ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: సీఎం రేవంత్ సీరియస్.. మరి అసలు గుట్టు వీడేనా..!?

ABN, Publish Date - Aug 30 , 2024 | 07:53 PM

టిమ్స్(తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆస్పత్రులు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల పేరుతో గత ప్రభుత్వం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఈ ఆస్పత్రుల నిర్మాణానికి శంకుస్థాపనలు కూడా చేశారు. ఈ ఆస్పత్రుల నిర్మాణానికి చైనా నుంచి నిపుణులను..

Super Speciality Hospitals

హైదరాబాద్, ఆగష్టు 30: టిమ్స్(తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆస్పత్రులు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల పేరుతో గత ప్రభుత్వం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఈ ఆస్పత్రుల నిర్మాణానికి శంకుస్థాపనలు కూడా చేశారు. ఈ ఆస్పత్రుల నిర్మాణానికి చైనా నుంచి నిపుణులను రప్పించాలని ఆదేశాలు సైతం ఇచ్చేశారు. నిపుణులు వచ్చారా? లేదా? అన్నది పక్కన పెడితే.. ప్రస్తుతం వాటి నిర్మాణం అయితే కొనసాగుతోంది. ఇంత వరకు బాగానే ఉంది కానీ.. వాటి వెనకున్న లోగుట్టే.. ఏదో జరిగిందని.. జరుగుతోందనే అనుమానాలకు తావిస్తోంది. ఈ సీక్రెట్ వ్యవహారాన్ని గమనించిన ప్రస్తుత రేవంత్ సర్కారు అలర్ట్ అయ్యింది. విజిలెన్స్ అధికారులతో విచారణకు ఆదేశించింది. అవును.. గత సర్కార్ నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ, టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ప్రభుత్వం భావిస్తోంది. నిర్మాణ అంచనా వ్యయాలు పెంచడం, ఆస్పత్రి నిర్మాణ స్థలాన్ని తాకట్టు పెట్టడంపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అందుకే విజిలెన్స్ అధికారులతో దర్యాప్తు చేపట్టాలని, వీలైనంత త్వరగా నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.


నిర్మాణ వ్యయం పెంపు..

వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం.. హైదరాబాద్ నలుమూలలా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాలని భావించింది. ఈ మేరకు పనులను కూడా ప్రారంభించింది. ఎల్‌బీనగర్, అల్వాల్, సనత్‌నగర్‌లో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) ఆస్పత్రులు, వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించేందుకు నాటి ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు కూడా ఇచ్చింది. అయితే, అల్వాల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి విషయంలో.. ప్రతిపాదిత అంచనా వ్యయం రూ.897 కోట్లు కాగా.. దానిని రూ.300 కోట్ల మేర పెంచి, రూ.1,197 కోట్లకు చేర్చారు. మరోవైపు.. వరంగల్‌లో ఆస్పత్రి నిర్మిస్తున్న స్థలాన్ని తాకట్టు పెట్టి మరీ రుణాలు తీసుకున్నారు. అయితే, స్థలాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


సీఎం ప్రశ్నల వర్షం..

ఈ విషయం చివరికి సీఎం రేవంత్ దృష్టికి వెళ్లింది. దీనిపై సమగ్ర పరిశీలన జరిపిన సీఎం.. వ్యవహారంపై సీరియస్ అయ్యారు. వెంటనే వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంచనా వ్యయం పెంపుపై అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. అంతలా అంచనా వ్యయం పెరగడానికి కారణమేంటి? ఆస్పత్రి మొత్తం ఇటాలియన్‌ మార్బుల్స్‌ వేసినా.. ఇంత వ్యయం కాదు కదా? అన్ని ప్రశ్నించారట. ఇక వరంగల్‌ ఆస్పత్రి స్థలం మార్టిగేజ్‌ వ్యవహారంపైనా సీఎం సీరియస్‌గా ఉన్నారట. మార్టిగేజ్ వెనుకున్న అసలు రహస్యం ఏంటో తేల్చాలని అధికారులను ఆదేశించారట.


అసలేం జరిగింది..?

