Hyderabad: పాలు విరిగిపోయాయని గృహిణికి చిత్రహింసలు
ABN, Publish Date - May 31 , 2024 | 10:56 AM
పాలు విరిగిపోయాయనే సాకును చూపి గృహిణిని మూడురోజులు ఓ గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేసిన భర్త, అతని కుటుంబీకుల ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- మూడు రోజులు గదిలో బంధించిన భర్త
- బెల్టుతో చితకబాదిన అత్తింటి కుటుంబీకులు
- చనిపోయిందంటూ పుట్టింటికి ఫోన్
- ఎల్లారెడ్డిగూడ హబీబ్‌నగర్‌లో ఆలస్యంగా వెలుగులోకి..
హైదరాబాద్: పాలు విరిగిపోయాయనే సాకును చూపి గృహిణిని మూడురోజులు ఓ గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేసిన భర్త, అతని కుటుంబీకుల ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒళ్లంతా వాతలు తేలేలా బెల్టు, ఇతర సామగ్రితో చితకబాది సృహకోల్పోయేలా చేశారు. ఆ తర్వాత ఆమె పుట్టింటికి ఫోన్ చేసి ‘మీ అమ్మాయి చనిపోయింది.. తీసుకెళ్లండి’ అని చెప్పిన అమానవవీయ ఘటన మధురానగర్ పోలీస్‌స్టేషన్(Madhuranagar Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.
ఇదికూడా చదవండి: Hyderabad: కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత..
ఎల్లారెడ్డిగూడ హబీబ్‌నగర్‌కు చెందిన అక్మల్ హుస్సేన్ నగరంలో ఓ ఎమ్మెల్యే వద్ద డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి గతంలో వివాహం జరిగింది. అయితే, వేధింపులు భరించలేక భార్య అతన్ని విడిచిపెట్టింది. ఆ విషయం దాచిపెట్టిన అక్మల్ సనత్‌నగర్ అల్లాఉద్దీన్ కోటికి చెందిన హీనాబేగంను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో రూ.2లక్షల నగదు, నాలుగున్నర తులాల బంగారం ఇచ్చారు. ఆ తర్వాత అక్మల్‌కు ముందే పెళ్లైన విషయం తెలిసిన హీనా మనస్తాపం చెందినా.. కొద్దిరోజులకు సర్దుకుంది. ఈ క్రమంలో వీరికి ఒకబాబు, పాప పుట్టారు. అయితే, అత్త అఫ్రోజ్ జహాన్, మరిది తబ్రేజ్, ఆడపడుచు సోని, ఆమె భర్త ఆయూబ్‌లు అదనపు కట్నం కోసం హీనాను వేధిస్తూ, ఆమెపై దాడి చేసేవారు. ఈ విషయం భర్తకు చెబితే అతను మరింతగా కొట్టేవాడు. దీంతో హీనా తల్లిదండ్రులు అప్పు తీసుకువచ్చి మరో రూ.2.5లక్షలు ఇచ్చారు. ఆ డబ్బు తీసుకున్న కొద్దిరోజులకే మరింత డబ్బు కోసం మళ్లీ హీనాను వేధించడం మొదలుపెట్టారు.
పాలు విరిగిపోయాయని..
పొయ్యిమీద పాలు పెట్టి సరిగా చూడనందువల్లే అవి విరిగిపోయాయని గొడవ చేసి మూడురోజుల క్రితం అక్మల్‌తో పాటు కుటుంబీకులంతా కలిసి హీనాపై దాడి చేశారు. ఓ గదిలో బంధించి చేతులు, కాళ్లపై బెల్ట్, ఇతర సామగ్రితో ఇష్టానుసారంగా బాదుతూ చిత్రహింసలు పెట్టారు. వీటిని భరించలేక హీనా స్పృహ కోల్పోయింది. దీంతో అక్మల్ కుటుంబీకులు హీనా తల్లిదండ్రులకు ‘మీ అమ్మాయి చనిపోయింది.. తీసుకెళ్లండి’ అని ఫోన్ చేసి చెప్పారు. అపస్మారక స్థితిలో ఉన్న హీనాను వారు వెంటనే అమీర్‌పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
హీనా ఒళ్లంతా గాయాలు, వాతలతో చిత్రహింసలకు గురైందని, బయటకు కనపడని దెబ్బలు బలంగా తగిలాయని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. గురువారం సాయంత్రం యూసుఫ్‌గూడ మహిళా పోలీస్‌స్టేషన్‌లో భర్త అక్మల్, అతని కుటుంబీకులపై హీనా ఫిర్యాదు చేసింది. అంతకుముందు మధురానగర్ పోలీసులకు కూడా ఆమె ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్ రోజున.. తగ్గిన పొల్యూషన్
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - May 31 , 2024 | 10:56 AM