Telangana Formation Day: అవి గుర్తుకు వస్తే దుఃఖం వస్తుంది: కేసీఆర్
ABN, Publish Date - Jun 02 , 2024 | 01:35 PM
Telangana Formation Day by BRS Party: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్‌లో ఈ నిర్వహించిన ఈ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. తెలంగాణ ఉద్యమ రోజులను స్మరించుకున్నారు.
Telangana Formation Day by BRS Party: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్‌లో ఈ నిర్వహించిన ఈ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. తెలంగాణ ఉద్యమ రోజులను స్మరించుకున్నారు. ఈ రోజు ఉద్విగ్నభరితమైన రోజు అని పేర్కొన్నారు. తెలంగాణను, తెలంగాణ ప్రజలను ఎలా గోస పెట్టారో వివరించారు. కొందరు తెలంగాణ నినాదం ఎత్తుకొని మధ్యలోనే కాడి పడేశారని కేసీఆర్ అన్నారు. శాసనసభలో తెలంగాణ పదమే అనొద్దని నిషేధం పెట్టారని గుర్తు చేశారు. ముల్కీ రూల్స్ రద్దు చేసినా.. దిక్కు మొక్కు లేదన్నారు. నాడు కాంగ్రెస్‌లో 11 ఎంపీలు గెలిచినా ఇందిరాగాంధీ కనికరించలేదని గుర్తు చేశారు కేసీఆర్.
అలాంటి సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ కోసం పని చేశారుని.. ఆయన పోరాట స్ఫూర్తిని కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ లాంటివారు ఎప్పటికైనా రాకపోతారా అని జయశంకర్ ఎదురు చూశారని.. ఇదే విషయాన్ని అనేకసార్లు తనతో చెప్పినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ కోసం చివరి వరకు నిలబడాలని జయశంకర్ తనతో చెప్పారన్నారు. ఆనాడు కాంగ్రెస్, టీడీపీ నేతలు వాళ్ల స్వార్థం కోసం పని చేశారని.. తెలంగాణ కోసం ఎవరూ స్పందించలేదన్నారు.
తెలంగాణ నేతలు సీఎం అయితే పూర్తి కాలం పదవిలో ఉండకుండా మధ్యలోనే దించేశారని కేసీఆర్ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని సైతం తన చేతిలో పెట్టుకున్న పవర్ ఫుల్ సిఎం ఉన్న సమయంలో తాను ఉద్యమ బాటపట్టానని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ వస్తేనే తెలంగాణ రైతులకు న్యాయం జరుగుతుందని తాను భావించానన్నారు. నాడు సుద్దాల అశోక్ తేజకు తెలంగాణ పాట రాయరాకపోతే.. తానే చెప్పి రాపించానని గుర్తు చేశారు. ఆరోజులు గుర్తుకు వస్తే దుఃఖం వస్తుందని కేసీఆర్ ఉద్వేగానికి గురయ్యారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తమకు ఆఫీస్ ఇస్తే ఆయన ఇల్లు కూలగొట్టారన్నారు. అనేక ప్రయాసలతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని.. గులాబీ జెండాది 20ఏళ్ల ప్రస్థానం అని కేసీఆర్ పేర్కొన్నారు.
రేవంత్‌పై పరోక్ష విమర్శలు..
మోకాలు ఎత్తులేని వాడు కూడా బీఆర్ఎస్ ను ఖతం చేస్తా అంటున్నాడని.. బీఆర్ఎస్‌ను ఎవరూ ఖతం చేయలేరని కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఓడామని.. తాను మళ్లీ బస్సు యాత్ర మొదలు పెట్టగానే తెలంగాణ గర్జించిందన్నారు. ఇప్పుడు వచ్చేవి టెంపరరీ సెట్ బాక్స్ అని.. తమకంటే ముందు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఖతం అయ్యిందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. రేపు అధికారంలోకి రాబోయేది మళ్లీ బీఆర్ఎ స్ పార్టీనే అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అడ్డగోలు హామీలతో అప్పుడప్పుడు బ్రమిస్తారన్నారు. ఆ కారణంగానే మొన్నటి ఎన్నికల్లో 1.8 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయామని పార్టీ శ్రేణులకు చెప్పారు.
