CM Revanth: తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు.. ఎంట్రీ మారింది!
ABN, Publish Date - Jun 03 , 2024 | 04:24 PM
తెలంగాణ సచివాలయంలో (Telangana Secretariat) మార్పులు, చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయించారు. ఇందులో భాగంగా సీఎం కాన్వాయ్ ఎంట్రీ ప్రధాన ద్వారాన్ని మార్చారు...
హైదరాబాద్, ఆంధ్రజ్యోతి: తెలంగాణ సచివాలయంలో (Telangana Secretariat) మార్పులు, చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయించారు. ఇందులో భాగంగా సీఎం కాన్వాయ్ ఎంట్రీ ప్రధాన ద్వారాన్ని మార్చబోతున్నారని తెలుస్తోంది. ఇకపై సచివాలయం వెస్ట్ గేట్ (పశ్చిమ) నుంచి కాన్వాయ్‌కు ఎంట్రీ ఉండనుందట. ఈస్ట్ గేట్ నుంచి సీఎం కాన్వాయ్ బయటికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఐఏఎస్, ఐపీఎస్.. ఇతర అధికారులు మాత్రం ఈస్ట్ గేటు నుంచి ఎంట్రీ ఉంటుందని తెలియవచ్చింది. రేవంత్ సీఎం అయ్యాక తనదైన శైలిలో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ మార్పుపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. అన్నీ సక్రమంగా ఉన్నా మార్పులు చేయాల్సిన అవసరమేంటి..? అని విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. కాగా.. తొలుత పీసీసీ అధ్యక్ష పదవి వచ్చాక వాస్తుకు తగినట్లుగా గాంధీ భవన్‌లో మార్పులు చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.
నాడు కేసీఆర్.. నేడు రేవంత్!
ఇప్పటికే తెలంగాణ గీతం, చిహ్నం.. తెలంగాణ తల్లి, టీఎస్ నుంచి టీజీగా మార్చిన సంగతి తెలిసిందే. వివాదాల నడమే గీతాన్ని.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున విడుదల చేశారు. అయితే.. రాజముద్ర (చిహ్నం) మార్పుపై పెద్ద రాద్ధాంతమే నడుస్తుండగా ప్రజాభిప్రాయానికి వెళ్లాలని రేవంత్ నిర్ణయించారు. సీఎం చేస్తున్న ఈ మార్పులతో బీఆర్ఎస్ హయాంలో సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు చేసిన మార్పులను మళ్లీ తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. సీఎం ఎవరైనా సరే ఇలా వాస్తు మార్పులు, చేర్పులు మామూలే అన్నట్లుగా జనాలు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ ఓటమి చవిచూసిన తర్వాత కూడా తెలంగాణ భవన్‌కు కేసీఆర్ మార్పులు చేసిన విషయం తెలిసిందే. మొత్తమ్మీద చూస్తే.. తెలంగాణ రాజకీయాల్లో వాస్తు మార్పులు గట్టిగానే జరుగుతున్నాయ్.!
Updated Date - Jun 03 , 2024 | 04:56 PM