Hyderabad: నో‘డల్’ ఆఫీసర్లు బయటకొచ్చారు..
ABN, Publish Date - Nov 15 , 2024 | 08:28 AM
జీహెచ్‌ఎంసీ(GHMC) కేంద్ర కార్యాలయంలోని కొందరు అధికారులు ఎట్టకేలకు బయటకొచ్చారు. విధి నిర్వహణలో భాగంగా రెగ్యులర్‌గా క్షేత్రస్థాయిలో పర్యటించాల్సి ఉన్నా.. చాంబర్‌లకే పరిమితమవుతున్న పలువురు అధికారులు ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే నేపథ్యంలో కాలు కదిపారు.
- ఎట్టకేలకు క్షేత్రస్థాయిలో పర్యటన
- ఎన్యూమరేటర్ల గైర్హాజరు.. సర్వేలో జాప్యం
- 5,90,171 కుటుంబ వివరాల సేకరణ పూర్తి
హైదరాబాద్ సిటీ: జీహెచ్‌ఎంసీ(GHMC) కేంద్ర కార్యాలయంలోని కొందరు అధికారులు ఎట్టకేలకు బయటకొచ్చారు. విధి నిర్వహణలో భాగంగా రెగ్యులర్‌గా క్షేత్రస్థాయిలో పర్యటించాల్సి ఉన్నా.. చాంబర్‌లకే పరిమితమవుతున్న పలువురు అధికారులు ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే నేపథ్యంలో కాలు కదిపారు. నోడల్ ఆఫీసర్లుగా బాధ్యతలు అప్పగించడంతో తమకు కేటాయించిన సర్కిళ్లలో పర్యటిస్తున్నారు. కొందరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తుండగా.. ఇంకొందరు పరిశీలనకు వెళ్తున్నామంటూ ఇటు ఆఫీసులోను.. అటు క్షేత్రస్థాయిలోనూ కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో వివిధ పనుల నిమిత్తం దూరప్రాంతాల నుంచి బల్దియా కేంద్ర కార్యాలయానికి వస్తున్న పౌరులు నిరాశగా వెనుదిరుగుతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: త్వరలో ‘చలో కొడంగల్’..
ఎన్యూమరేటర్లు హాజరు అంతంతే..
సర్వే నత్తనడకన సాగడానికి పూర్తిస్థాయిలో ఎన్యూమరేటర్లు రాకపోవడమూ కారణమని ఉన్నతాధికారులు గుర్తించారు. యూసీడీ విభాగం మహిళా స్వయం సహాయక సంఘాల హాజరు వివరాలు తీసుకుంటుండగా.. 10-15 శాతం మంది గైర్హాజరవుతున్నట్టు గుర్తించారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులూ కొందరు సర్వేలో పాల్గొనడం లేదని, ఇంకొందరు విద్యార్థులకు బాధ్యతలు అప్పగించినట్లు గుర్తించారు. దీంతో ఎన్యూమరేటర్లు విధులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇప్పటివరకు 5,90,171 ఇళ్ల నుంచి సమాచారం సేకరించినట్లు జీహెచ్‌ఎంసీ గురువారం ప్రకటించింది.
సర్వేను పరిశీలించిన మంత్రి పొన్నం, మేయర్, కలెక్టర్
బంజారాహిల్స్: ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను తెలుసుకుంటేనే ప్రభుత్వం భవిష్యత్తు ప్రళాళికలు రూపొందించేందుకు అవకాశం ఉంటుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బంజారాహిల్స్ మిథులానగర్ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను గురువారం ఆయన, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సర్వే వేగంగా సాగుతోందని, దీంతో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారనుందని అన్నారు. సర్వేపై ప్రజలకు అనుమానాలు అవసరం లేదని, సర్వే వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందబోవని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. సర్వే వివరాలు గోప్యంగా ఉంటాయని.. గతంలో సర్వే చేయాలని దీక్షలు, ధర్నాలకు చేసిన వారు ఇప్పుడు సైలంట్‌గా ఉన్నారన్నారు. అలాగే, ఆధార్‌కార్డు తప్పనిసరి కాదని, వద్దు అనుకునే వారు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
సర్వే వివరాలిచ్చిన ఎంపీ రఘునందన్ , నటుడు ఆర్యన్
నార్సింగ్ : సర్వేలో భాగంగా మణికొండ మున్సిపాలిటీ పరిధిలలో నివాసముంటున్న మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, సినీహీరో ఆర్యన్ రాజేశ్ కుటుంబ వివరాలను సిబ్బంది సేకరించారు. వారిద్దరూ పూర్తి స్థాయి వివరాలు వెల్లడించారని మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: కేసు పెట్టాల్సింది.. సీఎం బ్రదర్స్‌పైనే
ఈవార్తను కూడా చదవండి: మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేశారు
ఈవార్తను కూడా చదవండి: 14 రకాల వివరాలివ్వండి..
ఈవార్తను కూడా చదవండి: ‘లగచర్ల’పై ఉన్నత స్థాయి విచారణ
Read Latest Telangana News and National News
Updated Date - Nov 15 , 2024 | 08:29 AM