ఎర్రి మొర్రి చర్యలు..
ప్రభుత్వం వేస్తున్న ఎర్రి మొర్రి చర్యలతో ఆశ్చర్యం కలుగుతోందని కేసీఆర్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ అసమర్థత అర్థం కావడం లేదన్నారు. హరీష్ రావు వల్లనే కరెంట్ కట్ అవుతుందని సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడుతున్నారని.. ఈ రాష్ట్రానికి సీఎం హరీష్ రావా? లేక రేవంత్ రెడ్డినా? అని కేసీఆర్ ప్రశ్నించారు. సీఎం స్థాయి వ్యక్తి అలా మాట్లాడతారా? అని నిలదీశారు. రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అందుకే ప్రజలు ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి అంటున్నారని.. ప్రభుత్వానికి స్టెప్ డౌన్ స్టార్ట్ అయిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి దాన్ని చిల్లర రాజకీయం చేస్తోందని విమర్శించారు. కల్లు దుకాణాల మీద దాడులు చేస్తూ గీతా కార్మికులను బతికనివ్వడం లేదన్నారు. తాము ఉండగా వేసిన దళిత బంధు డబ్బులు ఫ్రీజ్ చేశారని కేసీఆర్ ఆరోపించారు. అనతికాలంలోనే ప్రభుత్వం అప్రతిష్ఠ పాలైందన్నారు.
ఫలితాలపై కేసీఆర్ స్పందన..
పార్లమెంట్ ఫలితాలు ఎలా వస్తాయో చూద్దామని కేసీఆర్ అన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ గెలిపించిన జిల్లా నేతలకు అభినందనలు తెలియజేశారు. వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ కూడా తమ పార్టీ రాకేష్ రెడ్డి మొదటి రౌండ్‌లోనే గెలుస్తున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎగ్జిట్ పోల్స్ పెద్ద గ్యాంబ్లింగ్ అని.. ఫలితాలు ఎలా వచ్చినా కృంగిపోమన్నారు. మహబూబ్‌నగర్ సీఎం సొంత జిల్లా అని.. అక్కడే తాము గెలిచామని చెప్పారు. గెలిస్తే పొంగిపోము, ఓడితే కృంగిపోము అని స్పష్టం చేశారు. ఫలితాలతో ఆగం ఆగం కావొద్దని.. సమీప భవిష్యత్‌లో మళ్లీ పాలన భాధ్యత మన భుజాల మీదకే వస్తుందని పార్టీ శ్రేణుల్లో భరోసా నింపారు కేసీఆర్.
అన్నీ కొండెంగ చేష్టలు..
సీఎం, మంత్రుల కొండెంగా చేష్టల వల్ల రాష్ట్రంలో కరెంట్ కోతలు ఏర్పడుతున్నాయని కేసీఆర్ విమర్శించారు. కొత్త ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క కొత్త పాలసీ తీసుకురాలేదన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ లోగో మార్పు అంశంపై కేసీఆర్ స్పందించారు. ఏ నిర్ణయం తీసుకున్నా తాము సమిష్టిగా తీసుకున్నామన్నారు. నూతన ఉద్యమ పంథా కార్యాచరణ త్వరలో ప్రకటించుకుని ముదుకు వెళ్తామని స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావ వేడుకలు రెండు రోజులు నిర్వహిస్తామని.. చివరి శ్వాస వరకు నేను తెలంగాణ కోసం పని చేస్తానని అన్నారు.
For More Telangana News and Telugu News..
Updated Date - Jun 02 , 2024 | 01:35 PM