AV Ranganath: బెంగళూరులో ముగిసిన ‘హైడ్రా’ పర్యటన
ABN, Publish Date - Nov 09 , 2024 | 05:07 AM
బెంగళూరులో హైడ్రా అధికారుల బృందం పర్యటన ముగిసింది. పర్యటన సందర్భంగా కర్ణాటక ట్యాంక్స్ కన్జర్వేషన్ అండ్ డెవల్‌పమెంట్ అథారిటీ (కేటీసీడీఏ) సీఈవో రాఘవన్‌తో శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బృందం సమావేశమైంది.
కేటీసీడీఏ సీఈవోతో భేటీ.. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ గురించి తెలుసుకున్న హైడ్రా కమిషనర్ బృందం
హైదరాబాద్ సిటీ, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): బెంగళూరులో హైడ్రా అధికారుల బృందం పర్యటన ముగిసింది. పర్యటన సందర్భంగా కర్ణాటక ట్యాంక్స్ కన్జర్వేషన్ అండ్ డెవల్‌పమెంట్ అథారిటీ (కేటీసీడీఏ) సీఈవో రాఘవన్‌తో శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బృందం సమావేశమైంది. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణకు కేటీసీడీఏ చేపడుతున్న చర్యలను వారు అడిగి తెలుసుకున్నారు. చెరువుల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం (ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్‌లో ఉన్న భూమిని ప్రభుత్వ భూమిగా పరిగణిస్తున్నట్టు రాఘవన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం తెచ్చిన దిశాంక్ యాప్‌లో ప్రభుత్వ భూమి, పట్టా భూమి, హక్కుదారుడి వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. చెరువుల అభివృద్ధికి సంబంధించి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాక సాంకేతిక బృందం అధ్యయనం అనంతరం పనులు చేపడుతున్నట్టు రాఘవన్ పేర్కొన్నారు.
విమోస్ టెక్నోక్రాట్స్ లిమిటెడ్ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇప్పటి వరకు చేపట్టిన చెరువుల పునరుద్ధరణ తీరును వివరించారు. అనంతరం రంగనాథ్ మాట్లాడుతూ.. ఐటీ కంపెనీల ఆర్థిక సహకారంతో బెంగళూరులోని ఎలక్ర్టానిక్ కారిడార్‌కు వెళ్లే మార్గంలోని 44 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దొడ్డతోగు చెరువును సహజసిద్ధ విధానంలో అభివృద్ధి చేసినట్టు తెలిపారు. మురుగు నీటిని శుద్ధి చేసి చెరువు చుట్టూ ఉన్న పార్కులో వినియోగిస్తున్నారని, వరద నీటిని ప్రత్యేకంగా నిల్వ చేస్తున్నారని చెప్పారు. చేపలు, బాతులు వంటి జలాచరాలతో జీవవైవిధ్య కేంద్రాలుగా చెరువులున్నాయన్నారు. ప్రభుత్వం అనుమతితో హైదరాబాద్‌లోనూ ఇదే తరహాలో చెరువుల అభివృద్ధి చేయాలనుకుంటున్నామని, ఇందుకు ‘లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ ఆనంద్ మల్లిగవాడ్ సేవలు వినియోగించుకుంటామని తెలిపారు.
Updated Date - Nov 09 , 2024 | 05:07 AM