CM Revanth: 2014లోనే జైపాల్‌రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే..
ABN, Publish Date - Jul 28 , 2024 | 06:31 PM
దివంగత మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడే వ్యక్తి అని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి తెలిపారు. జైపాల్‌రెడ్డి వర్థంతి సందర్భంగా సంస్మరణ సభ నిర్వహించారు.
కల్వకుర్తి: దివంగత మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడే వ్యక్తి అని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. జైపాల్‌రెడ్డి వర్థంతి సందర్భంగా సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సంస్మరణ సభకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. జైపాల్‌రెడ్డి చిత్రపటానికి సీఎం నివాళులు అర్పించారు. ఓడినా, గెలిచినా జైపాల్‌రెడ్డి పార్టీని వీడలేదని ఉద్ఘాటించారు. ఆయన వల్లే పదవులకు గౌరవం వచ్చిందని వ్యాఖ్యానించారు. జైపాల్‌రెడ్డి విలువలు పాటించారు.. నేర్పించారని తెలిపారు.
జైపాల్‌రెడ్డి వల్ల పదవులకు గౌరవం వచ్చింది..
జైపాల్‌రెడ్డి శిష్యులం, అనుచరులమని గర్వంగా చెప్పుకుంటారని అన్నారు. 2014లో జైపాల్‌రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేదని గుర్తుచేశారు. ఆయనకి పదవుల వల్ల గౌరవం రాలేదని, జైపాల్‌రెడ్డి వల్లే పదవులకు గౌరవం వచ్చిందని చెప్పారు. కల్వకుర్తిని అభివృద్ధి చేస్తానని ఎన్నికల్లో చెప్పానని వివరించారు. కల్వకుర్తిలో 100 పడకల ఆస్పత్రి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆమనగల్లులో డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
నేను నల్లమల బిడ్డనే..
‘‘నేను ఎంత ఎత్తుకు ఎదిగినా.. నల్లమల బిడ్డనే.. నా ఎదుగుదలకు దోహదం చేసిన కల్వకుర్తి, నల్లమలను ఎప్పటికీ మరచిపోలేను. జైపాల్ రెడ్డి గురించి మాట్లాడాలంటే చాలా ఆలోచించాలి.. వారి జీవితం.. సిద్ధాంతాలు చాలా ఆదర్శవంతం. జైపాల్ రెడ్డి అప్పటి స్పీకర్ మీరా కుమార్‌కు చెప్పి మూడ్ ఆఫ్ ది హౌస్‌తో తెలంగాణ ఏర్పాటు చేశారు. అప్పట్లో రాష్ట్రానికి ఎవరు సీఎం అవుతారో చెప్పనందున 2014లో కాంగ్రెస్ ఓడిపోయింది. అప్పట్లో సీఎంగా జైపాల్ రెడ్డి పేరును ప్రకటించి ఉంటే తప్పక గెలిచేది. కానీ ఇప్పుడు కల్వకుర్తి మనిషిని సీఎంగా నేను వచ్చాను’’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
జైపాల్‌రెడ్డి స్వగ్రామానికి వరాల జల్లు..
‘‘నేను ఇక్కడి వాసిగా చెబుతున్నా. అప్పుడు మాట ఇచ్చినట్లుగా 100 పడకల ఆస్పత్రి, R&B రోడ్లకు రూ.180 కోట్లు, నిరుద్యోగులకు ఉపాధి కోసం NAC నుంచి రూ.10 కోట్లు, అమన్‌గల్ డిగ్రీ కళాశాలకు నిధులు, కల్వకుర్తి నియోజకవర్గంలో ఐదు హై లెవెల్ బ్రిడ్జిలు, మాడుగులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మాడుగుల మండలంలోని పాఠశాలలకు రూ. 10 కోట్లు, తండాల నుంచి మండల కేంద్రాలకు BT రోడ్లకు నిధులు, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి BT రోడ్లకు, HYD -, శ్రీశైలం NH నాలుగు రోడ్లు. నేను చదివిన తాండ్ర ZPHS పాఠశాలకు 5 కోట్లు.. ఆగస్టు 1 న స్కిల్ యునివర్సిటీ ముచ్చర్లలో ఏర్పాటు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ రూ.100 కోట్లతో ఏర్పాటు చేస్తాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - Jul 28 , 2024 | 06:59 PM