Hyderabad : అంగన్‌వాడీలకు రిటైర్మెంట్ ప్రయోజనాలు
ABN, Publish Date - Jul 17 , 2024 | 05:07 AM
రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్లు, ఆయాలకు ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అందించనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. దీంతో టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష వరకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.
టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష వరకు: మంత్రి సీతక్క
రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు..: సీతక్క
హైదరాబాద్, జూలై 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్లు, ఆయాలకు ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అందించనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. దీంతో టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష వరకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌ను ఆర్ధిక శాఖ ఇప్పటికే పరిష్కరించిందని, రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు విడుదలవుతాయని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ రహ్మత్‌నగర్‌లో ‘అమ్మ మాట-అంగన్‌వాడీ బాట’ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
అంగన్‌వాడీల్లో పనిచేస్తూ రిటైర్ అయినవారికి ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని చెప్పి బీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగానే రిటైర్ అవుతున్న అంగన్‌వాడీలకు ప్రయోజనాలను ప్రకటించిందని వివరించారు. కాగా, అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్యను పెంచేందుకు చేపట్టిన ‘అమ్మ మాట-అంగన్‌వాడీ బాట’ను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క కోరారు. కార్పొరేట్ స్కూళ్లకు తీసిపోనివిధంగా అంగన్‌వాడీలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. పిల్లలను అంగన్‌వాడీలకు పంపండి.. వారి బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుంది అని మంత్రి భరోసానిచ్చారు. మాతృత్వం, మానవత్వాన్ని మేళవించి పిల్లలను అక్కున చేర్చుకోవాలని టీచర్లు, ఆయాలకు సూచించారు. కార్యక్రమానికి ముందు పిల్లలతో కలిసి మంత్రి మొక్కలు నాటించారు.
స్వచ్ఛందంగా తప్పుకొన్నవారికీ ఇవ్వాలి..
స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన అంగన్‌వాడీలకూ ప్రభుత్వం ప్రయోజనాలను వర్తింపజేయాలని, ఉత్తర్వుల్లో పొందుపర్చాలని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్కను తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్-హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం టీచర్లు, ఆయాలకు ప్రకటించిన ప్రయోజనాల పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.
Updated Date - Jul 17 , 2024 | 05:07 AM