Hyderabad: ఆ ఘటనపై శాసన మండలిలో మాట్లాడతా: తీన్మార్ మల్లన్న..
ABN, Publish Date - Dec 17 , 2024 | 05:09 PM
హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా క్రిటికల్‌గానే ఉందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. బాలుడు ఇంకా స్పృహలోకి రాలేదని, ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేమని వైద్యులు అంటున్నారని ఆయన వెల్లడించారు. అందరూ నటుడు అల్లు అర్జున్‌ను కలుస్తున్నారు గానీ, అసలు కలవాల్సింది శ్రీతేజ్‌ను కదా? అంటూ ఆయన ప్రశ్నించారు.
హైదారాబాద్: సంధ్యా థియేటర్(Sandhya Theater) తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను చూసేందుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna), హైదరాబాద్ సీపీ ఆనంద్ విడివిడిగా కిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. బాలుడి పరిస్థితి గురించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. సీపీ ఆనంద్‌తో కలిసి వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ సెక్రటరీ క్రిస్టినా సైతం ఆస్పత్రికి వెళ్లారు. కాగా, డిసెంబర్ 04న పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ (Sree Tej), తల్లి రేవతి (Revathi) తీవ్రంగా గాయపడ్డారు. చికిత్సపొందుతూ రేవతి మృతిచెందగా.. బాలుడు ప్రాణాలతో పోరాడుతున్న సంగతి తెలిసిందే.
రేపే మాట్లాడతా..
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. " శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా క్రిటికల్‌గానే ఉంది. బాలుడు ఇంకా స్పృహలోకి రాలేదు. చికిత్స గురించి వైద్యుల్ని అడిగితే ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేమని అంటున్నారు. అందరూ నటుడు అల్లు అర్జున్‌ను కలుస్తున్నారు గానీ, అసలు కలవాల్సింది గాయపడిన శ్రీతేజ్‌ను కదా. అల్లు అర్జున్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరెస్టు చేయించారని ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి అవాస్తవ ప్రచారాలను సినిమా వాళ్లు బంద్ పెట్టాలి. రేపు (బుధవారం) శాసన మండలిలో ఈ విషయంపై మాట్లాడతాను. అందుకే ఇవాళ శ్రీతేజ్ కుటుంబసభ్యులను కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నా. పుష్ప-2కు భారీ కలెక్షన్లు వచ్చాయని విన్నా. అందులో 10 శాతమైనా శ్రీతేజ్ కుటుంబానికి ఇవ్వాలి. ఇక మీదట బెనిఫిట్ షో విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుంది. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాని" చెప్పారు.
బన్నీకి షాక్..
కాగా, సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు హైదరాబాద్ పోలీసులు మరో షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బన్నీకి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు పోలీసులు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో క్వాష్ పిటిషన్‌పై వాదనల్లోనే బన్నీకి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. దీనిపై పోలీసులు నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. ఒకవేళ అత్యున్నత న్యాయస్థానానికి పోలీసులు వెళ్తే అల్లు అర్జున్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేడి చూడాల్సిందే.
ఈ వార్తలు కూడా చదవండి:
Seethakka: బీఆర్‌ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Hyderabad: సినీ నటిని బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు..
Updated Date - Dec 17 , 2024 | 05:19 PM