HIV: పెరిగిన ఎయిడ్స్ కేసులు
ABN, Publish Date - Nov 30 , 2024 | 04:01 AM
తెలంగాణలో ఈ ఏడాది హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు పెరిగాయి. ప్రధానంగా మూడు, నాలుగు జిల్లాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.
రాష్ట్రంలో ఈ ఏడాది 10,754 కేసులు
మిజోరం తర్వాత రాష్ట్రంలోనే ఎక్కువ
హైదరాబాద్‌లో అత్యధికంగా నమోదు
రేపు (డిసెంబరు 1) ప్రపంచ ఎయిడ్స్ దినం
హైదరాబాద్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఈ ఏడాది హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు పెరిగాయి. ప్రధానంగా మూడు, నాలుగు జిల్లాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. అయితే, మెజారిటీ జిల్లాల్లో నాలుగేళ్ల క్రితం నమోదైన కేసులతో పొల్చితే.. ప్రస్తుతం వ్యాప్తి రేటు మాత్రం తక్కువగా ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర ఏయిడ్స్ కంట్రోల్ సొసైటీ గణాంకాలు చెబుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 11.95 లక్షల మందికి హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించగా.. 10,754(0.89ు) మందికి పాజిటివ్ వచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 7,78,020 మందికి హెచ్‌ఐవీ పరీక్షలు చేయగా.. 10,651(1.36ు) మందికి పాజిటివ్ వచ్చింది. 2018లో నేషనల్ ఏయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (న్యాకో) లెక్కల ప్రకారం.. ఎయిడ్స్ వ్యాప్తిలో మిజోరం దేశంలో మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఆ ఏడాది తెలంగాణలో కొత్తగా 11,820 కేసులు నమోదయ్యాయి. 2019-20 కేసులతో పొల్చితే ఈ ఏడాది 103 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
పాలమూరులో వ్యాప్తి రేటు ఎక్కువ
రాష్ట్రంలో హెచ్‌ఐవీ వ్యాప్తి రేటు మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా ఉంది. ఉమ్మడి జిల్లాల పరంగా చూసినా కూడా తెలంగాణలో అత్యఽధిక పాజిటివ్ రేటు అక్కడే రికార్డు అయింది. గత ఆర్థిక సంవత్సరంలో 1.73 శాతం వ్యాప్తిరేటుతో పాలమూరు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. నాలుగేళ్ల క్రితం ఈ రేటు 2.75 శాతంగా ఉండడం గమనార్హం. ఆ తర్వాత 1.66ు వ్యాప్తిరేటుతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. అత్యధిక కేసుల విషయానికొస్తే హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. రాజధానిలో నాలుగేళ్ల క్రితం 1944 హెచ్‌ఐవీ పాజిటివ్‌లు నమోదు కాగా.. 2023-24లో 2043 కేసులు వచ్చాయి. హైదరాబాద్ తర్వాత రెండో స్థానంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఉంది. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో ఎయిడ్స్ ప్రభావం మెల్లమెల్లగా తగ్గుతున్నట్టు కనిపిస్తున్నా.. కొన్ని జిల్లాల్లో మాత్రం కేసులు ఇంకా అలాగే ఉంటున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. జాతీయ రహదారులు ఆ జిల్లాల గుండా వెళ్లడంతో పాటు.. ఇంకా అక్కడి జనాభాకు ఎయిడ్స్‌పై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు. కాగా.. పలు జిల్లాల్లో హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారిలో కొంతమంది ఆ తర్వాత వైద్య శాఖ కన్నుగప్పి తప్పించుకుంటున్నారు. ఉదాహరణకు హైదరాబాద్‌లో 2043 కేసులు రాగా, అందులో 1982 మందే రిట్రో థెరపీ వైద్య సేవలు పొందుతున్నారు. మిగతా 51 మందిని ట్రేస్ చేయలేక వైద్యశాఖ సిబ్బంది బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 544 మంది రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సిబ్బందికి దొరకడం లేదు.
అప్పుడెన్ని? ఇప్పుడెన్ని?
నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం
రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలవారీగా కేసులు...
ఉమ్మడి జిల్లాలు 2019-20లో పాజిటివ్ 2023-24లో పాజిటివ్
కొత్త కేసులు రేటు (%) కొత్త కేసులు రేటు (%)
ఆదిలాబాద్ 440 0.63 327 0.26
హైదరాబాద్ 1944 1.84 2043 1.66
కరీంనగర్ 713 1.23 593 0.99
ఖమ్మం 988 0.92 918 0.46
మహబూబ్‌నగర్ 1407 2.03 1597 1.73
మెదక్ 1097 1.74 1187 0.94
నల్గొండ 1180 1.75 1081 0.85
నిజామాబాద్ 808 1.26 852 0.69
రంగారెడ్డి 1312 1.64 1012 1.45
వరంగల్ 762 0.82 816 0.65
10651 1.37 10754 0.89
Updated Date - Nov 30 , 2024 | 04:01 AM