Investigating officers:గొర్రెల పంపిణీ స్కామ్..మౌనమే నిందితుల సమాధానం..!
ABN, Publish Date - Jun 12 , 2024 | 03:19 AM
గొర్రెల పంపిణీ పథకంలో వెలుగు చూసిన రూ.700 కోట్ల కుంభకోణం కేసులో పోలీసుల కస్టడీలో ఉన్న నిందితులు రాంచందర్, కల్యాణ్-- దర్యాప్తు అధికారుల ప్రశ్నలకు మౌనంగా ఉంటున్నట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి పలు కోణాల్లో సమాధానాలను రాబట్టుకునేందుకు అధికారులు ప్రశ్నించినా సమాధానాల్లేవని సమాచారం.
ఏసీబీ ప్రశ్నలకు నోరు మెదపని రాంచందర్, కల్యాణ్
కస్టడీలో విచారణ మొత్తం వీడియో రికార్డింగ్
హైదరాబాద్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): గొర్రెల పంపిణీ పథకంలో వెలుగు చూసిన రూ.700 కోట్ల కుంభకోణం కేసులో పోలీసుల కస్టడీలో ఉన్న నిందితులు రాంచందర్, కల్యాణ్-- దర్యాప్తు అధికారుల ప్రశ్నలకు మౌనంగా ఉంటున్నట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి పలు కోణాల్లో సమాధానాలను రాబట్టుకునేందుకు అధికారులు ప్రశ్నించినా సమాధానాల్లేవని సమాచారం.
మంగళవారం ఉదయం నిందితులిద్దరినీ వేర్వేరుగా విచారించారు. విచారణ ప్రక్రియను వీడియో కెమెరా ముందు నిర్వహించారు. ఆటోరిక్షాలు, ద్విచక్ర వాహనాలు, అంబులెన్స్‌ల వాహన రిజిస్ట్రేషన్ నంబర్లు పెట్టి, గొర్రెలను తరలించడంపై ప్రశ్నించినట్లు తెలిసింది. కీలక ప్రశ్నలకు మూగనోము పట్టినట్లు సమాచారం. ఓ దశలో అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలను నిందితుల ముందు పెట్టగా.. వారు చూచాయగా సమాధానాలిచ్చినట్లు తెలుస్తోంది.
అయితే.. ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకడైన మోహియుద్దీన్ గొర్రెల పంపిణీ పథకంలోకి ఎలా ప్రవేశించాడు? ఎలా చక్రం తిప్పాడు? అనే అంశాలపై వారి నుంచి కొంతమేర సమాధానాన్ని రాబట్టినట్లు తెలిసింది. రాంచందర్, కల్యాణ్ బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలను దర్యాప్తు సేకరించినట్లు సమాచారం. వీరిద్దరి కస్టడీ బుధవారంతో ముగియనుంది. దీంతో.. బుధవారం వీరిద్దరినీ రాజకీయ నాయకుల ప్రమేయంపై ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.
టీఎస్ఎల్‌డీఏ సీఈవో రాంచందర్‌పై వేటు
తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ (టీఎ్‌సఎల్‌డీఏ) సీఈవో డాక్టర్ రాంచందర్ నాయక్‌పై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. రాంచందర్‌ను ఇటీవల ఏసీబీ అధికారులు అరెస్టు చేసి విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాంచందర్‌పై సస్పెన్షన్ వేటువేశారు.
Updated Date - Jun 12 , 2024 | 07:59 AM