Hyderabad : పిల్లి తిన్నాకే..
ABN, Publish Date - Jul 17 , 2024 | 03:56 AM
జేఎన్‌టీయూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతవారం సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూ మెస్‌లో.. చట్నీలో ఎలుక చక్కర్లు కొట్టిన ఘటన మరువక ముందే తాజాగా సోమవారం హైదరాబాద్ జేఎన్‌టీయూ ....
జేఎన్‌టీయూ హాస్టళ్లలో దారుణంగా ఆహార నిర్వహణ
కొద్దిరోజుల క్రితం సుల్తాన్‌పూర్‌లో.. చట్నీలో ఎలుక
ఇప్పుడు హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ మెస్‌లో పిల్లి
అధికారుల పర్యవేక్షణ కరవు.. విద్యార్థుల్లో ఆందోళన
రెగ్యులర్ వీసీ లేక.. ఇన్‌చార్జ్ వీసీ రాక.. సమస్యల తిష్ఠ
హైదరాబాద్ సిటీ, జూలై16 (ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతవారం సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూ మెస్‌లో.. చట్నీలో ఎలుక చక్కర్లు కొట్టిన ఘటన మరువక ముందే తాజాగా సోమవారం హైదరాబాద్ జేఎన్‌టీయూ హాస్టల్ మెస్‌లో వండిన ఆహార పదార్ధాలను పిల్లి తింటున్న వైనం వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా.. విద్యార్థులు భోజనం చేశాక మిగిలిన ఆహార పదార్థాలను సిబ్బంది అలాగే వదిలేశారని బదులిచ్చారు. ఆహారాన్ని భద్రంగా ఉంచేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వార్డెన్లను ఆదేశించినట్లు తెలిపారు. అయితే.. వేలాదిమంది విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లలోని భోజనశాలల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం దురదృష్టకరమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెస్‌ల్లో సిబ్బంది నిర్లక్ష్యంతో పాటు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కూడా స్పష్టంగా కనిపిస్తోందని విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీకి రెండు నెలలుగా రెగ్యులర్ వైస్ చాన్స్‌లర్ లేకపోవడం, ఇన్‌చార్జ్ వీసీగా ఉన్న ఐఏఎస్ అధికారి విద్యార్థులకు అందుబాటులో ఉండకపోవడంతో.. హాస్టళ్లలో సమస్యలన్నీ ఎక్కడవేసిన గొంగళి అక్కడేనన్న చందంగా మారాయి. జేఎన్‌టీయూ క్యాంటిన్‌లో కాలం చెల్లిన బియ్యం పిండితో ఆహారపదార్థాలు తయారు చేస్తున్న విషయం ఫుడ్‌సేఫ్టీ కమిషనర్ తనిఖీల్లో ఇటీవలే వెల్లడైంది. అయినా ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. వర్సిటీ అనుబంధ కళాశాలల్లోని హాస్టల్ మెస్‌లు, క్యాంటీన్లలో ఆహారపదార్ధాలను భద్రపరిచేందుకు అవసరమైన వసతులు లేవని కాంట్రాక్టర్లు సైతం వాపోతున్నారు. భోజనశాలల్లో వసతుల కల్పన గురించి పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక.. జేఎన్‌టీయూ హాస్టళ్లలో విద్యార్థుల హాస్టళ్లు, మెస్‌లను పర్యవేక్షించాల్సిన వార్డెన్లకు.. వర్సిటీ ఉన్నతాధికారులు అదనపు బాధ్యతలను అప్పగించడం పలు విమర్శలకు తావిస్తోంది. వారంతా ఆయా బాధ్యతల నిర్వహణలో తలమునకలై.. హాస్టళ్లు, మెస్‌ల నిర్వహణను గాలికి వదిలేశారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆధునీకరణ ప్రతిపాదనలు..
జేఎన్‌టీయూకు అనుబంధంగా ఉన్న ఐదు ఇంజనీరింగ్ కాలేజీల హాస్టళ్లను ఆధునీకరించేందుకు రూ.2.27కోట్లతో ప్రతిపాదనలను వర్సిటీ అధికారులు సిద్ధం చేశారు. హాస్టళ్లలో ప్లంబింగ్, సివిల్, ఎలక్ట్రికల్ పనులు, తాగునీటి కోసం ఆర్‌వో సిస్టమ్స్, ఇతర మౌలిక వసతులను కల్పించేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.వెంకటేశ్వరరావు లేఖ రాసినట్లు తెలిసింది. రిజిస్ట్రార్ పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించగానే హాస్టళ్ల ఆధునీకకరణ పనులను వెంటనే చేపడతామని ఇంజనీరింగ్ విభాగం అధికారులు పేర్కొన్నారు.
Updated Date - Jul 17 , 2024 | 03:58 AM