ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

HYD : బాబోయ్‌.. లేక్‌ వ్యూ

ABN, Publish Date - Sep 04 , 2024 | 04:14 AM

రాజధాని హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార గమనాన్ని.. ‘హైడ్రా’ పూర్తిగా మార్చేసిందనడంలో సందేహం లేదు. చెరువుల ఫుల్‌ట్యాంక్‌ లెవల్‌, బఫర్‌ జోన్ల గురించి వినియోగదారుల్లో అది తెచ్చిన అవగాహన అంతా ఇంతా కాదు!!

  • చెరువు ఫేసింగ్‌ ఫ్లాట్ల అమ్మకాలపై హైడ్రా దెబ్బ

  • గతంలో అలాంటి ఫ్లాట్లకు ప్రీమియం ధరలు

  • ఇప్పుడవి వద్దంటున్న వినియోగదారులు

  • ఇచ్చిన అడ్వాన్సులూ తీసేసుకునే యత్నం

  • చెరువుకు దూరంగా ఉన్నా.. ఎఫ్‌టీఎల్‌,

  • బఫర్‌ జోన్‌ పరిధిలో ఉందా అని ఆరా!

  • అలాంటి ఫ్లాట్ల‘సెకండ్‌ సేల్స్‌’పైనా ప్రభావం

  • ‘లేక్‌ వ్యూ’ అనే మాటే లేకుండా బిల్డర్ల జాగ్రత్త

  • ప్రచారమంతా ‘గార్డెన్‌ ఫేసింగ్‌’ పేరుతోనే!

  • భూయజమానులతో పాత ఒప్పందాలూ రద్దు

మా అపార్టుమెంట్‌కు మాంచి లేక్‌ వ్యూ ఉంది. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణం హైదరాబాద్‌ కాంక్రీట్‌ జంగిల్‌లో ఎక్కడ ఉంటుంది? అందుకే మా ప్రాజెక్టుకు డిమాండ్‌ ఎక్కువ. బుక్‌ చేసుకుంటే ఇప్పుడే చేసుకోండి. ఆలస్యం చేస్తే లేక్‌ వ్యూ ఉన్న ఫ్లాట్లు దొరకవు.

..కొద్దిరోజుల క్రితం దాకా హైదరాబాద్‌ మహానగరంలోని బిల్డర్ల మాట ఇది! కానీ, హైడ్రా దెబ్బకు లెక్కలు మారాయి! ‘లేక్‌ వ్యూ’ అనగానే.. అదేదో చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో కట్టిన అపార్ట్‌మెంట్‌ అనుకుని వినియోగదారులు భయపడి ఆ వైపు చూడడమే మానేసే పరిస్థితి!! దీంతో బిల్డర్లు అప్రమత్తమయ్యారు. తమ బ్రోచర్లలో, ప్రచారంలో ఎక్కడా చెరువు గురించిన ప్రస్తావనే చెయ్యట్లేదు. దానికి బదులుగా.. ‘గార్డెన్‌ ఫేసింగ్‌ ఫ్లాట్‌’ అని ప్రచారం చేస్తున్నారు.

(హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రతినిధి-ఆంధ్రజ్యోతి)

రాజధాని హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార గమనాన్ని.. ‘హైడ్రా’ పూర్తిగా మార్చేసిందనడంలో సందేహం లేదు. చెరువుల ఫుల్‌ట్యాంక్‌ లెవల్‌, బఫర్‌ జోన్ల గురించి వినియోగదారుల్లో అది తెచ్చిన అవగాహన అంతా ఇంతా కాదు!! హైడ్రా ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే.. మొదట్లో దాని గురించి పెద్దగా పట్టించుకొని స్థిరాస్తి వ్యాపారులు ఇప్పుడు అనుక్షణం దాని గురించే మాట్లాడుకుంటున్నారు.

నిద్రలోనూ హైడ్రా మీదనే ఆలోచనలు. చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో నిర్మాణాలను హైడ్రా నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తుండడం.. ప్రజల్లో కూడా దీనిపై చైతన్యం రావడంతో రియల్‌ఎస్టేట్‌ సంస్థలు తమ మార్కెటింగ్‌ వ్యూహాల్ని పూర్తిగా మార్చేశాయి. లేక్‌ వ్యూ అనే మాటను మాటవరసకు చెప్పటానికి కూడా భయపడుతున్నాయి. నిజంగా తమ ప్రాజెక్టులు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో లేకున్నా.. కాస్త దూరంలో ఉన్నా కూడా ‘లేక్‌ వ్యూ’ అనే మాటే ప్రస్తావించేందుకు ఇష్టపడటం లేదు. ‘‘గతంలో మా వద్దకు వచ్చే వినియోగదారులు హెచ్‌ఎండీఏ అనుమతులున్నాయా? రెరా నిబంధనలను పాటిస్తున్నారా? తదితరప్రశ్నలే అడిగేవారు. ఇప్పుడు.. ‘మీ ప్రాజెక్టు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో లేదు కదా?’ అని అడుగుతున్నారు’’ అని నగరానికి చెందిన ఒక ప్రముఖ బిల్డర్‌ పేర్కొన్నారు.

సదరు బిల్డర్‌ ఇటీవల నిర్మించిన ఒక అపార్ట్‌మెంట్‌ చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌కు ఆమడదూరాన ఉంది. ఆ వెంచర్‌ వేసినప్పుడు ‘లేక్‌ వ్యూ’ గురించి గొప్పగా చెప్పి ప్రీమియం ధరకు ఫ్లాట్లు అమ్మిన ఆయన.. ఇప్పుడు మిగిలిన ప్లాట్లను అమ్మే విషయంలో నానా తిప్పలు పడుతున్నారు.


