Bhuvanagiri: ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపులు..
ABN, Publish Date - Oct 22 , 2024 | 04:18 AM
ఎంత దారుణం? ఆ బాల సదనంలోని అనాథ బాలికలకు ఓవైపు ‘బ్యాడ్ టచ్.. గుడ్ టచ్’పై అవగాహన కల్పిస్తుండగానే ఓ వ్యక్తి అక్కడి ఓ బాలికపై తీవ్ర లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
‘బ్యాడ్ టచ్’ అవగాహనలో అటెండర్ దుశ్చర్య
బయటపెడితే చంపేస్తానని హెచ్చరిక
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఘటన
భువనగిరి టౌన్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఎంత దారుణం? ఆ బాల సదనంలోని అనాథ బాలికలకు ఓవైపు ‘బ్యాడ్ టచ్.. గుడ్ టచ్’పై అవగాహన కల్పిస్తుండగానే ఓ వ్యక్తి అక్కడి ఓ బాలికపై తీవ్ర లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో ఈ నెల 14వ తేదీన జరిగిన ఘోరానికి సంబంఽధించి వివరాలిలా ఉన్నాయి. అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎ్‌సఏ) ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన బాలసదనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎల్‌ఎ్‌సఏ సెక్రటరీతో పాటు వచ్చిన అటెండర్ వెంకటరెడ్డి.. ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలికలకు బ్యాడ్ టచ్.. గుడ్ టచ్‌పై డిఫెన్స్ కౌన్సిల్ అవగాహన కల్పిస్తున్న క్రమంలో ఓ బాలిక మరుగుదొడ్డికి వెళ్లి తిరిగి వచ్చే సమయంలో అటెండర్ వెంకటరెడ్డి ఆ బాలిక ఛాతీపై చెయ్యి వేయడంతోపాటు పెదవులపై పళ్ల గాటు పడేలా కొరికాడు.
మరో బాలికతోనూ అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. పైగా విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో భయపడిన బాలికలు తమ గదిలోకి వెళ్లిపోయారు. కార్యక్రమం ముగిశాక బాలికలు అదో రకంగా ఉండటాన్ని గమనించిన బాలసదనం సిబ్బంది వారిని ప్రశ్నించగా తమపై అటెండర్ వెంకట్‌రెడ్డి లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పారు. తమ శరీరంపై గాయాలను చూపించారు. ఈ విషయాన్ని బాలసదనం సూపరింటెండెంట్ లలిత జిల్లా బాలల పరిరక్షణ అధికారి (డీసీపీవో) సైదులు, సీడబ్ల్యూసీ చైర్మన్ జయశ్రీ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సూపరింటెండెంట్ నరసింహారావు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి (పీఓఐసీ) అలివేలు సమాచారమిచ్చింది.
పోక్సో చట్టం ప్రకారం బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడినా, లైంగిక దాడి చేసినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంది. అయితే డీసీపీవో సదరు వ్యక్తిపై పోక్సో చట్టం కింద ఫిర్యాదు చేయలేదు. అంతేకాక తమ ఉద్యోగాలకు ఇబ్బంది కలుగుతుందని విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు సమాచారం. ఆదివారం విషయం బయటకు రావడంతో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ అవుట్ సోర్సింగ్ అటెండర్‌గా పనిచేస్తున్న వెంకట్‌రెడ్డిపై పట్టణ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. లోతైన దర్యాప్తునకు కలెక్టర్ హనుమంతు కె.జెండగే ఆదేశాలు జారీ చేశారు. కాగా ఘటనపై స్పష్టత కొరవడటం, బాధిత బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చాక పోలీసులకు ఫిర్యాదు చేయాలని సంబంధిత శాఖ అధికారుల నిర్ణయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని బాల సదనం సూపరింటెండెంట్ లలిత పేర్కొన్నారు.
Updated Date - Oct 22 , 2024 | 04:18 AM