ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: పటేల్‌ తరహాలో గాంధీ విగ్రహం!

ABN, Publish Date - Oct 26 , 2024 | 02:56 AM

హైదరాబాద్‌లోని బాపూఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

  • గుజరాత్‌లోని వల్లభ్‌భాయ్‌ విగ్రహం స్థాయిలో హైదరాబాద్‌ బాపూఘాట్‌లో ఏర్పాటు

  • గాంధీ ఐడియాలజీ కేంద్రంగా రూపకల్పన

  • మూసీ పునరుజ్జీవం, తెలంగాణ అభివృద్ధికి

  • బీఆర్‌ఎస్‌, బీజేపీలు అడ్డు తగులుతున్నాయ్‌

  • గుజరాత్‌కు పోటీ ఇవ్వబోతున్నామనే..!

  • ప్రజల ఆలోచనను పట్టించుకోకుంటే

  • ఆ రెండు పార్టీలకు ప్రతిపక్ష హోదా దక్కదు

  • భావోద్వేగ రాజకీయాలు తప్ప..

  • పదేళ్లు ప్రధానిగా మోదీ చేసిందేంటి?

  • ఏబీపీ సదరన్‌ రైజింగ్‌ సమ్మిట్‌లో రేవంత్‌

  • దేశంలోనే అత్యుత్తుమ క్రీడా పాలసీ కావాలి

  • వర్సిటీ బిల్లుపై అధికారులకు ఆదేశాలు

హైదరాబాద్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని బాపూఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. గుజరాత్‌లోని సర్ధార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహం తరహాలోనే బాపూఘాట్‌లోనూ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పారు. శుక్రవారం ఏబీపీ సదరన్‌ రైజింగ్‌ సమ్మిట్‌లో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం సీఎం మాట్లాడారు. మూసీ పునరుజ్జీవ కార్యక్రమాన్ని, బాపూఘాట్‌ అభివృద్ధిని బీజేపీ, బీఆర్‌ఎస్‌ వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. గుజరాత్‌లో బీజేపీ వాళ్లు సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ నిర్మించుకోవచ్చు కానీ, తాము మూసీ పునరుజ్జీవం చేస్తామంటే మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.


తాము గుజరాత్‌కు పోటీ ఇవ్వబోతున్నందునే తెలంగాణను, హైదరాబాద్‌ను అభివృద్ధి చేయనివ్వకుండా అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. అయినా.. గాంధీ వారసులుగా తాము బాపూఘాట్‌ను అభివృద్ధి చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. ఇక దక్షిణాది రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని రేవంత్‌ ఆరోపించారు. ఈ రాష్ట్రాలకు ప్రధాని మోదీ అందించిన సహకారం చాలా తక్కువ అని అన్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే.. దక్షిణాది రాష్ట్రాల నుంచే పన్నులు ఎక్కువగా చెల్లిస్తున్నామని, అయినా వాటిలో తిరిగి పొందేది మాత్రం చాలా తక్కువగా ఉంటోందన్నారు. తెలంగాణ నుంచి కేంద్రానికి పంపించే ప్రతి రూపాయిలో కేవలం 40 పైసలు మాత్రమే వెనక్కి వస్తున్నాయని తెలిపారు. అదే ఉత్తరప్రదేశ్‌ నుంచి మాత్రం కేంద్రానికి రూపాయి వెళ్తే.. రూ.7 వస్తున్నాయని, బిహార్‌కు రూ.6వెనక్కి వస్తున్నాయని అన్నారు.


  • దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను దక్షిణాది రాష్ర్టాలు ఆహ్వానిస్తున్నా.. నిధుల విషయంలో మాత్రం వివక్షే ఎదురవుతోందని సీఎం రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తి కావడమే ఈ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడానికి కారణమన్నారు. గతంలో ఉత్తరాది నుంచి ఎవరైనా ప్రధాని అయితే.. దక్షిణాదికి చెందిన వ్యక్తిని రాష్ట్రపతిని చేసే సంప్రదాయాన్ని కాంగ్రెస్‌ పాటించిందని తెలిపారు. మోదీ వచ్చాక ఈ సంప్రదాయాన్ని తుంగలో తొక్కారని ఆరోపించారు. మూడు సార్లు అధికారం చేపట్టి.. దేశ ప్రజల కోసం ఏ సంస్కరణలు తీసుకువచ్చారని ప్రశ్నించారు. పార్టీలను విడగొట్టి,, ప్రభుత్వాలను పడగొట్టేందుకు పనిచేయడం తప్ప.. ప్రధానిగా ప్రజలకు మోదీ పార్టీ చేసిందేమీలేదని ఆరోపించారు. భావోద్వేగ రాజకీయాలతో ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.


