రా రాబడి నుంచి చెల్లించే అవకాశం
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ పద్ధతిలో నిర్మాణం
డీపీఆర్ కన్సల్టెంట్ భర్తీకి త్వరలో టెండర్లు
ప్రాజెక్టు అమలుకు ఓ విభాగం.. పీడీగా ఐఏఎస్
హైదరాబాద్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): రీజనల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణభాగం నిర్మాణం విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ రహదారి నిర్మాణానికి ఇప్పటిదాకా పబ్లిక్-ప్రైవేట్-పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ), హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్‌ఏఎం), బిల్డ్-ఆపరేట్-టోల్ (బీవోటీ) పద్ధతులను పరిశీలించిన సర్కారు.. తాజాగా ‘ఇన్‌విట్’ విధానంపై దృష్టి సారించింది. ఆ పద్ధతిలో నిర్మాణం చేపడితే తీసుకోవాల్సిన చర్యలు, అందుకు ప్రభుత్వం అనుసరించాల్సిన విధానాలపై చర్చిస్తున్నట్ట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘ఇన్‌విట్’ అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వె్‌స్టమెంట్ ట్రస్ట్. అంటే.. మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులను బాండ్ల రూపంలో సేకరించే విధానం. ఏ ప్రాజెక్టు కోసం ఈ నిధులను సేకరిస్తున్నారో.. అదే ప్రాజెక్టుకు నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం కూడా వర్తించదు. అయితే ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టు నుంచి వచ్చే ఆదాయంతోనే ఆ రుణాన్ని తీర్చివేయాల్సి ఉంటుంది. పీపీపీ విధానంలో అయితే.. నిర్మాణ వ్యయంలో ప్రైవేటు సంస్థతో పాటు, ప్రభుత్వం కూడా కొంతమేర నిధులను భరించాల్సి ఉంటుంది. రహదారిని నిర్మించిన సంస్థ కొన్నేళ్లపాటు దాన్ని నిర్వహిస్తూ, టోల్ వసూలు చేసుకుని, ఆ తరువాత ప్రభుత్వానికి అప్పగిస్తుంది. హైదరాబాద్‌లో నిర్మించిన మెట్రో రైల్ ప్రాజెక్టు ఇందుకు ఒక ఉదాహరణ.
ఇక, బీవోటీ విధానంలో.. ప్రైవేటు సంస్థే రోడ్డును నిర్మించి, టోల్ వసూలు చేసుకుంటుంది. టోల్ వసూలు చేసినంతకాలం రోడ్ నిర్వహణను సదరు సంస్థే పర్యవేక్షిస్తుంది. ఆ తరువాత ప్రభుత్వానికి అప్పగిస్తుంది. హెచ్‌ఏఎం విధానంలో అయితే.. వ్యయంలో నిర్మాణ సంస్థ 40 శాతం, మరో 20శాతం ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. మిగతా 40ు బ్యాంకు రుణం. ఈ విధానంలో.. రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక వసూలు చేసే టోల్ రుసుములో రాష్ట్రానికి కూడా కొంత వాటా వస్తుంటుంది. పైగా రహదారి నిర్మాణం కోసం ప్రైవేటు సంస్థ వెచ్చించిన నిధులను వారికి ప్రభుత్వం వెంటనే చెల్లించాల్సిన అవసరంలేదు. ఏడాదికి కొంత చొప్పున కిస్తీల రూపంలో చెల్లించేందుకు వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం దేశంలో ఈ హైబ్రిడ్ యాన్యుటీ విధానమే ఎక్కువగా అమల్లో ఉంది. అయితే, ఇటీవలి కాలంలో పలు రాష్ట్రాల్లో ‘ఇన్‌విట్’ విధానంలోనూ రహదారులను నిర్మిస్తున్నారు. ఈ పద్ధతిలో నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయంలో కొంత ప్రైవేటు సంస్థల నుంచి, మరి కొంత మొత్తాన్ని బాండ్ల రూపంలో సేకరిస్తారు. ఈ పద్ధతిలో రహదారి నిర్మాణానికి నిధులిస్తే.. టోల్ ద్వారా ఎంత ఆదాయం వస్తుందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నాకే ప్రైవేటు సంస్థలు నిధులను అందిస్తాయి. ఆ తర్వాత కూడా ఇంకా నిధులు అవసరమైతేవాటిని బాండ్ల రూపంలో సేకరిస్తారు. రహదారి నిర్మాణమయ్యే ప్రాంతాల ప్రజలు, వ్యాపారులతో పాటు వాణిజ్య మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే సంస్థల నుంచి బాండ్లను తీసుకుంటారు. అలా తీసుకున్న బాండ్లకు.. రహదారి నిర్మాణమైన తరువాత టోల్ ద్వారా, రహదారికి ఇరువైపులా ఏర్పాటుచేసే వాణిజ్య, వ్యాపార సముదాయాల ద్వారా వచ్చే ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని క్రమంగా చెల్లిస్తుంటారు. ఈ విధానంలో అయితే ప్రభుత్వంపై ఆర్ధికభారం పడబోదనే అభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలిసింది.
త్వరలో డీపీఆర్ కన్సల్టెంట్..
ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణభాగం నిర్మాణం, ఆ దారిలో చేపట్టే వెహికల్ అండర్ పాస్, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, క్రాసింగ్, జంక్షన్లు తదితర నిర్మాణాలపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు ఒక కన్సల్టెంట్‌ను నియమించనున్నారు. ఇందుకోసం త్వరలో టెండర్లను ఆహ్వానించనున్నారు. రహదారి వెళ్లే మార్గంలో ఏమైనా గ్రామాలు, ఆవాసాలు ఉన్నాయా? ఉంటే అక్కడ ఎంతమంది నివసిస్తున్నారు? చెరువులు, కుంటలు ఎన్ని ఉన్నాయి? సాగు భూములున్నాయా? అటవీభూములెన్ని ఉన్నాయి? తదితర వివరాలను ఈ నివేదిక రూపకల్పనలో భాగంగా సేకరిస్తారు. ఆ దారిలో సాగేతర, అటవీయేతర భూములుంటే ఎలాంటి ఇబ్బందులూ ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత రూట్ మ్యాప్ ప్రకారం ఈ రహదారి చౌటుప్పల్ దగ్గర ప్రారంభమై ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమనగల్, చేవెళ్ల, శంకర్‌పల్లి మీదుగా సంగారెడ్డిలోని ఉత్తర భాగానికి అనుసంధానం కానుంది.
ప్రత్యేక అమలు విభాగం..
దక్షిణభాగం రహదారి అలైన్‌మెంట్ నుంచి ఇతరత్రా అన్ని అంశాలనూ పర్యవేక్షించేందుకు ప్రత్యేక అమలు విభాగాన్ని (ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్-పీఐయు) ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కూడా.. నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే ఒక ప్రత్యేక అమలు విభాగాన్ని ఏర్పాటుచేసింది. ఓఆర్‌ఆర్ నిర్మాణాన్ని ఆ విభాగమే పర్యవేక్షించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఈ పీఐయులో.. ప్రాజెక్టు డైరక్టర్ (పీడీ) చీఫ్ ఇంజినీర్ (సీఈ), డిప్యూటీ ఇంజినీర్ (డీఈ), సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్‌ఈ), మేనేజర్, అకౌంటెంట్ సహా పలువురు సిబ్బంది ఉండనున్నారు.
Updated Date - Nov 14 , 2024 | 04:11 AM