Electric vehicles: ఈ-బైక్, ఈ-స్కూటర్, ఈ-రిక్షా.. హైటెక్స్ ‘ఈవీ ఎక్స్‌పో’ అదుర్స్!
ABN, Publish Date - Dec 13 , 2024 | 04:01 AM
పెట్రో ధరలు మండుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్(బీఎంఎస్), నాణ్యతాప్రమాణాల విషయంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను తీసుకొచ్చిన నేపథ్యంలో.. విభిన్న రకాల ఈ-వాహనాలు మార్కెట్లకు పోటెత్తుతున్నాయి.
రూ.26 వేల నుంచి 1.20 లక్షల్లో ధరలు
11 వేలతో ఈవీ చార్జింగ్ స్టేషన్ పెట్టొచ్చు
గ్రామగ్రామంలో ఈవీ చార్జింగ్ స్టేషన్!
వర్కాస్ ఆటో సీఈవో రాం వేమిరెడ్డి
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): పెట్రో ధరలు మండుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్(బీఎంఎస్), నాణ్యతాప్రమాణాల విషయంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను తీసుకొచ్చిన నేపథ్యంలో.. విభిన్న రకాల ఈ-వాహనాలు మార్కెట్లకు పోటెత్తుతున్నాయి. గురువారం మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన గ్రీన్ వెహికిల్ ఎక్స్‌పో-2024ను రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ద్విచక్ర వాహనాలతోపాటు.. పాల వాహనాలు, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీం వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిల్లో.. వింగ్స్ పవర్ నిర్వాహకులు ‘సిగ్నల్ లైట్’ పేరుతో ఈ-స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ధర రూ.26,500 అని చెప్పారు. 1-2 యూనిట్ల కరెంటు ఖర్చుతో ఈ-స్కూటర్‌పై 45 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అదేవిధంగా స్పోర్ట్స్ బైక్ మాదిరిగా ఆకట్టుకుంటున్న ఎన్‌కే ఈ-బైక్ ధర రూ.1.20 లక్షలుగా ఉంది. దీన్ని 4 గంటల పాటు 6 యూనిట్ల కరెంటుతో చార్జ్ చేస్తే.. 120 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఇక ఇదే కంపెనీకి చెందిన ఈ-రిక్షాను ఒకసారి చార్జ్ చేస్తే.. గంటకు 25-40 కిలోమీటర్ల వేగంతో.. 110 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.
5 క్వింటాళ్ల సరుకును తరలించే సామర్థ్యం ఈ వాహనానికి ఉంది. రూ. 11 వేల పెట్టుబడితో పాన్‌షాపులు, కిరాణా దుకాణాల వద్ద ఈవీ చార్జర్లను ఏర్పాటు చేసుకునేలా ‘చార్జింగ్ స్టేషన్’ పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వర్కాస్ ఆటోమొబైల్ ఫౌండర్, సీఈవో రాం వేమిరెడ్డి వెల్లడించారు. తెలంగాణలో 25 వేల చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు ఆయన వివరించారు. భవిష్యత్‌లో ప్రతి గ్రామంతోపాటు.. కిలోమీటరు దూరానికి ఒక ఈవీ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనుకునేవారు 9154758247, 9024482830 నంబర్లకు ఫోన్ చేయవచ్చన్నారు. కాగా.. తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు బి.అశోక్‌కుమార్ గౌడ్ ఈ ఎక్స్‌పోలో మాట్లాడుతూ.. కేంద్ర పథకాల తరహాలో రాష్ట్ర ప్రభుత్వం సోలార్ రంగానికి ప్రత్యేక ప్రోత్సాహకాలివ్వాలని కోరారు.
ఈవీ పాలసీతో విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహం
రాష్ట్రంలో కాలుష్య నివారణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి పొన్నం
హైదరాబాద్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాలుష్య నివారణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. విద్యుత్ వాహన (ఈవీ) పాలసీతో ఈవీలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఢిల్లీ తదితర నగరాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉందని, అలాంటి పరిస్థితి హైదరాబాద్‌కు రాకుండా జాగ్రత్తపడాలని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన విద్యుత్ వాహనాలను ఆయన పరిశీలించారు.
Updated Date - Dec 13 , 2024 | 04:01 AM