KCR: అసమర్థులు రాజ్యమేలుతున్నారు..
ABN, Publish Date - May 08 , 2024 | 04:45 AM
‘‘అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో అసమర్థులు.. తెలివితక్కువ వారు రాజ్యమేలుతున్నారు.
పాలకులకు అభివృద్ధి చేతకావడం లేదు
కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే: కేసీఆర్
కామారెడ్డి/మెదక్/రామాయంపేట, మే7 (ఆంధ్రజ్యోతి): ‘‘అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో అసమర్థులు.. తెలివితక్కువ వారు రాజ్యమేలుతున్నారు. మోదీలాంటి అసమర్థుడి పాలన వల్ల అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట మంటగలిసింది. రూపాయి విలువ తగ్గిపోయింది. పదేళ్ల బీజేపీ పాలనలో అభివృద్ది లేదు. మోదీ ఇచ్చిన 150 హామీల్లో ఒక్కటీ నెరవేరలేదు. సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్ అంటూ దేశాన్ని సత్యనాశ్ చేశాడు. రాష్ట్రంలో అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి తెలివితక్కువతనంతో సంక్షేమ పథకాలను అమలుచేయడం లేదు’’ అని బీఆర్‌ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మంగళవారం ఆయన బస్సుయాత్ర కామారెడ్డి జిల్లా కేంద్రాన్ని చేరుకోగా.. నిజాంసాగర్ చౌరస్తా నుంచి భారీ రోడ్‌షో నిర్వహించారు.
జేపీఎన్ చౌరస్తా వద్ద.. రాత్రి మెదక్‌లోని రాందాస్ చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్‌లలో మాట్లాడారు. ‘‘మోదీతో దేశంలో ఎలాంటి అభివృద్ధి లేదు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా అమలుకు నోచుకోలేదు. జన్‌ధన్ యోజనలో పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని.. కామారెడ్డిలో బీజేపీ గెలిస్తే రూ.30 లక్షలు వేస్తానని చెప్పారు. ఆ మొత్తం మీ ఖాతాల్లో వేశారా?’’ అని ప్రజలను కేసీఆర్ ప్రశ్నించారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టడం, మతరాజకీయం తప్ప.. బీజేపీకి అభివృద్ధి, పేదల సంక్షేమం పట్టదని ఆరోపించారు. ‘‘ఈ ఎన్నికల్లో 400 సీట్లు ఖాయమని మోదీ, బీజేపీ ప్రతినిధులు చెబుతున్నారు. సీట్లేమోకానీ, మోదీ మళ్లీ వస్తే.. పెట్రోల్ ధరలు రూ.400కు పెరగడం గ్యారెంటీ’’ అని అన్నారు. ఎన్డీయేకు 200 సీట్లు కూడా దాటవని, కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రైతు భరోసాను ఆపించింది కాంగ్రెస్సే
బీఆర్‌ఎస్ హయాంలో అమలైన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసిందని కేసీఆర్ విమర్శించారు. కరెంటు కోతలు ప్రారంభమయ్యాయని, తాగునీటి సరఫరా బంద్ అయిందని విరుచుకుపడ్డారు. ఐదు నెలల్లోనే కాంగ్రెస్ సర్కారు లూటీలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని మిగిలిన రైతులందరికీ రెండురోజుల్లోగా రైతుభరోసా నిధులను జమచేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కుట్రలు చేసి, ఎన్నికల కమిషన్‌కు తమవారితోనే ఫిర్యాదు చేయించి, రైతు భరోసాను ఆపించారని కేసీఆర్ ఆరోపించారు.
కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రెప్పపాటు కాలం కూడా కరెంటు పోలేద న్నారు. రేవంత్‌రెడ్డి కొత్త జిల్లాలను తొలగిస్తానంటున్నారని, కామారెడ్డి జిల్లా ఉండాలా? వద్దా? అని ప్రజలను కేసీఆర్ ప్రశ్నించారు. మెదక్ కార్నర్ మీటింగ్‌లోనూ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. మెదక్ జిల్లానూ రద్దుచేసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, కేసీఆర్ కామా రెడ్డి నుంచి మెదక్ వెళ్తుండగా.. రామాయంపేటలో స్థానిక బ్రిడ్జి వద్దకు కాన్వాయ్ రాగానే పలువురు బీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డంగా పడుకుని ఆపాలని కోరారు. ఓ నిమిషం పాటు కాన్వాయ్ ఆగినప్పటికీ కేసీఆర్ మాత్రం సమయం లేదంటూ.. బస్సు దిగకుండానే అభివాదంచేస్తూ ముందుకు సాగారు.
Updated Date - May 08 , 2024 | 04:45 AM