ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

HYDRA: చెరువుల చెర.. వారి పనే!

ABN, Publish Date - Aug 26 , 2024 | 03:09 AM

ఆయన దేశానికి అత్యంత కీలకమైన ‘రక్షణ’ శాఖకు మంత్రిగా పనిచేసిన నాయకుడు.. కానీ, చెరువుల వంటి ప్రకృతి వనరుల ‘రక్షణ’ ఎంతటి అవసరమో విస్మరించారు..!

  • ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల నిర్మాణాలు

  • వ్యాపారులు, సినీ ప్రముఖులవీ.. హిమాయత్‌సాగర్‌లో భవనాలు

  • గండిపేటలో పళ్లం రాజు, కావేరి సీడ్స్‌, ప్రొ కబడ్డీ ఓనర్‌ ఆక్రమణలు

  • నందగిరిహిల్స్‌ పార్కు కబ్జాకు దానం నాగేందర్‌ సహకారం

  • బుమ్‌రుఖ్‌దౌలా చెరువులో కట్టడాల వెనుక మజ్లిస్‌ నేతలు

  • ఇప్పటివరకు 18 ప్రాంతాలు.. 44 ఎకరాల్లో కూల్చివేతలు

  • ‘ఎన్‌’ కన్వెన్షన్‌లో 4.9 ఎకరాలలో నిర్మాణాలు నేలమట్టం: హైడ్రా

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ఆయన దేశానికి అత్యంత కీలకమైన ‘రక్షణ’ శాఖకు మంత్రిగా పనిచేసిన నాయకుడు.. కానీ, చెరువుల వంటి ప్రకృతి వనరుల ‘రక్షణ’ ఎంతటి అవసరమో విస్మరించారు..! ఈయన.. ‘రక్షణ’ సినిమాలో పోలీస్‌ అధికారిగా సమాజాన్ని కాపాడే హీరో.. కానీ, జల వనరుల సంరక్షణ మాత్రం తన బాధ్యత కాదన్నట్లు ఆక్రమణకు తెగించారు..! ఇంకొకాయన పంటల సాగుకు విత్తనాలు విక్రయించే వ్యాపారి..! కానీ.. ఆ పంటకు నీరు అందించే చెరువులోనే విలాసవంతమైన భవనం కట్టేశారు..! వీరేకాదు.. హైదరాబాద్‌ కబ్జాల్లో ప్రజాప్రతినిధులు, ప్రముఖుల నుంచి చోటా నేతల వరకు అందరిదీ ఒకటే దర్జా.


హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ మానిటరింగ్‌ ఏజెన్సీ (హైడ్రా) దూకుడుతో వీరి దందా బయటపడుతోంది. అభివృద్ధి క్రమంలో భూముల ధరలు అనూహ్యంగా పెరగడంతో కబ్జా చేసి కొందరు..! తక్కువ ధరకు కొని ఇంకొందరు..! హైదరాబాద్‌ మహా నగరంలో చెరువులు, పార్కులు, నాలాల పక్కన ప్రభుత్వ స్థలాలను చెరపట్టింది ప్రజాప్రతినిధులు, రాజకీయ, అధికార అండదండలున్న వ్యాపార, సినీ ప్రముఖులే. నాయకుల్లో అధికార, ప్రతిపక్షం అన్న తేడా లేదు..! ఈవీడీఎం, హైడ్రా లు మూడు నెలల్లో 18 ప్రాంతాల్లోని చెరువుల గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం (ఎఫ్‌టీఎల్‌), బఫర్‌ జోన్‌, పార్కుల్లో పడగొట్టిన ఆక్రమణల్లో సింహభాగం రాజకీయ, వ్యాపార ప్రముఖులవే. ఇందులో ‘ఎన్‌’ కన్వెన్షన్‌ సెంటర్‌ కూడా ఉంది. గండిపేట, తమ్మిడికుంట, బుమ్‌రుఖ్‌దౌలా చెరవుల్లో నేరుగా కబళించగా, కొన్నిచోట్ల పేదలను ముందు పెట్టి కబ్జాకు పాల్పడ్డారు. కాగా, ఇప్పటివరకు 43.94 ఎకరాల్లో ఉన్న ఆక్రమణలను తొలగించినట్లు హైడ్రా ఆదివారం ప్రకటించింది.


