High Court: మునిసిపాలిటీ అనుమతి ఉంటేనే నిర్మాణాలు
ABN, Publish Date - Oct 27 , 2024 | 03:46 AM
శాశ్వత నిర్మాణాలైనా తాత్కాలికమైనవైనా మునిసిపాలిటీ అనుమతి ఉంటేనే చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. మునిసిపాలిటీకి ఉన్న ఆ అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని తేల్చి చెప్పింది.
వాటి అధికారాల్లో జోక్యం చేసుకోలేం: హైకోర్టు
హైదరాబాద్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): శాశ్వత నిర్మాణాలైనా తాత్కాలికమైనవైనా మునిసిపాలిటీ అనుమతి ఉంటేనే చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. మునిసిపాలిటీకి ఉన్న ఆ అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని తేల్చి చెప్పింది. అమీన్‌పూర్ వద్ద తమ వ్యవసాయ భూమిలో తాత్కాలిక ప్రహరీ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి భార్య ఉమామహేశ్వరమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమిలో తాము వేసుకున్న షెడ్లు, ప్రహరీని హైడ్రా కూల్చివేయడం చెల్లదని పేర్కొన్నారు.
ఇవి ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయని పేర్కొంటూ 45 రోజుల కింద హైడ్రా కూల్చేసిందని, అందువల్ల తాత్కాలిక ప్రహరీ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం.. స్థానిక మునిసిపాలిటీ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టలేరని తెలిపింది. నిర్మాణాలు చేపట్టబోయే స్థలాన్ని పరిశీలించిన తర్వాత మునిసిపాలిటీ అనుమతులు జారీచేస్తుందని, అందులో తాము జోక్యం చేసుకోలేమంటూ పిటిషనర్ విజ్ఞప్తిని తిరస్కరించింది.
Updated Date - Oct 27 , 2024 | 03:46 AM