Hyderabad: బ్యాంకు లావాదేవీలపై నిఘా.. వివరాలు ఇవ్వాలని బ్యాంకర్లకు రోనాల్డ్‌రోస్ సూచన
ABN, Publish Date - Mar 08 , 2024 | 10:55 AM
అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రోస్(GHMC Commissioner Ronaldros) బ్యాంకర్లకు సూచించారు.
హైదరాబాద్ సిటీ: అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రోస్(GHMC Commissioner Ronaldros) బ్యాంకర్లకు సూచించారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదలయ్యే అవకాశమున్న నేపథ్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో బ్యాంకు అధికారులు, నగదు రవాణా ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. పారదర్శక, ప్రలోభరహిత ఎన్నికల నిర్వహణకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. నగదు రవాణా సమయంలో సరైన పత్రాలు లేని ఏజెన్సీలు, బ్యాంకు కో ఆర్డినేటర్ల వాహనాలను సీజ్ చేస్తారన్నారు. ఒకే రోజు ఏ ఖాతాదారుడైనా రూ.లక్ష డిపాజిట్ చేసినా, విత్ డ్రా చేసినా, రూ.10 లక్షల నగదు బదిలీ చేసినా.. ఆ వివరాలను అందించాలని సూచించారు. రూ.10 లక్షలకు పైబడిన లావాదేవీల వివరాలు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.
Updated Date - Mar 08 , 2024 | 10:55 AM