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి పూనుకుంది. ఇందులో భాగంగా మొదట హైదరాబాద్ నలుదిక్కులా టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణంతో పాటు.. వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించతలపెట్టింది. హనుమకొండలోని పాత సెంట్రల్‌ జైలు స్థలాన్ని దీనికోసం ఎంపిక చేశారు. 2 వేల పడకలతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి 2021 జూన్‌ 22న అప్పటి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. మూడు బ్లాకులుగా, 34 విభాగాలతో 24 అంతస్తుల్లో 16.50 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం తలపెట్టారు. ఆస్పత్రి నిర్మాణం త్వరగా పూర్తయ్యేందుకు చైనా నుంచి నిపుణులను రప్పించండి.. ఏడాదిన్నరలోపు ఆస్పత్పి నిర్మాణం పూర్తి కావాలన్నారు. ఏళ్లు గడిచినా ఆస్పత్రి నిర్మాణం పూర్తవలేదు కానీ.. ఇందులో భారీ అవినీతి జరిగిందని మాత్రం పుకార్లు పుంఖాను పుంఖాలుగా వస్తున్నాయి.


స్థలం తనఖా పెట్టి..

అయితే, ఇంత పెద్ద ఆస్పత్రి నిర్మాణం కావడంతో ఏ బ్యాంకూ రుణం ఇచ్చేందుకు ముందుకురాలేదట. దీంతో నిధుల కోసం బీఆర్‌ఎస్‌ సర్కారు అప్పు బాట పట్టింది. ఇందులో భాగంగా టీఎస్‌ఎస్‌హెచ్‌సీఎల్‌ను ఏర్పాటు చేసింది నాటి సర్కార్. దీని ద్వారా వరంగల్‌ ఆస్పత్రి నిర్మాణానికి జైలు స్థలాన్ని తాకట్టు పెట్టి బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర నుంచి రుణం తీసుకుంది. మొత్తం రూ.1,173 కోట్లు రుణం పొందింది. దీనికిముందే టీఎస్‌ఎస్‌హెచ్‌సీఎల్‌కు సర్వే నంబరు 31, 32లోని 2,75,759 గజాల స్థలాన్ని బదిలీ చేసింది.


ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి..

కాగా, వరంగల్‌ జైలు స్థలాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడంపై గతంలోనే నాటి కాంగ్రెస్‌ నేత బక్క జడ్సన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ కమీషన్ల కోసమే రుణం తీసుకున్నారని, దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని రిజర్వ్‌ బ్యాంకుకు ఫిర్యాదు చేశారు. విచారణ జరపాలని కోరారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సీఎం రేవంత్ దృష్టికి చేరడంతో.. ఈ వ్యవహారంపై ఆయన ఫోకస్ పెట్టారు. పూర్తి వివరాలు తక్షణమే పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారట. డీఎంఈ కార్యాలయంతో పాటు, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర నుంచి వివరాలు సేకరించాలని, జైలు స్థలాన్ని టీఎస్‌ఎస్‌హెచ్‌సీఎల్‌కు బదలాయిస్తూ జారీ చేసిన జీవో నంబరు 81ను, స్థలాన్ని మార్టిగేజ్‌ చేసిన ఒప్పందం కాపీని కూడా పంపాలని అధికారులను సీఎం ఆదేశించారట. వీటితోపాటు హైదరాబాద్‌ కోఠిలోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రతో చేసుకున్న అవగాహన ఒప్పందం ప్రతిని కూడా పంపాల్సిందిగా ఆదేశించారని సమాచారం. తాకట్టు పెట్టిన స్థలం నుంచి ఎంతమేరకు రుణం తీసుకున్నారు? ఇప్పటివరకు ఎన్ని వాయిదాలు కట్టారు? ఇంకెన్ని కట్టాలి? వంటి వివరాలన్నింటినీ వెంటనే తెలియజేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.


Also Read:

పలు రాష్ట్రాలకు ఏఐసీసీ కార్యదర్శులను నియమించిన కాంగ్రెస్

క్షమాపణలు చెప్పిన మోదీ

సీఎం ఉత్తమ్ గారూ’.. కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్..

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 30 , 2024 | 07:59 PM

Advertising
Advertising