Heavy Rains: జర పైలం.. ఈ జిల్లాలకు రేపు భారీ వర్ష సూచన
ABN, Publish Date - Sep 21 , 2024 | 08:21 PM
ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో వాయవ్య, పరిసర మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్: ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో వాయవ్య, పరిసర మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం మరో ఆవర్తనం పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు చెప్పింది. దీంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఇవాళ ఉదయం నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్‌లో ఇవాళ సాయంత్రం ఆకాశం మేఘావృతమైంది. రాత్రి 7 గంటల నుంచి సిటీలోని చాలా ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరుగుపయనమైన వారు ఒక్కసారిగా రోడ్లపైకి రావడం, అదే సమయంలో వర్షం కురవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఆవర్తనం ప్రభావంతో ఆదివారం సైతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. భారత వాతావరణ శాఖ మరో రెండ్రోజులపాటు రాష్ట్రానికి యెల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఈ జిల్లాల్లో కుంభవృష్టి..
జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, నారాయణపేట్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్గొండ, ములుగు, ఖమ్మం, సంగారెడ్డి జిల్లాల్లో శనివారం కుంభవృష్టి కురిసింది. కోఠి, బషీర్‌బాగ్, అబిడ్స్, నాంపల్లి, కోరి, నారాయణగూడ, ముషీరాబాద్, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, ఉప్పల్, ఎల్‌బీ నగర్, కంటోన్మెంట్, నాగోల్, తార్నాక, నాంపల్లి, లక్డీ కపూల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్ఆర్‌నగర్, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ తెలిపింది.
Prasadam Row: ప్రసాదంలోనూ.. గీ..కుడేనా!?
Ghee: స్వచ్చమైన నెయ్యిని ఎలా గుర్తించాలి? తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వెనుక బయటపడిన నిజాలేంటి?
Updated Date - Sep 21 , 2024 | 08:37 PM