Telangana: గుడ్ న్యూస్.. రేషన్ కార్డుపై మంత్రి కీలక ప్రకటన..!
ABN, Publish Date - Aug 10 , 2024 | 06:21 PM
ఏళ్లుగా తెల్ల రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దిశగా అడుగులు వేస్తోంది.
హైదరాబాద్, ఆగష్టు 10: ఏళ్లుగా తెల్ల రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ఇదే అంశంపై రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో ఇతర మంత్రులు, సంబంధిత శాఖా అధికారులు హాజరయ్యారు. రేషన్ కార్డుల జారీపై కీలక కామెంట్స్ చేశారు మంత్రి ఉత్తమ్.
అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు..
రాష్ట్రంలో అర్హులైన ప్రజలందరికీ తెల్ల రేషన్ కార్డు జారీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం లక్షన్నర, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు ప్రామాణికంగా తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలుగా నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో భూములను కాకుండా వార్షిక ఆదాయాన్ని ఆధారంగా రేషన్ కార్డు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
కాగా, రేషన్ కార్డుల పంపిణీలో లబ్దిదారుల ఎంపికకు విధి విధానాల రూపకల్పనలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయనున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. లోక్సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. వాందరికీ సమాచారం చేరేలా లేఖలు రాయాలని అధికారులను ఆదేశించింది మంత్రివర్గ ఉపసంఘం.
తెల్ల రేషన్ కార్డుల జారీ కోసం సక్సేనా కమిటీ సిఫారసుల పరిశీలించడం, దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డుల అర్హత ప్రమాణాలను పరిశీలించాలను అధికారులను మంత్రులు ఆదేశించారు. ఇతర రాష్ట్రాలలో తెల్ల రేషన్ కార్డు ఉండి తెలంగాణలోనూ వైట్ రేషన్ కార్డు ఉంటే తీసివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాగా, శనివారం నాడు కొత్త రేషన్ కార్డుల మంజూరీపై సచివాలయంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీకి చైర్మన్గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించారు. ఈ సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ హాజరయ్యారు.
For More Telangana News and Telugu News
Updated Date - Aug 10 , 2024 | 06:21 PM