High Court: బఫర్‌జోన్‌లో నూతన నిర్మాణాలు చేపట్టొద్దు
ABN, Publish Date - Aug 31 , 2024 | 03:53 AM
బఫర్‌జోన్‌లో నూతన నిర్మాణాలు కొనసాగించవద్దని, నూతన నిర్మాణాల విషయంలో అలాగే ముందుకు వెళ్తే సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని హైకోర్టు తెలిపింది.
ఎమ్మెల్యే పల్లాకు హైకోర్టు ఆదేశాలు
కూల్చేముందు నోటీసులివ్వాలని హైడ్రాకు స్పష్టీకరణ
హైదరాబాద్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): బఫర్‌జోన్‌లో నూతన నిర్మాణాలు కొనసాగించవద్దని, నూతన నిర్మాణాల విషయంలో అలాగే ముందుకు వెళ్తే సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని హైకోర్టు తెలిపింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన గాయత్రి, అనురాగ్, నీలిమ తదితర విద్యాసంస్థలకు ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం కుర్రెముల నడెం చెరువు సమీపంలో 17.21 ఎకరాల్లో ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి విద్యాసంస్థలను కూల్చేముందు నోటీసులు ఇచ్చి చట్టబద్ధంగా వ్యవహరించాలని హైడ్రా, రెవెన్యూ, నీటిపారుదలశాఖలను ఆదేశించింది. కూల్చివేతలను అడ్డుకోవాలని ఆయా విద్యాసంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ టి. వినోద్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
గత ఆదేశాల మేరకు.. నడెం చెరువు 61 ఎకరాల్లో విస్తరించి ఉన్నట్లు నిరూపించే 1954-55ల నాటి కాస్ర పహాణీని ప్రభుత్వ న్యాయవాది ఎస్. రాహుల్‌రెడ్డి హైకోర్టుకు సమర్పించారు. పల్లా విద్యాసంస్థలు బఫర్‌జోన్‌లో నిర్మించారని పేర్కొన్నారు. బఫర్‌జోన్‌లో నూతన నిర్మాణాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. బఫర్‌జోన్‌లో నూతన నిర్మాణాలు కొనసాగించవద్దని.. అనుమతులు తెచ్చుకున్నప్పటికీ వాటిని మోసపూరితమైనవిగానే భావించాల్సి వస్తుందని తెలిపింది.
Updated Date - Aug 31 , 2024 | 03:53 AM