Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. త్వరలో నేతలకూ నోటీసులు!
ABN, Publish Date - Apr 12 , 2024 | 06:57 AM
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ) కేంద్రంగా జరిగిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో(Phone Tapping) సూత్రధారులైన రాజకీయ నాయకులపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. పాత్రధారులైన పోలీసు అధికారులు, మాజీ ఓఎస్డీలను విచారించిన తర్వాత వారి వాంగ్మూలాల మేరకు కొందరు రాజకీయ నాయకులు(Political Leaders) ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు(Radha Kishan Rao) విచారణలో వెల్లడించినట్లు తెలిసింది.
ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు వేగిరం
మొదట ఎవరికి నోటీసులు ఇవ్వాలనేదానిపై కసరత్తు
సాంబశివారెడ్డిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించిన ప్రభుత్వం
రాజకీయ నాయకులకు నోటీసులపై త్వరలో వెల్లడి: సీపీ శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ) కేంద్రంగా జరిగిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో(Phone Tapping) సూత్రధారులైన రాజకీయ నాయకులపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. పాత్రధారులైన పోలీసు అధికారులు, మాజీ ఓఎస్డీలను విచారించిన తర్వాత వారి వాంగ్మూలాల మేరకు కొందరు రాజకీయ నాయకులు(Political Leaders) ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు(Radha Kishan Rao) విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. ఈ కేసులో అరెస్టయిన పోలీసుల విచారణ పూర్తయిన నేపథ్యంలో.. ఇప్పుడు రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేసి, వారిని విచారించేందుకు దర్యాప్తు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఫోన్‌ట్యాపింగ్‌తోపాటు బెదిరింపులు, అక్రమ వసూళ్లకు సంబంధించి రాధాకిషన్‌రావు విచారణలో గత ప్రభుత్వ పెద్దలు ఎవరెవరు ఏయే పనులు చేయించుకున్నారు? ఎన్నికల సమయంలో ఎవరి కోసం పోలీసు వాహనాల్లో నగదు తరలించారు? ఎంత మొత్తంలో నగదు తరలింది? అనే వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది.
మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న కూడా రాజకీయ నేతల ప్రమేయాన్ని గురించి వివరించినట్లు.. ఆ నాయకులను వరుసగా విచారణకు పిలవనున్నట్లు సమాచారం. న్యాయ నిపుణులతో చర్చించి, వారి సలహాలు, సూచనల మేరకు నోటీసులు జారీ చేసేందుకు దర్యాప్తు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ కోవలో.. గత ప్రభుత్వంలో కీలక నాయకులతోపాటు జిల్లా స్థాయి నేతలు కూడా ఉన్నట్లు తెలిసింది. అయితే ముందుగా ఎవరికి నోటీసులు ఇవ్వాలనే అంశంపైనా ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కీలక నేతలకు నోటీసులు ఇస్తే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి? శాంతిభద్రతల పరంగా
ఇబ్బందులు వస్తాయా? అనేదానిపైనా అంచనాలు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు కావడంతో.. సాక్ష్యాధారాల విషయంలో అధికారులు పక్కాగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు తీరుపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేసిన అధికారులు.. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలకు సిద్ధమవుతారని తెలుస్తోంది. అయితే.. ప్రభుత్వం కూడా ఈ అంశంపై సీరియస్‌గా ఉండడంతో.. దర్యాప్తు అధికారులకు పూర్తిస్వేచ్ఛనిస్తున్నట్లు సమాచారం.
అడిగిన వెంటనే స్పెషల్ పీపీ..
ఈ కేసులో న్యాయపరమైన సవాళ్లను అధిగమించడానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) అవసరమని ఉన్నతాధికారులు భావించారు. రెగ్యులర్ పీపీ అయితే.. వారికి ఉండే వేర్వేరు కేసుల ఒత్తిడి నేపథ్యంలో ట్యాపింగ్ కేసు విచారణపై పెద్దగా దృష్టి పెట్టే అవకాశాలుండవు. దీంతో.. స్పెషల్ పీపీ కావాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. దర్యాప్తు అధికారుల అభ్యర్థనను వెనువెంటనే పరిశీలించిన ప్రభుత్వం స్పెషల్ పీపీగా సాంబశివారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే పంజాగుట్ట పోలీసులు ఈ కేసు విచారణ జరుగుతున్న నాంపల్లి కోర్టులో స్పెషల్ పీపీ నియామకంపై మెమో దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిగే అవకాశాలున్నాయి.
నేతలకు నోటీసులపై త్వరలో వెల్లడి: సీపీ శ్రీనివాస్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తొలిసారిగా స్పందించారు. గురువారం పాతనగరంలోని మీరాలం ఈద్గా వద్ద జరిగిన రంజాన్ ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫోన్‌ట్యాపింగ్ అంశంపై మీడియా ఆయనతో మాట్లాడుతూ.. త్వరలో రాజకీయ నాయకులకూ నోటీసులు జారీ చేస్తారట కదా? అని ప్రశ్నించగా.. ‘‘ఈ అంశంపై త్వరలో వెల్లడిస్తాం. త్వరలో అన్ని విషయాలను తెలియజేస్తాం’’ అని సీపీ బదులిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతోందని, క్రమ పద్ధతిలోనే విచారణ సాగుతోందని చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Apr 12 , 2024 | 06:57 AM