BRS: బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు పరిశీలనలో ఆ ఇద్దరు
ABN, Publish Date - Feb 14 , 2024 | 08:02 PM
బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్రను పార్టీ అధినేత కేసీఆర్(KCR) ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ పెద్దలతో, ముఖ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కాగా అధినేత ఆదేశాలతో రేపు (15 ఫిబ్రవరి) వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
హైదరాబాద్: రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) కసరత్తు చేస్తున్నారు. రేపు (15 ఫిబ్రవరి)న రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనున్నది. దాంతో కేసీఆర్‌తో ఖమ్మం జిల్లా నేతలు భేటీ అయ్యారు. వారి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. రాజ్యసభ రేసులో వద్ధిరాజు రవిచంద్ర, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఉన్నట్లు సమాచారం. వద్ధిరాజుకు రాజ్యసభ సీటు ఖాయమనుకున్న తరుణంలో రేసులోకి అనూహ్యంగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తెరమీదకు వచ్చారు.
ఇప్పటికే ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పోటీ చేస్తారని గులాబీ పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు నామా నాగేశ్వరరావును రాజ్యసభకు పంపుతారని కారు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయం బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిని గులాబీ బాస్ ప్రకటించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించడంతో తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం అవ్వడానికి లైన్ క్లియర్ అయింది.
Updated Date - Feb 14 , 2024 | 09:22 PM