CM Revanth: కీలక పరిణామం.. సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి భేటీ
ABN, Publish Date - Oct 09 , 2024 | 12:06 PM
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో మాజీమంత్రి మల్లారెడ్డి ప్రత్యక్షం అయ్యారు. విషయం ఏంటి అని ఆరా తీస్తే.. తన మనమరాలి పెళ్లి ఉందని, పత్రిక ఇచ్చేందుకు వచ్చానని మల్లారెడ్డి చెబుతున్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న, మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న సీఎం రేవంత్, మాజీమంత్రి మల్లారెడ్డి ఈ రోజు సమావేశం అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి మల్లారెడ్డి వచ్చారు. తన మనమరాలి పెళ్లి ఉందని చెబుతున్నారు. పెళ్లి పత్రిక ఇచ్చేందుకు రేవంత్ ఇంటికి వచ్చానని స్పష్టం చేశారు. అంతే తప్ప ఇతర కారణం ఏదీ లేదని తేల్చి చెప్పారు. గతంలో వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశారు. ముందుగా మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరగా తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆ సమయంలో భూ ఆక్రమణల గురించి ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి సీఎం పదవి చేపట్టారు. దాంతో మల్లారెడ్డి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని వార్తలు గుప్పుమన్నాయి. కాంగ్రెస్ పార్టీలో మల్లారెడ్డి చేరికను రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని మల్లారెడ్డి అనుచరులు ఆరోపించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి మల్లారెడ్డి రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆక్రమణలు
భూములను ఆక్రమించి కాలేజీలు నిర్మించారని మల్లారెడ్డిపై గతంలో రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. ఆ వ్యాఖ్యలపై ఇద్దరు నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగింది. ఓ సందర్భంలో మల్లారెడ్డి తొడగొట్టి ఛాలెంజ్ చేశారు. రాజీనామా చేయాలని పరస్పరం డిమాండ్ చేసుకున్నారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలని రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు ఆ సమయంలో డిమాండ్ చేశారు. ఎన్నికలు జరిగిన తర్వాత పరిస్థతి మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో మల్లారెడ్డి మింగలేక కక్కలేక ఇబ్బంది పడ్డారు.
కూల్చివేత.. కేసులు
మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కాలేజీ భవనాలను అధికారులు కూల్చివేశారు. కుత్బుల్లాపూర్‌లో గల దుండిగల్ ఎంఎల్ఆర్‌ఐటీ కాలేజీ భవనాలను నేల మట్టం చేశారు. చిన్న దామర చెరువు ప్రాంతంలో కబ్జా చేసి అక్రమంగా నిర్మించారని ఫిర్యాదు రావడంతో చర్యలు తీసుకున్నారు. అంతకుముందు ఓ భూ వ్యవహారంలో మల్లారెడ్డిపై కేసు నమోదైంది. 47 ఎకరాల భూమిపై బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు ఫైల్ చేశారు. ఇటు కేసులు, అటు కాలేజీల కూల్చివేత మల్లారెడ్డి ఉక్కిరి బిక్కిరి అయ్యారు.
టీడీపీ.. కాంగ్రెస్..?
మల్లారెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వేరే పార్టీలోకి వెళతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబును కలువడంతో తెలుగుదేశం పార్టీలో చేరతారనే వార్తలు గుప్పుమన్నాయి. తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి చేపడతారనే ఊహాగానాలు వినిపించాయి. ఇంతలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు మల్లారెడ్డి ప్రత్యక్షం అయ్యారు. దాంతో ఏం జరుగుతుందనే చర్చకు దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డిని మల్లారెడ్డి ఎందుకు కలిశారు..? నిజంగా పెళ్లికి ఆహ్వానించారా..? లేదంటే రాజకీయాలు మాట్లాడారా..? కాంగ్రెస్ పార్టీలో చేరతారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి
Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.
Updated Date - Oct 09 , 2024 | 12:41 PM