Nirmal : బిట్‌కాయిన్ పేరుతో దగా..
ABN, Publish Date - Sep 06 , 2024 | 05:13 AM
చట్టబద్ధత లేని యూబిట్ కాయిన్ చైన్ వ్యాపారం కలకలం రేపుతోంది. ఇందులో నిర్మల్ జిల్లాకు చెందిన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సూత్రధారులుగా వ్యవహరిస్తూ అమాయకులను బలి చేస్తున్నారు.
డాలర్లు పోగేయొచ్చని అమాయకులకు ఎర
ఏజెంట్లుగా ఎక్సైజ్ ఎస్సై, సివిల్ కానిస్టేబుల్
వందల మందిని చేర్పించిన ప్రభుత్వ టీచర్లు
కోట్లలో పెట్టుబడులు పెట్టిన అమాయకులు
నిర్మల్ జిల్లాలో భారీ దందా.. నిందితుల అరెస్ట్
నిర్మల్, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): చట్టబద్ధత లేని యూబిట్ కాయిన్ చైన్ వ్యాపారం కలకలం రేపుతోంది. ఇందులో నిర్మల్ జిల్లాకు చెందిన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సూత్రధారులుగా వ్యవహరిస్తూ అమాయకులను బలి చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం అందిన ఫిర్యాదుల మేరకు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ప్రత్యేక చొరవ తీసుకొని ఈ యూబిట్ కాయిన్ చైన్‌దందా గుట్టును రట్టు చేశారు. పలువురు ఏజెంట్లను అరెస్టు చేశారు. ఓఎక్సైజ్ ఎస్సైతో పాటు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి, కానిస్టేబుల్ మరో ఇద్దరు టీచర్లు వందల మందిని ఈ దందాలో రూ.లక్షల పెట్టుబడులు పెట్టించారని విచారణలో తేలింది. గొలుసుకట్టు పద్ధతిలో ఈ దందాను కొనసాగిస్తున్నారు. మొదట రూ. 50వేల పెట్టుబడి పెట్టిన వారికి డాలర్లరూపంలో కాయిన్‌లు వస్తాయి.
ఈ పెట్టుబడికి ప్రతీ నెల వడ్డీ రూపంలో వీరి ప్రత్యేక ఖాతాలో జమ అవుతున్నట్లు చూపుతున్నారు. దీంతో పాటు సభ్యులు మరో ఐదుగురిని చేర్పిస్తే వారికి మరింత ఆదాయం వస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఇలా పెద్ద సంఖ్యలో సభ్యులను చేర్పించిన వారికి యూబిట్ కాయిన్ సంస్థ స్టార్ రేటింగ్‌లు ప్రకటిస్తుండటం విశేషం. ఫైవ్ స్టార్ పొందిన వారు ఈ దందాలో సీనియర్లుగా చెలామణి అవుతూ జిల్లా అంతటా సభ్యులను చేర్పించారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ఆర్మూర్, కామారెడ్డి లాంటి పట్టణాల్లో కూడా వీరు నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు చెబుతున్నారు. అయితే ఈ చైన్ దందాలో చివరకు ఎవరు చెల్లింపులు చేస్తారనే విషయంపై స్పష్టత లేకున్నా.. అమాయకులు రూ.లక్షలు పెట్టుబడి పెడుతున్నారు.
ఉద్యోగులను నమ్మి పెట్టుబడులు..
నిర్మల్ జిల్లాలోని కడెం మండలానికి చెందిన టీచర్లు, ఓ కానిస్టేబుల్‌తో పాటు నిర్మల్‌కు చెందిన ఓ ఎక్సైజ్ ఎస్‌ఐ ఈ దందాకు సూత్రధారులుగా ఉన్నట్లు తేలింది. ఫిర్యాదులు రావడంతో జిల్లా ఎస్పీ జానకీ షర్మిల సూత్రధారుల సెల్‌ఫోన్లు, ఆర్థిక కార్యకలాపాలపై నిఘా పెట్టారు. దీంతో గుట్టు రట్టయ్యింది. వీరితో పాటు మరో 40మంది టీచర్లు కూడా వందల మందిని సభ్యులుగా చేర్పించి వారిచేత రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టించారని తెలుస్తోంది. అయితే ఈ పెట్టుబడులన్నీ తిరిగి రావడం కష్టమేనని నిపుణులు పేర్కొంటున్నారు.
స్టేట్ సైబర్ క్రైం ఆరా..
నిర్మల్‌లో పెద్ద ఎత్తున కొనసాగుతున్న యూబిట్ కాయిన్ దందాపై రాష్ట్ర సైబర్ క్రైం పోలీసులు నిఘా పెట్టినట్లు సమాచారం. నిర్మల్ ఎస్పీ పంపిన నివేదిక ఆధారంగా సైబర్ క్రైం ఉన్నతాధికారులు కొద్ది రోజుల్లోనే రంగంలోకి దిగి ఈ దందాపై ఆరా తీయనున్నట్లు సమాచారం.
Updated Date - Sep 06 , 2024 | 05:13 AM