MLC Kavitha: ఇంటికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత.. తీవ్ర భావోద్వేగం.. కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Aug 28 , 2024 | 08:04 PM
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దాదాపు 5 నెలలు తీహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్న (మంగళవారం) బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ఇవాళ (బుధవారం) ఆమె హైదరాబాద్‌లోని నివాసానికి చేరుకున్నారు. ఇంటి వద్ద కవితకు దిష్టి తీసి అభిమానులు ఇంట్లోకి ఆహ్వానం పలికారు.
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దాదాపు 5 నెలలు తీహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్న (మంగళవారం) బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ఇవాళ (బుధవారం) ఆమె హైదరాబాద్‌లోని నివాసానికి చేరుకున్నారు. ఇంటి వద్ద కవితకు దిష్టి తీసి అభిమానులు ఇంట్లోకి ఆహ్వానం పలికారు. ఇక బంధువులు, కుటుంబ సభ్యులు పూల వర్షం కురిపించి కవితకు ఘన స్వాగతం పలికారు.
ఇంట్లో భావోద్వేగ దృశ్యాలు..
ఇంట్లోకి వెళ్లిన తర్వాత నేరుగా పూజ గదికి వెళ్లి దేవుళ్లకు దండం పెట్టుకున్నారు. కవితను కలిసిన వెంటనే తల్లి శోభ, ఇతర కుటుంబ సభ్యులు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తల్లి శోభమ్మ పాదాలకు నమస్కరించి కవిత ఆశీర్వాదం తీసుకున్నారు. కూతురిని ఆప్యాయంగా హత్తుకున్నాక తల్లి శోభ కన్నీటి పర్యంతమయ్యారు. తల్లిని పట్టుకుని కవిత కూడా ఏడ్చారు. కుటుంబ సభ్యులు ఓదార్చారు. ఇక తన సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆమె రాఖీ కట్టారు.
కీలక వ్యాఖ్యలు
ఇంటికి చేరుకున్న సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తన విషయంలో న్యాయం గెలుస్తుందని అన్నారు. ‘‘ధర్మం గెలుస్తుంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఆ రోజు కోసం పోరాటం చేస్తూనే ఉంటాను. ప్రజాక్షేత్రంలో ఇంకా గట్టిగా పని చేస్తా. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగే పోరాటాల్లో పాల్గొంటాను. అంతిమంగా అపవాదులన్నింటి నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తా అనే విశ్వాసం నాకు ఉంది’’ అని కవిత అన్నారు.
Updated Date - Aug 28 , 2024 | 08:45 PM