కొత్తగా 4 డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్
ABN, Publish Date - Nov 13 , 2024 | 05:21 AM
నాసిరకం, నకిలీ మందులు తయారు చేసే వారితో పాటు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ(డీసీఏ) అధికారులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
అవసరమైన మేర డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల భర్తీ
కలెక్టరేట్లలో ఫిర్యాదుల కోసం విభాగాలు అధికారులతో మంత్రి దామోదర
హైదరాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): నాసిరకం, నకిలీ మందులు తయారు చేసే వారితో పాటు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ(డీసీఏ) అధికారులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఔషధ పరిశ్రమలు, తయారీ కేంద్రాలు, మందుల దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు చేయాలని సూచించారు. మంగళవారం డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు, తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్(టీజీఎంఎ్‌సఐడీసీ) అధికారులతో మంత్రి దామోదర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ ఒక్కటే ఉందని, దీనివల్ల ఎక్కువ నమూనాలను పరీక్షించలేకపోతున్నామని డీసీఏ అధికారులు మంత్రికి తెలిపారు. పదేళ్లలో కొత్తగా డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్ రాలేదని, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల సంఖ్యను పెంచలేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై దామోదర స్పందించారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ ఆధునీకరణ, కొత్తగా 4 ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డీసీఏ ఉన్నతాధికారులను ఆదేశించారు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు.
సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి అవసరమైన పోస్టులు మంజూరు చేయిస్తామని తెలిపారు. ఔషధాలకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్లలో కంప్లయింట్ సెల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్‌పై ఫిర్యాదుల స్వీకరణ, ఆకస్మిక తనిఖీల కోసం ేస్టట్ విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఔషధాల ధరలు, నాణ్యతలో నిబంధనలు ఉల్లఘించే ఆస్పత్రుల సమాచారాన్ని డీఎంహెచ్‌వోలకు అందజేయాలని.. ఆయా హాస్పిటళ్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. టీజీఎంఎ్‌సఐడీసీకి మందులు సరఫరా చేసే సంస్థల తయారీ యూనిట్లను డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు తనిఖీ చేయాలని, తరచూ ఔషధాల నమూనాలను పరీక్షించాలని ఆదేశించారు. నిబంధనలు పాటించకపోయినా, నాసిరకం మందులు అని తేలినా ఆయా సంస్థలను బ్లాక్‌లిస్టులో పెట్టాలని సూచించారు.
Updated Date - Nov 13 , 2024 | 05:21 AM