Hyderabad: నెలలో మూడింతలైన ‘డెంగీ’...
ABN, Publish Date - Aug 03 , 2024 | 11:08 AM
దోమల నివారణ చర్యలు ముమ్మరం చేశాం. యాంటీ లార్వల్ ఆపరేషన్ (ఏఎల్‌ఓ), ఫాగింగ్ విస్తృతంగా చేస్తున్నాం. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాం’ అని అధికారులు చెబుతున్నారు. అయినా డెంగీ(Dengue) కేసుల సంఖ్య తగ్గకపోగా ఏకంగా మూడు రెట్లు అధికమయ్యాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. డెంగీ సీజన్‌గా చెప్పుకునే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లో పరిస్థితి..? ఏంటనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
- తీవ్రస్థాయిలో నమోదవుతున్న కేసులు
- అనధికారికంగా నాలుగింతలపైనే..
- బాధితుల్లో చిన్నారులే ఎక్కువ
- నివారణ చర్యలు ఎక్కడ..?
- ప్రకటనలతో జీహెచ్‌ఎంసీ హడావిడి
- క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు
జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్‌లో రోజూ 10 డెంగీ(Dengue) కేసులు నమోదవుతున్నాయి. జూలైలో 290 మందికి డెంగీ నిర్ధారణ అయ్యిందని రికార్డులు చెబుతున్నాయి. జూన్‌లో రోజుకు మూడు చొప్పున 91 కేసులు నమోదు కాగా.. నెల రోజుల్లో కేసుల సంఖ్య మూడింతలు పెరిగింది. అనధికారికంగా ఈ సంఖ్య మూడు, నాలుగింతలు అధికంగా ఉంటుంది.
హైదరాబాద్ సిటీ: ‘దోమల నివారణ చర్యలు ముమ్మరం చేశాం. యాంటీ లార్వల్ ఆపరేషన్ (ఏఎల్‌ఓ), ఫాగింగ్ విస్తృతంగా చేస్తున్నాం. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాం’ అని అధికారులు చెబుతున్నారు. అయినా డెంగీ(Dengue) కేసుల సంఖ్య తగ్గకపోగా ఏకంగా మూడు రెట్లు అధికమయ్యాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. డెంగీ సీజన్‌గా చెప్పుకునే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లో పరిస్థితి..? ఏంటనే ఆందోళన వ్యక్తం అవుతోంది. రోజుకు పది కేసుల నమోదు అధికారిక లెక్కల ప్రకారమే. అనధికారికంగా ఈ సంఖ్య మూడు, నాలుగింతలు అధికంగా ఉంటుంది. అంటే నగరంలో ఇప్పుడు నిత్యం 30 నుంచి 40 మందికిపైగా డెంగీ బారిన పడుతున్నారు. కరోనా అనంతరం ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే ప్రథమమని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. దోమల తీవ్రత తగ్గకపోతే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: థాంక్యూ సీఎం సార్..
లార్వా దశలో నివారణ ఏది..?
మాన్‌సూన్.. దోమల వృద్ధికి అనువైన కాలం. నిల్వ ఉన్న నీటిలో ఉత్పత్తి అయ్యే లార్వా దోమగా రూపాంతరం చెందుతోంది. గుర్రపు డెక్కలుండే చెరువులు.. మురుగు నీటి కాలువలే కాదు.. ఇంటి పరిసరాల్లోని పూల కుండీల కింద ఉండే ప్లేట్లు, టైర్లు, కూలర్లు, తాగి పడేసిన కొబ్బరిబొండాలు, ప్లాస్టిక్ వస్తువుల్లో నిలిచే నీరు దోమల వృద్ధికి ఆవాసాలుగా మారుతున్నాయి. లార్వా దశలో దోమల వృద్ధిని నివారించడంలో జీహెచ్‌ఎంసీ((GHMC)) పూర్తిగా విఫలమవుతోంది. ప్రతి వారం నిర్ణీత ప్రాంతాల్లో ఏఎల్‌ఓ.. డ్రై డేలో భాగంగా నీటి నిల్వలు లేకుండా చూసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉన్నా.. యంత్రాంగం పట్టించుకోవడం లేదు. నగరంలోని మెజార్టీ ఏరియాల్లో నెలకు ఒకటి, రెండు పర్యాయాలు కూడా ఏఎల్‌ఓ జరగడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే దోమల తీవ్రత పెరగడానికి ప్రధాన కారణం.
బల్దియాలోని ఎంటమాలజీ విభాగంలో 2500 మంది సిబ్బంది ఉన్నారు. నిర్ణీత ప్రాంతాల్లో ఏఎల్‌ఓ చేయాల్సి ఉన్నా, పై అధికారుల పర్యవేక్షణ లోపంతో నివారణ చర్యలు గాడి తప్పాయి. అదనపు, జోనల్, డిప్యూటీ, అసిస్టెంట్ మునిసిపల్ కమిషనర్లు, ఏఎంఓహెచ్‌లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కమిషనర్ ఆదేశించినా పట్టించుకునే వారు కరువయ్యారు. రసాయనాలు, యంత్రాలు, సిబ్బంది వేతనాల కోసం ఏటా రూ.15 కోట్లు ఎంటమాలజీ విభాగం ఖర్చు చేస్తోంది. అయినా ఏటికేడు డెంగీ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి.
నీటి నిల్వలు, చెత్త కుప్పలు, మురుగు పరుగు
గ్రేటర్‌లో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరగకపోవడంతో రోడ్లపై చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. పలు ప్రాంతాల్లో తరచూ మురుగు పరుగులు తీస్తోంది. నీటి నిల్వలు.. చెత్త కుప్పలు.. మురుగు పరుగుతో నెలకుంటున్న అపరిశుభ్ర వాతావరణంతో సీజనల్ వ్యాధులు ముసురుకుంటున్నాయి. బస్తీ దవాఖానాలు, ప్రైవేట్ క్లినిక్‌లకు వస్తున్న జ్వరపీడితుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. ఇందులో డెంగీ బాధితులూ ఉంటున్నారని బస్తీ దవాఖానా వైద్యుడొకరు తెలిపారు. ఎక్కువగా చిన్నారులే డెంగీ బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ‘ప్రజలూ బాధ్యతాయుతంగా ఉండాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి’ అని సీనియర్ డాక్టర్ ఒకరు సూచించారు.
ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు
ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి
ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Updated Date - Aug 03 , 2024 | 11:09 AM