Mobile App: హైడ్రాకూ ఓ మొబైల్ యాప్
ABN, Publish Date - Oct 08 , 2024 | 04:01 AM
మహా నగరంలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలపై నిరంతర నిఘాకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) చర్యలు తీసుకుంటోంది.
చెరువులు, ప్రభుత్వ స్థలాలపై నిఘా
ఆక్రమణలపై ఫిర్యాదుచేసేలా రూప కల్పన
త్వరలో అందుబాటులోకి అప్లికేషన్
చెరువుల పూర్వవైభవానికి హైడ్రా ప్రణాళిక
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): మహా నగరంలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలపై నిరంతర నిఘాకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) చర్యలు తీసుకుంటోంది. ఆక్రమణలపై పౌరులు ఫిర్యాదు చేసేలా మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. ఇక నుంచి కబ్జాలను నియంత్రించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు సోమవారం జరిగిన లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశంలో ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.
యాప్..
ఆక్రమణల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు యాప్‌ను రూపొందించాలని హైడ్రా నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆక్రమణల ఫొటోలను అప్‌లోడ్ చేయడం ద్వారా ఫిర్యాదు నమోదవుతుంది. సంబంధిత ప్రాంత బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాయి. యాప్ రూపకల్పన బాధ్యతలను ఓ ఏజెన్సీకి అప్పగించినట్టు హైడ్రా వర్గాలు పేర్కొన్నాయి. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల గుర్తింపునకు రెవెన్యూ, ఇరిగేషన్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో చర్చించారు. నాలుగైదు దశాబ్దాల క్రితం, ప్రస్తుతం చెరువుల విస్తీర్ణానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను అందించాలని ఎన్‌ఆర్‌ఎ్‌సఏ, ఎస్‌ఆర్‌ఎ్‌ససీ అధికారులను కోరారు.
చెరువులకు పూర్వ వైభవం తెస్తాం: రంగనాథ్
చెరువుల పరిరక్షణతో పాటు వాటికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు హైడ్రా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఆక్రమణలు కూల్చివేసిన చెరువుల్లో వ్యర్థాలను తొలగించి, పనులు చేపడతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మొదటి దశలో సున్నం, అప్పా, ఎర్రకుంట, కూకట్‌పల్లి నల్లచెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఔటర్ లోపల ఎన్ని చెరువులున్నాయి..? ఎంత మేర ఆక్రమణలకు గురయ్యాయి..? అన్న లెక్కలూ తేల్చుతామని వెల్లడించారు.
శాస్త్రీయ పద్ధతిలో..
శాస్త్రీయ పద్ధతుల ద్వారా ఎఫ్‌టీఎల్ నిర్ధారించాలని, గతంలో నిర్ధారించిన ఎఫ్‌టీఎల్ సరిగా లేని పక్షంలో వాటిని సవరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్‌ఆర్‌ఎ్‌సఏ, ఎస్‌ఆర్‌ఎ్‌సఏ, ఇరిగేషన్ విభాగాల నుంచి 45ఏళ్ల డేటాను సేకరిస్తామని, దాని ఆధారంగా చెరువుల ఎఫ్‌టీఎల్‌ను గుర్తిస్తామని చెప్పారు. హిమాయత్‌సాగర్‌తో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ గుర్తింపును ప్రారంభించి అదే విధానాన్ని అన్ని చెరువుల విషయంలో పాటించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెరువుల ఆక్రమణలపై 2018లో కాగ్ ఇచ్చిన నివేదికను పరిశీలించడంతోపాటు.. ఆక్రమణల గుర్తింపులో పొరపాట్లు లేకుండా చూస్తామన్నారు.
Updated Date - Oct 08 , 2024 | 07:17 PM