ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు.. స్టడీ టూర్లు
ABN, Publish Date - Dec 13 , 2024 | 03:52 AM
ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేసే ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకు ప్రభుత్వం కొంత ఆటవిడుపు కల్పించనుంది. వీరికి ఆటల పోటీలు నిర్వహించడంతో పాటు స్టడీ టూర్లకు తీసుకెళ్లనుంది.
శిక్షణ తరగతులు అభినందనీయం
కొత్త సంప్రదాయానికి సర్కారు నాంది
స్పీకర్ ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా
హైదరాబాద్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేసే ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకు ప్రభుత్వం కొంత ఆటవిడుపు కల్పించనుంది. వీరికి ఆటల పోటీలు నిర్వహించడంతో పాటు స్టడీ టూర్లకు తీసుకెళ్లనుంది. ఈ విషయాన్ని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ నియమావళి, బడ్జెట్, పలు బిల్లులు సహా వివిధ అంశాలపై ప్రభుత్వం అవగాహన తరగతులను నిర్వహించింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో బుధ, గురువారాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ తరగతులకు 61మంది ఎమ్మెల్యేలు, 17మంది ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ నిర్వహించని విధంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి నాంది పలికిందన్నారు. తరగతులను విజయవంతంగా నిర్వహించిన అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులును స్పీకర్, మండలి చైర్మన్ అభినందించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, బడ్జెట్ ప్రవేశపెట్టే విధానంపై రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ప్రత్యేకంగా వివరించారు. 16వ ఆర్థిక సంఘం నుంచి.. దేశంలో ఏయే రాష్ట్రాలు ఆర్థికంగా ఎలా ఉన్నాయి? మెరుగుపడాలంటే తీసుకోవాల్సిన చర్యలేంటి?.. ఇలా పలు అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్, అప్పులను కూలంకశంగా వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన తరగతులు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు.
నెలలో 2 రోజులు పర్యాటక ప్రచారానికి కేటాయించండి..
ప్రజా ప్రతినిధులు, ప్రజలకు జూపల్లి విజ్ఞప్తి
పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఉపాఽధి అవకాశాలు పెరుగుతాయని, తద్వారా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పర్యాటక శాఖ ప్రచారంలో ప్రజా ప్రతినిధులు, ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. నెలలో రెండు రోజులు తప్పనిసరిగా పర్యాటక ప్రాంతాలను సందర్శించి, వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్నారు. శాసనసభ వ్యవహారాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పునశ్చరణ తరగతులు ముగిసిన సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని తారామతి బారాదరిలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి , మంత్రులు దుద్దిళ్ల , పొన్నం, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Updated Date - Dec 13 , 2024 | 03:52 AM