Bhatti Vikramarka: బడ్జెట్ అనంతరం కేసీఆర్‌పై భట్టి సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Jul 25 , 2024 | 04:34 PM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు...
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌పై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రియాక్షన్‌పై భట్టి కౌంటర్ ఇచ్చారు. ‘కేసీఆర్ నిన్న ఎందుకు సభకు రాలేదు..?. ఇంతే హడావుడిగా వెళ్లి కేంద్ర బడ్జెట్‌పై ఎందుకు మాట్లాడలేదు..?. కేంద్ర ప్రభుత్వం చెబితే హడావుడిగా వచ్చారు. వారు చెబితేనే వెళ్లి హడావుడిగా మా మీద మాట్లాడారు. వారు మాకేంటి సమయం ఇచ్చేది..?. ప్రజలే వారికి విశ్రాంతి తీసుకోమని సమయం ఇచ్చారు. పక్క రాష్ట్రానికి నిధులు ఇస్తున్నారు. ఈ రాష్ట్రానికి మేలు చేయడానికి తెచ్చిందే రాష్ట్ర విభజన చట్టం’ అని కేసీఆర్‌పై భట్టి ప్రశ్నల వర్షం కురిపించారు.
జైలుకు పంపుతాం!
మరోవైపు కాంగ్రెస్ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. కేసీఆర్‌ను తప్పకుండా జైలుకు పంపుతామన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను కేసీఆర్ విమర్శిస్తున్నారు. కేసీఆర్ నిన్ను జైలుకు పంపే బాధ్యత మేము తీసుకుంటాం. మీడియా పాయింట్‌కు వచ్చిన నువ్వు కోర్టు బోనుకు కూడా వెళ్తావ్ కేసీఆర్..?. గతంలో గొర్ల మీద దొరుకుతున్నది కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెద్ద పీట వేసింది. ఈ బడ్జెట్ చూసి తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారు. తెలంగణ ప్రజలు ఇప్పటికే మీకు బుద్ది చెప్పారు’ అని ఐలయ్య చెప్పుకొచ్చారు.
అందరికీ వెన్నుపోటు!
తెలంగాణ బడ్జెట్ 2024-25పై కేసీఆర్ స్పందించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. అందరినీ వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. ‘ఇది రైతు శత్రు ప్రభుత్వం. బడ్జెట్‌లో ముఖ్యమైన పథకాల ప్రస్తావనే లేదు. గొర్రెల పంపిణీ పథకం, దళితబంధు, రైతు భరోసా తదితర పథకాలకు కేటాయింపులే లేవు. రైతులను పొగిడినట్లే పొగిడి వెన్నుపోటు పొడిచారు. కథ చెప్పినట్లే ఉంది తప్ప.. బడ్జెట్ పెట్టినట్లు లేదు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డాక సమయమివ్వాలని 6 నెలలపాటు అసెంబ్లీకి రాలేదు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ పేరుతో కొత్త నాటకానికి తెరలేపారు. బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉంది. ఈ ప్రభుత్వం ఏ ఒక్క పాలసీని రూపొందించలేదు. ఒక్క ఇండస్ట్రీ పేరు చెప్పలేదు. ఏ ఒక్క దానిపైనా క్లారిటీ లేదు. మహిళలకూ ఇచ్చిందేమి లేదు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగ్గా లేదు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ శ్రేణులు పోరాడతారు. కాంగ్రెస్ మోసపూరిత ఎన్నికల వాగ్ధానాలు అమలు చేసే వరకు వదిలిపెట్టేది లేదు’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
Updated Date - Jul 25 , 2024 | 04:34 PM