‘‘నిజానికి ఈ ప్రాజెక్టు మీద లాభం మొత్తం.. మిగిలిన ఈ ప్లాట్ల మీదనే ఉంది. ‘రెడీ టూ మూవ్‌’ కాబట్టి ఎక్కువ ధర వస్తుందనుకున్నా. కానీ, హైడ్రా దెబ్బతో ఇవి అమ్ముడు కావడం కష్టంగా మారింది’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఇప్పటికే అందులో ఫ్లాట్లు కొన్నవారు సైతం ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ గురించి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నట్లు చెప్పారు. ‘‘మా ప్రాజెక్టు చెరువుకు చాలా దూరాన ఉంది. నాలుగైదు అంతస్తుల వారికి వ్యూ బాగుంటుంది. అదే మాట చెప్పి వారికి ప్రీమియం ధరకు అమ్మాం. ఇప్పుడు వారిని సమాధానపర్చటం కష్టంగా మారింది’’ అని వాపోయారాయన.

మారిన ప్రచారం..

ఐటీ కారిడార్‌లో ఒక భారీ ప్రాజెక్టు చేపట్టిన పెద్ద రియల్‌ ఎస్టేట్‌ సంస్థ.. తొలుత ‘లేక్‌ వ్యూ’ పేరుతో భారీగా ప్రచారం చేసి జోరుగా ఫ్లాట్ల బుకింగులను కొనసాగించింది. ఆ వ్యూ ఉన్న ఫ్లాట్ల ధరను చదరపు అడుగుకు రూ.500 అదనంగా చెప్పినా వినియోగదారులు ఎగబడి బుక్‌చేశారు. కానీ, హైడ్రా ఎంట్రీ తర్వాత ఆ ప్రచారమే సదరు సంస్థకు శాపంగా మారింది. గతంలో టోకెన్‌ అడ్వాన్స్‌ ఇచ్చి ఫ్లాట్‌ బుక్‌ చేసిన వారు ఇప్పుడు వాటిని రద్దు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొత్తగా కొనేవారూ ‘లేక్‌ వ్యూ’ గురించి ఆరా తీస్తూ అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ సంస్థ తన బ్రోచర్లు, ప్రచార హోర్డింగుల్లో లేక్‌ వ్యూ అనే మాటను ‘గార్డెన్‌ ఫేస్‌’గా మార్చేసింది. ఆ ఒక్క సంస్థే కాదు.. చెరువులకు దగ్గరగా ప్రాజెక్టులు చేపట్టిన అన్ని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలదీ ఇప్పుడు అదే దారి. బిల్డర్లంతా ఇప్పుడు తమ మార్కెటింగ్‌ సిబ్బందికి ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. ఫ్లాట్‌ను బుక్‌ చేసే సమయంలోనూ.. క్లయింట్‌తో మాట్లాడే సమయంలో లేక్‌ వ్యూ ప్రస్తావన రాకూడని స్పష్టం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘లేక్‌ వ్యూ’ అనే మాటే హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ వర్గాల్లో నిషిద్ధంగా మారిందంటే అతిశయోక్తి కాదు.


సెకండ్‌ సేల్‌ ఎలా?

గతంలో చెరువు ఫేసింగ్‌తో ఉన్న ఫ్లాట్లు కొన్నవారికి ఇప్పుడు కొత్త దిగులు పట్టుకుంది. అలాంటి ఫ్ల్లాట్లకు ఒకప్పుడు సెకండ్‌ సేల్స్‌లోనూ బాగా డిమాండ్‌ ఉండేదని.. ఇప్పుడా గిరాకీ దారుణంగా పడిపోయిందని వారు వాపోతున్నారు. ఉదాహరణకు.. మియాపూర్‌కు చెందిన ఒక పైవ్రేటు ఉద్యోగి తనకున్న లేక్‌ వ్యూ ఫేసింగ్‌ డబుల్‌ బెడ్రూం ఫ్లాట్‌ను అమ్మకానికి పెట్టారు. అనుకున్న ధర రాకపోవడంతో మొదట్లో వచ్చిన ఆఫర్లకు నో చెప్పారు. కానీ, ఇప్పుడా ఫ్లాట్‌ను కొనడానికి ఎవరూ ముందుకురాని పరిస్థితి. గతంలో కొనేందుకు ఆసక్తి చూపిన వారికి ఫోన్‌ చేస్తే.. ‘చెరువులకు దగ్గరగా ఉన్న ఫ్లాట్లను కొనాలనుకోవట్లేదు’ అని తెగేసి చెబుతున్నారని ఆయన తెలిపారు. నగరంలో ఇలాంటి అనుభవాలు చాలామందికి ఎదురవుతున్నాయి. అలాగే.. గతంలో లేక్‌ వ్యూ ఉన్న స్థలాల యజమానుల హవా నడిచేది. ఇప్పుడా పరిస్థితి లేదు సరికదా.. ఆ యజమానులతో చేసుకున్న ఒప్పందాలనూ రద్దు చేసుకునేందుకు బిల్డర్లు సిద్ధమవుతున్నారు.

వందలాది ఫ్లాట్లు.. కొనేవారు లేక..

మార్కెట్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మియాపూర్‌ మక్తా, నల్లగండ్ల చెరువు, దేవుని కుంటకు దూరాన ఉన్న ప్రాజెక్టుల్లో వందలాది ఫ్లాట్లు అమ్ముడుపోని పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి ఖాజాగూడ, నానక్‌ రాంగూడ, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. దుర్గంచెరువు దగ్గర్లో నిర్మాణాల్ని ప్రారంభించాలనుకున్న వారిలో చాలామంది ఆ ప్రాజెక్టులను పూర్తిగా ఉపసంహరించుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

Updated Date - Sep 04 , 2024 | 04:14 AM

Advertising
Advertising