Harish Rao: మూసీ కంపు కంటే సీఎం చెప్పే కంపే ఎక్కువ
ABN, Publish Date - Dec 22 , 2024 | 04:43 AM
సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చారని, అబద్ధాల పాలనే చేస్తున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి.. దేవుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి
హైదరాబాద్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చారని, అబద్ధాల పాలనే చేస్తున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. అసెంబ్లీ ఆవరణలోని బీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూసీ కంపు కంటే ముఖ్యమంత్రి చెప్పే కంపే ఎక్కువ ఉందని, ఏడాదిగా చేసింది ఏమీ లేదన్నారు. ఇక దేవుడే ఈ రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడాలని పేర్కొన్నారు. రైతు భరోసా ఎప్పుడిస్తారో, ఎంత ఇస్తారో చెప్పలేదన్నారు.
అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు చెబుతున్నారని, ఈ సమావేశాల్లో ప్రభుత్వం తేలిపోయిందన్నారు. తాము ఫార్మా సిటీలో ఏ కంపెనీకి ఎకరా భూమి ఇవ్వలేదని, కానీ అగ్గువకు భూములు ఇచ్చినట్లు సీఎం చెబుతున్నారన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ వద్దన్నామని, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ వద్దన్నామని ఇలా అసెంబ్లీ సాక్షిగా ఇన్ని అబద్ధాలు ఆడిన సీఎంను తాను ఎప్పుడూ చూడలేదన్నారు. 15 ఆగస్టులోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని తాను బల్లగుద్ధి చెప్పానని, కానీ సీఎం మోసం చేశారన్నారు. ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా శాసన సభలో సమస్యలు ఎత్తి చూపామన్నారు.
Updated Date - Dec 22 , 2024 | 04:43 AM