TG News: చేప మందు కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు పోటెత్తిన ప్రజలు..
ABN, Publish Date - Jun 08 , 2024 | 12:33 PM
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ (Nampally Exhibition Ground)లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం అయ్యింది. చేప మందు (Fish Medicine) కోసం తెలుగు రాష్ట్రాలు సహా బిహార్, యూపీ, చత్తీస్‌గఢ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. వేలాదిమందితో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది.
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ (Nampally Exhibition Ground)లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం అయ్యింది. చేప మందు (Fish Medicine) కోసం తెలుగు రాష్ట్రాలు సహా బిహార్, యూపీ, చత్తీస్‌గఢ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. వేలాదిమందితో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. మందు కోసం ఆస్తమా బాధితులు పెద్దఎత్తున వస్తున్నారు. క్యూలైన్‌లో ఉన్నవారికి నాలుగు గంటలకుపైగా సమయం పడుతోంది. భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. జూన్ 9 ఉదయం 11గంటల వరకు పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.
బత్తిని సోదరులు అందించే చేప ప్రసాదం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అది తీసుకుంటే ఆస్తమా, ఉబ్బసం, శ్వాస సమస్యలు తొలగి పోతాయంటూ కొందరు విశ్వసిస్తారు. దీంతో ప్రతి సంవత్సరం రెండ్రోజులపాటు బత్తిని సోదరులు చేప మందు పంపిణీ చేస్తుంటారు. మృగశిర కార్తె తర్వాత మాత్రమే వారు చేప మందు ఇవ్వడం ప్రత్యేకం.
బత్తిని సోదరుల ఇంట్లో ఉన్న బావి నీటిలో ఔషధ గుణాలు ఉంటాయని కొంతమంది విశ్వసిస్తారు. ఆ నీటితో ప్రసాదం తయారు చేయడంతో శ్వాస సంబంధిత బాధితులు ఎగబడుతున్నారు. మందును చేప పిల్లల నోట్లో కుక్కి.. దాన్ని బాధితుల గొంతులో వేస్తారు. దీంతో వారికి శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గుతాయని బత్తిని సోదరులు చెప్తుంటారు. కానీ ఈ మందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. చేపమందు కోసం వచ్చే వారి కోసం టీజీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి నాంపల్లికి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించింది.
Updated Date - Jun 08 , 2024 | 12:40 PM