Hyderabad: దోచుకున్న సొమ్ము హవాలా మార్గంలో తరలింపు
ABN, Publish Date - Oct 21 , 2024 | 07:10 AM
సైబర్ మోసాల్లో దోచుకున్న సొత్తును నేరగాళ్లు వెంటనే విత్ డ్రా చేస్తున్నారు. హవాలా మార్గంలో ప్రధాన నేరగాళ్లకు చేరవేస్తున్నారు. ఆపై సైబర్ చైన్ లింక్లను కట్ చేసి సాంకేతిక ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు.
చైన్లింక్లు దొరక్కుండా సైబర్ నేరగాళ్ల కొత్త టెక్నిక్
ఆధారాలు దొరక్క తిప్పలు పడుతున్న పోలీసులు
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 20 (ఆంధ్ర జ్యోతి): సైబర్ మోసాల్లో దోచుకున్న సొత్తును నేరగాళ్లు వెంటనే విత్ డ్రా చేస్తున్నారు. హవాలా మార్గంలో ప్రధాన నేరగాళ్లకు చేరవేస్తున్నారు. ఆపై సైబర్ చైన్ లింక్లను కట్ చేసి సాంకేతిక ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు.
పోలీసులకు పట్టుబడకుండా...
గతంలో ఏదైనా సైబర్ నేరం జరిగితే పోలీసులు వెంటనే సాంకేతిక ఆధారాలు సేకరించే వారు. నేరస్థులు కాజేసిన డబ్బులు బాధితుడి ఖాతా నుంచి ఎన్ని ఖాతాల్లోకి వెళ్లాయి. ఆ బ్యాంకు ఖాతాలు ఏయే నగరాల్లో ఉన్నాయో గుర్తించి ప్రారంభ ఖాతా నుంచి చివరి వరకు డబ్బులు వెళ్లిన ఖాతాలను ఫ్రీజ్ చేసేవారు. ఖాతాల చిరునామాలు, ఇతర సాంకేతిక ఆధా రాల ద్వారా కేసులో సంబంధం ఉన్న నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేసేవారు. ప్రస్తుతం నైబర్ నేరగాళ్లు పోలీసులకు పట్టుబడకుండా కొత్తకొత్త పద్ధతులను వినియోగిస్తున్నట్లు తెలిసింది. బాధితుల ఖాతాల నుంచి డబ్బులు కాజేయగానే వేరే ఖాతాలకు తరలించకుండా తమ బ్యాంకు అకౌంట్కు సంబంధించిన టెక్నికల్ చైన్అంక్లను కట్ చేసి అనుచరుల ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారు. అనంతరం ఆ డబ్బును హవాలా మార్గం ద్వారా ప్రధాన సైబర్ నేరగాళ్లకు అందజేస్తున్నారు.
దాంతో పోలీసులకు కేసులో సరైన ఆధారాలు లభించడం కష్టంగా మారుతోంది. బాధితుడి డబ్బులు బదిలీ అయిన బ్యాంకు ఖాతా, వారు మాట్లాడిన ఫోన్ నంబర్లు తప్ప మరే ఇతర టెక్నికల్ ఆధారాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు నేరస్థులను పట్టుకోవడం పోలీసులకు సవాల్ గా మారింది. డబ్బులు కొల్లగొట్టిన బ్యాంకు ఖాతాను పరిశీలిస్తే అది తప్పుడు అడ్రస్ తో తీసుకున్న ఖాతాగా తేలిపోతుంది. విత్ డ్రా చేసిన వ్యక్తులకు బ్యాంకు ఖాతాకు సంబంధం ఉండదు. ఈ నేపథ్యంలో కేసును ఛేదించడం, సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం పోలీసులకు కష్టంగా మారుతోంది.
Updated Date - Oct 21 , 2024 | 07:10 AM