Hyderabad: జేఎన్‌టీయూ నియామకాలపై ఇంటెలిజెన్స్ నజర్.!
ABN , Publish Date - Jan 23 , 2024 | 11:56 AM
జేఎన్‌టీయూలో సిబ్బంది నియామకాలపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం(State Intelligence Department) దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

- నాన్ టీచింగ్ రిటైర్డ్ అధికారుల వివరాలపై ఆరా
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూలో సిబ్బంది నియామకాలపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం(State Intelligence Department) దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రిటైర్డు అధికారుల వివరాలు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించినప్పటికీ, వర్సిటీ ఉన్నతాధికారులు కొందరి విషయంలో గోప్యత పాటించడం వర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కచ్చితమైన వివరాల కోసం ఇటీవల జేఎన్‌టీయూకు ఇంటెలిజెన్స్ అధికారులు రావడం కలకలం రేకెత్తిస్తోంది. అక్రమాలు బయటకు వస్తాయేమోనని ఉన్నతాధికారులు కలవరపాటుకు గురవుతున్నారు.
తండ్రికి లైజన్ ఆఫీసరు.. బిడ్డ టెక్నికల్ ఆఫీసరు..
లైజన్ ఆఫీసరుగా కాకతీయ యూనివర్సిటీలో రిటైరైన అధికారిని కొనసాగిస్తుండడం కూడా అక్రమమేనని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ అధికారి జేఎన్‌టీయూతో పాటు మరికొన్ని వర్సిటీల్లోనూ పనిచేస్తూ వేతనం తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఒకే అధికారి రెండు వేర్వేరు యూనివర్సిటీల్లో వేతనాలు తీసుకుంటుండడంపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ జేఎన్‌టీయూ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని తెలిసింది. ఇదే లైజన్ అధికారి బిడ్డను జేఎన్‌టీయూలో టెక్నికల్ అధికారిగా నియమించడం నిబంధనలను తుంగలో తొక్కడమేనని రెగ్యులర్ ఉద్యోగులు చెబుతున్నారు. ఫార్మసీ విభాగంలో టెక్నికల్ అధికారి పోస్టుల లేకున్నప్పటికీ, యూజీసీ-హెచ్‌ఆర్‌డీ విభాగంలోని పోస్టును నిబంధనలకు విరుద్ధంగా ఫార్మసీకి బదిలీ చేయడం విశేషం. టెక్నికల్ అధికారి పోస్టును ఫార్మసీ విభాగానికి బదిలీ చేస్తూ డిసెంబరు 30న ఉత్తర్వులు జారీచేసిన వర్సిటీ రిజిస్ట్రార్.. 2023 సెప్టెంబరు నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొనడం విచిత్రంగా ఉందంటున్నారు. జనవరి మొదటి వారంలో నియామక ఉత్తర్వు పొందిన టెక్నికల్ ఆఫీసరుకు నాలుగు నెలల ముందునుంచే వేతనం చెల్లించాలని రిజిస్ట్రార్ హుకూం జారీ చేయడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ విషయాలన్నీ ఇంటెలిజెన్స్ అధికారుల చెవికి చేరడంతో.. ఏం జరుగుతుందోనని ఉన్నతాధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు.
ఆ ఆచార్యుల్లో కలవరం
వర్సిటీలో టీచింగ్, నాన్‌టీచింగ్‌లో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగిన అంశం వెలుగులోకి రావడంతో జగిత్యాల జేఎన్‌టీయూ కాలేజీ నుంచి డిప్యుటేషన్‌పై క్యాంపస్ కళాశాలకు వచ్చిన సుమారు 18మంది ఆచార్యులు కలవరపాటుకు గురవుతున్నారు. సోమవారం ఉదయం 10గంటల నుంచే వైస్‌చాన్స్‌లర్‌ను ప్రసన్నం చేసుకునేందుకు పేషీలో క్యూకట్టారు. వర్సిటీ యాజమాన్యంపై ఆరోపణలు చేస్తున్న వారికి, తమకు ఎటువంటి సంబంధం లేదని.. తమ డిప్యుటేషన్‌ను రద్దు చేయవద్దని ప్రాధేయపడినట్లు తెలిసింది.
అవి అడ్డగోలు నియామకాలే..!
వర్సిటీలోని నాన్‌టీచింగ్ విభాగంలో ముగ్గురు అధికారుల నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. వర్సిటీ ఫైనాన్స్ ఆఫీసరు పోస్టుకు కనీసం రెండేళ్ల సర్వీసు మిగిలి ఉన్న అధికారిని నియమించాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ, ఆర్టీసీలో పదవీవిరమణ చేసిన అధికారిని నియమించారు. సదరు ఫైనాన్స్ ఆఫీసరు నియామకాన్ని వర్సిటీ పాలకమండలి వ్యతిరేకించినప్పటికీ, దొడ్డిదారిన డిప్యుటేషన్‌పై నియమించినట్లు ఆరోపణలు ఉన్నాయి.