  • అపాత్ర‘దానం’

హైదరాబాద్‌లో ఖరీదైన జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో పార్కులను చెరబట్టే ప్రయత్నం దశాబ్దాలుగా నడుస్తోంది. జూబ్లీహిల్స్‌ నందగిరిహిల్స్‌లోని పార్కు స్థలంలో ఆక్రమణలు వెలిశాయి. దీనివెనుక ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పాత్ర ఉందని హైడ్రా గుర్తించింది. ఆక్రమణల తొలగింపుతో ఆగ్రహించిన దానం.. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో దానంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాగా, జూబ్లీహిల్స్‌ లోట్‌సపాండ్‌లోని ఫిల్మ్‌నగర్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ ప్లాట్‌ నంబర్‌ 20 పక్కనున్న పార్కు స్థలంలో ప్రహరీ నిర్మించి వ్యర్థాలతో నింపారు. రంగంలోకి దిగిన హైడ్రా.. కాంపౌండ్‌ను కూల్చి స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలోని పార్కు స్థలంలో రేకుల షెడ్లు నిర్మించగా కూల్చివేసింది. మిథిలానగర్‌లోనూ పార్కు ప్రదేశంలో రేకుల షెడ్లు వేయగా పడగొట్టింది. ఫిల్మ్‌నగర్‌లోని బీజేఆర్‌నగర్‌, అమీర్‌పేటలో నాలాలపై చేపట్టిన నిర్మాణాలను తొలగించింది.


  • ‘ఎన్‌’లో 4.9 ఎకరాల్లో..

ఖానామెట్‌లోని తమ్మిడికుంట చెరువులో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను పడగొట్టడం సంచలనం రేపింది. 14 ఏళ్ల క్రితం నిర్మించి.. కోర్టు స్టేల ద్వారా చర్యలు ఆగిన నిర్మాణంపై చర్యలు చేపట్టడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉన్న 3.30 ఎకరాల్లో రెండు భారీ, ఆరు సాధారణ షెడ్లను కూల్చివేశారు. మొత్తంగా 4.9 ఎకరాలలో నిర్మాణాల కూల్చివేత జరిగిందని హైడ్రా పేర్కొంది.


  • చోటా నేత.. బడా బుర్ర

గాజులరామారంలోని చింతల్‌ చెరువు ఆక్రమణ సినిమాను తలపించేలా జరిగింది. శిఖం పట్టా భూముల యజమానులతో బీఆర్‌ఎస్‌ స్థానిక నాయకుడు రత్నాకరం సాయిరాజు ముందుగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. పేదలకు డబ్బులిచ్చి చెరువులో చిన్న గదులు నిర్మించాడు. 80, 100, 120 చదరపు గజాల చొప్పున మొత్తం 54 ప్లాట్లు చేసి అమ్మాడు. తక్కువ ధర కావడంతో మధ్య తరగతి వర్గాలు కొనుగోలుకు ఆసక్తి చూపాయి. అయితే, పూర్తిగా ఎఫ్‌టీఎల్‌లో ఉన్నట్టు నిర్ధారణకు వచ్చి.. ఈ నెల 6వ తేదీన మొత్తం 54 నిర్మాణాలను పడగొట్టింది. కాగా, ఒక్కో గది నిర్మాణానికి రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చుపెట్టిన సాయిరాజు.. ప్లాట్ల ద్వారా రూ.కోట్లు సంపాదించాడు.


ఇందులో భూ యజమానులకు కొంత, గదులు నిర్మాణం చేపట్టిన పేదలకు కొంత ఇచ్చాడు. గాజులరామారంలోని భూదేవిహిల్స్‌ పరికి చెరువు బఫర్‌ జోన్‌లో నిర్మించిన బేస్‌మెంట్లను, మహదేవపురం పార్కులో నిర్మాణంలో ఉన్న రెండంతస్తుల భవనాన్ని, చందానగర్‌ ఈర్ల చెరువులో జీహెచ్‌ఎంసీ అనుమతి పొందినా.. ఎఫ్‌టీఎల్‌లో ఉండడంతో జి ప్లస్‌ 3, జి ప్లస్‌ 4 భవనాలను హైడ్రా పడగొట్టింది. నిర్మాణ పనులు పూర్తికాకముందే పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు నివాసయోగ్య పత్రం (ఓసీ) ఇచ్చినట్టు గుర్తించింది. హెచ్‌ఎండీఏ అనుమతులతో స్టిల్ట్‌ ప్లస్‌ ఐదంతస్తులుగా నిర్మించిన 3 భవనాలు ప్రగతినగర్‌ ఎర్రకుంట చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉండడంతో నేలమట్టం చేసింది.


  • ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ.. 12 ఎకరాలు

రాజేంద్రనగర్‌ బుమ్‌రుఖ్‌దౌలా చెరువులో ఆక్రమణలది పెద్ద కథే. ఇక్కడ ఎఫ్‌టీఎల్‌లో ఏకంగా 12 ఎకరాలలో జి ప్లస్‌ 2 నిర్మాణాలు చేపట్టారు. కూల్చివేతను అడ్డుకునేందుకు వచ్చిన ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్‌ ముబిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుమ్‌రుఖ్‌దౌలా చెరువులో భవనాలు నిర్మించడంలో ముబిన్‌తో పాటు ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్‌బేగ్‌ పాత్ర ఉందని హైడ్రా ప్రకటించింది.


  • ‘గండి’కొట్టిన పెద్దలు

ఒకనాడు జంట నగరాల తాగునీటి వనరులు ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట), హిమాయత్‌సాగర్‌. ఇప్పుడు వీటి చుట్టూ కోకొల్లలుగా ఆక్రమణలు వెలిశాయి. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో కొందరు రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఇంద్రభవనాల్లాంటి అతిథి గృహాలు నిర్మించారు. వరద వచ్చే కాల్వల్లో అత్యధికం కనుమరుగయ్యాయి. దీంతో మురుగంతా జంట జలాశయాల్లో చేరుతోంది. గండిపేట ఎఫ్‌టీఎల్‌లో.. ఖానాపూర్‌ గ్రామ పరిధిలో 8.75 ఎకరాలు, చిలుకూరులో 6.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భవనాలను ఈ నెల 18న హైడ్రా నేలమట్టం చేసింది. ఇక్కడ రక్షణ శాఖ మాజీ మంత్రి పళ్లం రాజు, కావేరి సీడ్స్‌ యజమాని జీవీ భాస్కర్‌రావు, మంథనిలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన సునీల్‌రెడ్డి, ప్రొ కబడ్డీ లీగ్‌ యజమాని అనుపమలకు చెందిన భవనాలను ఉండడం గమనార్హం.


హిమాయత్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లోనూ మంత్రులు, మాజీ మంత్రులు, ఇతరుల అతిథి గృహాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. దీని ఎఫ్‌టీఎల్‌ నోటిఫై చేయనందున నిర్మాణాలపై చర్యల విషయంలో ప్రతిష్ఠంభన నెలకొంది. అధికార పార్టీకి చెందినవారి నిర్మాణాలు ఉన్నందునే ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ కాలేదనే అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో నిర్ధారించిన ఎఫ్‌టీఎల్‌ను ప్రామాణికం చేసుకుని చర్యలు తీసుకునే విషయమై ప్రభుత్వం నుంచి హైడ్రా స్పష్టత కోరింది. సర్కారు నిర్ణయం అనంతరం చర్యలు ఉంటాయని సంస్థ వర్గాలు చెబుతున్నాయి.


  • ఆక్రమణదారులు.. బాధ్యులైన అధికారులపై చర్యలు: రంగనాథ్‌

చెరువులు, పార్కులు కబ్జాకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యల దిశగా హైడ్రా కసరత్తు చేస్తోంది. భారత న్యాయ సంహిత(బీఎన్‌ఎ్‌స) ప్రకారం ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తే ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయవచ్చనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. వీటి విచారణ కోసమే త్వరలో హైడ్రా పోలీ్‌సస్టేషన్‌ రానుంది. చందానగర్‌ ఈర్ల చెరువు, ప్రగతినగర్‌ ఎర్రకుంట చెరువులో భవన నిర్మాణాలకు అనుమతిచ్చిన జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులపైనా చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు.


కాగా, నిర్మాణదారులతో పాటు వారికి సహకరించినవారిపై ప్రత్యేక దృష్టిసారించినట్టు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. కొన్ని చెరువుల ఎఫ్‌టీఎల్‌ నోటిఫైకి ప్రభుత్వం ఆదేశించిందని.. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉన్న నిర్మాణాల కూల్చివేత కొనసాగుతుందని స్పష్టం చేశారు. అక్రమాలకు సహకరించిన అధికారులపై కచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు.

Updated Date - Aug 26 , 2024 | 03:09 AM

Advertising
Advertising
<