  • కేసీఆర్‌ బయటకు ఎందుకు రావడంలేదు?

పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపించిన గత సీఎం కేసీఆర్‌.. పదిసార్లు కూడా సెక్రటేరియట్‌కు రాలేదని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే పది నిమిషాలు అసెంబ్లీలో కూర్చుని వెళ్లిపోయారని తెలిపారు. కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే బయటకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ‘‘కేసీఆర్‌ తనకు తానే స్వాతంత్య్ర సమరయోధుడినని చెప్పుకొంటారు. ఫాంహౌ్‌సలో పడుకొంటారు. పదేళ్లలో ఒక్కసారి కూడా సచివాలయానికి రాలేదు. గత పది నెలల్లో ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాలేదు. ప్రజాస్వామ్యంపైౖ గౌరవం ఉంటే ఎందుకు రావట్లేదు? తానొక జమీందార్‌గా, ప్రజలందరూ గులాములుగా కేసీఆర్‌ భావిస్తుంటారు. అందుకే బయటకు రావడంలేదు’’ అని రేవంత్‌ అన్నారు. ఫ్యూచర్‌ సిటీ, రీజినల్‌ రింగురోడ్డు, రేడార్‌ స్టేషన్‌, ఇరిగేషన్‌ ప్రాజెక్టులతో తెలంగాణ పురోగతిని సాధించి గుజరాత్‌కు పోటీ ఇస్తుందనే విషయం తెలిసే తమ ప్రయత్నాలను ఆపేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి ప్రయత్నం చేస్తున్నాయని రేవంత్‌ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ వ్యతిరేకించిన మరుసటి రోజే కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడతారని అన్నారు. అయినా ఫ్యూచర్‌ సిటీని నిర్మిస్తే తప్పేంటని ప్రశ్నించారు.


  • నవంబరు నెలాఖరులోగా క్రీడా పాలసీ

దేశంలోనే అత్యుత్తమంగా ఉండేలా రాష్ట్ర క్రీడా పాలసీని రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తుది ముసాయిదాను నవంబరు నెలాఖరులోగా సిద్ధం చేయాలన్నారు. ఇందుకోసం క్రీడాకారులు, నిపుణులతో సంప్రదించడంతోపాటు విస్తృతంగా అధ్యయనం చేయాలన్నారు. యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ వర్సిటీ బిల్లును సాధ్యమైనంత త్వరగా రూపొందించాలని సూచించారు. క్రీడా పాలసీపై శుక్రవారం తన నివాసంలో అఽధికారులతో సీఎం సమీక్షించారు. మరో పది రోజుల్లోనే క్రీడా పాలసీకి సంబంధించిన గవర్నింగ్‌ బాడీని ఖరారు చేయాలన్నారు.


ఈ సందర్భంగా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, స్పోర్ట్స్‌ అకాడమీ, స్పోర్ట్స్‌ అఽథారిటీ ఆఫ్‌ తెలంగాణకు సంబంధించిన పలు అంశాలను అధికారులు వివరించగా.. సీఎం పలు మార్పుచేర్పులను సూచించారు. దక్షిణకొరియా క్రీడా వర్సిటీ ప్రతినిధులతో చర్చించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దీంతోపాటు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌ వర్సిటీ విధానాలపై అధ్యయనం చేయాలన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు సంబంధించిన క్యాలెండర్‌ను తయారుచేయాలని, రెండేళ్లలో నేషనల్‌గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యమిచ్చేలా ఒలింపిక్‌ అసోసియేషన్‌ను సంప్రదించాలని అన్నారు.


తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలు ఎన్నుకుంటేనే మేము అధికారంలోకి వచ్చాం. ప్రభుత్వాన్ని పనిచేయనివ్వండి.. మీకు నచ్చకపోతే ఇంట్లో కూర్చోండి. మా ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని చూస్తే.. ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతోనైనా కేసీఆర్‌ ప్రజల ఆలోచనను అర్ధం చేసుకోవాలి. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే సర్కారును పడగొట్టాలని చూశారు. కానీ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే నాకు మద్దతుగా నిలిచారు.

- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

Updated Date - Oct 26 , 2024 | 02:56 AM