Hyderabad: తెరపైకి పాడ్ కార్.. పీఆర్‌టీఎస్‌ను అందుబాటులోకి తెచ్చేనా..
ABN, Publish Date - Nov 12 , 2024 | 12:32 PM
మెట్రో రెండో దశ విస్తరణపై కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో పర్సనలైజ్డ్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పీఆర్‌టీఎస్) రవాణాలో భాగంగా పాడ్ కార్ల అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. మెట్రో స్టేషన్లకు అనుసంధానంగా రద్దీగా ఉండే ప్రాంతాలకు వీటిని నడిపిస్తే బాగుంటుందని నగరవాసులు పేర్కొంటున్నారు.
- బీఆర్‌ఎస్ హయాంలో రెండు మెట్రోస్టేషన్ల నుంచి ప్రతిపాదనలు
- కేంద్రంతో సఖ్యత లేక మరుగుపడిన వైనం
- మెట్రో విస్తరణకు ప్రాధాన్యం ఇస్తున్న కాంగ్రెస్
- పీఆర్‌టీఎస్‌పైనా చిగురిస్తున్న ఆశలు
నగరంలో కొత్త తరహా(పాడ్ కార్) ప్రయాణానికి బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడంతో ఆ ప్రాజెక్టు ఇప్పటికీ ప్రతిపాదనలకే పరిమితమైంది. కాంగ్రెస్ సర్కారు మెట్రో విస్తరణకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో మరోసారి దీనిపై కూడా చర్చ మొదలైంది.
హైదరాబాద్ సిటీ: మెట్రో రెండో దశ విస్తరణపై కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో పర్సనలైజ్డ్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పీఆర్‌టీఎస్) రవాణాలో భాగంగా పాడ్ కార్ల అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. మెట్రో స్టేషన్లకు అనుసంధానంగా రద్దీగా ఉండే ప్రాంతాలకు వీటిని నడిపిస్తే బాగుంటుందని నగరవాసులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ‘ఈవెనింగ్ బీటెక్’కు అరకొరగానే అడ్మిషన్లు
గత ప్రభుత్వంలో ప్రతిపాదనలు
మెట్రో స్టేషన్లకు అనుసంధానంగా పీఆర్‌టీఎస్ రవాణాను నడిపించేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నగరంలోని రెండు ప్రాంతాలను ఎంపిక చేసింది. ఈ మేరకు కారిడార్-3లోని రాయదుర్గం మెట్రోస్టేషన్ నుంచి 7.5 కిలోమీటర్ల పరిధిలోని మైండ్‌స్పేస్, ఇనార్బిట్‌మాల్, అరబిందో, నాలెడ్జిసిటీ, మైహూభుజా, ఐటీసీ కోహినూర్ వరకు ప్రతిపాదించారు. అలాగే కారిడార్-2లోని జేబీఎస్-ఎంజీబీఎస్(JBS-MGBS) మార్గంలో ట్రాఫిక్ తీవ్రత కలిగిన అసెంబ్లీ నుంచి సచివాలయం మీదుగా ప్యారడైజ్ మెట్రోస్టేషన్ వరకు 10 కిలోమీటర్ల మేర పాడ్‌కార్లను నడిపించాలని భావించింది.
ఈ నేపథ్యంలో అప్పటి ఐటీశాఖ మంత్రి కేటీఆర్.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేశారు. అలాగే మెస్బర్స్ అల్ర్టా పీఆర్‌టీ లిమిటెడ్‌తో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (ఎంహెచ్‌ఎఆర్‌ఎల్) ఎంఓయూ కుదుర్చుకున్నట్లు 2022 వార్షిక నివేదికలో ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ఆయా ప్రాంతాల్లో ప్రతిపాదించిన పనులపై అప్పటి సర్కారు ఆసక్తి చూపించకపోవడంతో అడుగు ముందుకు పడని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేని కారణంగా పీఆర్‌టీఎస్ పూర్తిగా మరుగున పడినట్లు విమర్శలున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆశలు..
మెట్రో రెండో దశ విస్తరణపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ మేరకు 6కారిడార్లలో 116.4 కిలోమీటర్ల వరకు మెట్రో కారిడార్లను నిర్మించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతోంది. తొలివిడతగా 5 కారిడార్లను చేపట్టేందుకు రూ.24,269 కోట్ల పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో అత్యంత రద్దీ కలిగిన ప్రాంతాలకు అవసరమయ్యే పీఆర్‌టీఎస్ వ్యవస్థను కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.
నగరంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ మరింత పెరగడంతో పాటు విదేశాలకే పరిమితమైన అధునాతన సౌకర్యాన్ని నగరానికి పరిచయం చేసే అవకాశం ఏర్పడుతోందని రవాణా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ తీవ్రతను పరిశీలించి సాధ్యాసాధ్యాలను అంచనా వేయాలని కోరుతున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు... ఏం జరిగిందంటే..
ఈవార్తను కూడా చదవండి: IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: TG News: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత సుజాత...
ఈవార్తను కూడా చదవండి: Khammam: బోనకల్‌లో యాచకుడికి ఐపీ నోటీసు
Read Latest Telangana News and National News
Updated Date - Nov 12 , 2024 | 12:32 PM