BRS: రైతు కండువాలతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు..
ABN, Publish Date - Dec 19 , 2024 | 08:08 AM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ, మండలి సమావేశాలకు రోజుకొక వేష ధారణతో వస్తున్నారు. బుధవారం ఆటో డ్రైవర్ల వేషంలో వచ్చిన నేతలు గురువారం రైతు కండువాలతో సభకు రానున్నారు. రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ నేతలు పట్టుపట్టనున్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs), ఎమ్మెల్సీ (MLCs)లు గురువారం శాసనసభ, మండలి సమావేశాలకు రైతు కండువాలతో (Farmers scarves) రానున్నారు. రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ పట్టుపట్టనుంది. బీఆర్ఎస్ నేతలు రోజుకో సమస్యతో శాసనసభకు వస్తున్నారు. బుధవారం ఆటో డ్రైవర్ల వేషంలో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొదట రోజు అదానీ, రాహుల్ గాంధీ టీ షర్ట్స్‌తో అసెంబ్లీకి వచ్చారు. లగచర్ల రైతులకు మద్దతుగా మంగళవారం బేడీలు ధరించి వచ్చారు. ఇలా రోజుకో వేషంతో బీఆర్ఎస్ నేతలు సభకు వస్తున్నారు.
కేటీఆర్ ఆటో సవారీ
కాగా ఎమ్మెల్యే కేటీఆర్ కారులో కాకుండా బుధవారం ఆటోలో అసెంబ్లీకి వచ్చారు. ఖాకీ దుస్తులు ధరించి ఆటోను స్వయంగా నడుపుతూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి శాసనసభకు వచ్చారు. 93 మంది ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలకు, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఆయన ఈ ఆటో సవారీ చేశారు. సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల జాబితాను గత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వానికి ఇచ్చామని, ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. ఆర్థిక ఇబ్బందులకు భయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆటో కార్మికులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. అనంతరం ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం తరఫున అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు శాసనమండలి చైర్మన్ కార్యాలయం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఫార్ములా ఈ రేస్ అంశంపై శాసనసభలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో చర్చ జరిగితేనే ప్రజలకు నిజానిజాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి బుధవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. తనపై, గత ప్రభుత్వంపై ప్రస్తుత పాలకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంపై మంత్రివర్గ సమావేశంలో గంటన్నరకు పైగా చర్చ జరిగిందని, తనపై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ అనుమతిచ్చారంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మీడియాకు లీకులు ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి, హైదరాబాద్‌కు మంచి జరగాలనే సదుద్దేశంతో తాము అధికారంలో ఉన్నప్పుడు ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. 2023లో జరిగిన రేసు వల్ల రాష్ట్రానికి రూ.700 కోట్లు లబ్ధి చేకూరిందని తెలిపారు. 2024లో మరోసారి రేసు జరగాల్సి ఉండగా ప్రస్తుత ప్రభుత్వం దానిని ఏకపక్షంగా రద్దు చేసిందని ఆరోపించారు.
నాటి నుంచి ఈ ఒప్పందం అంశంలో ఏదో జరిగిందనే అపోహ సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగిందని తాను చెప్పినా ప్రభుత్వం దుష్ప్రచారం ఆపడం లేదని వాపోయారు. ఇప్పటికైనా రాజకీయ కక్ష సాధింపును ఆపి శాసనసభలో చర్చ నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక, ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చ జరపాలని కోరుతూ బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం తరఫున స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు. కాగా, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ర్యాలీపై కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ఇక, అదానీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ర్యాలీని విమర్శిస్తూ ‘అదానీ, రేవంత్ భాయి.. భాయి’ అంటూ వారిద్దరూ కలిసున్న ఫొటోలను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో హరీశ్ రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, .జగదీ్‌షరెడ్డి, గంగుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో క్యాబినెట్ సమావేశం..
ముంబై సముద్రతీరంలో పడవ ప్రమాదం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 19 , 2024 | 08:08 AM