హైపర్‌సానిక్ క్లబ్‌లో భారత్
ABN, Publish Date - Nov 18 , 2024 | 02:35 AM
భారతదేశపు తొలి దీర్ఘ శ్రేణి హైపర్‌సానిక్ (శబ్దం కన్నా ఐదు రెట్లు, అంతకు మించి వేగంతో వెళ్లే) క్షిపణిని రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి (డీఆర్‌డీవో) సంస్థ ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ దీవి నుంచి విజయవంతంగా పరీక్షించింది.
ఒడిశాలో విజయవంతంగా దీర్ఘ శ్రేణి క్షిపణి పరీక్ష
ఇదో చరిత్రాత్మక ఘట్టం: రాజ్‌నాథ్ సింగ్
ఇప్పటికే ఈ క్షిపణులను వాడుతున్న రష్యా
చైనా, అమెరికా పరీక్షలూ విజయవంతం
తాజా ప్రయోగంతో వీటి సరసన భారత్
అల్వాల్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): భారతదేశపు తొలి దీర్ఘ శ్రేణి హైపర్‌సానిక్ (శబ్దం కన్నా ఐదు రెట్లు, అంతకు మించి వేగంతో వెళ్లే) క్షిపణిని రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి (డీఆర్‌డీవో) సంస్థ ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ దీవి నుంచి విజయవంతంగా పరీక్షించింది. డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు, త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారుల సమక్షంలో ఈ పరీక్షను నిర్వహించారు. ప్రపంచంలో ఇప్పటిదాకా ఒక్క రష్యా వద్ద మాత్రమే ఆపరేషనల్ హైపర్‌సానిక్ క్షిపణులున్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధంలో వాటిని ప్రయోగిస్తోంది కూడా. అలాగే.. అమెరికా, చైనా హైపర్‌సానిక్ క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించాయి. తాజా ప్రయోగంతో.. హైపర్‌సానిక్ సత్తా ఉన్న ఆ దేశాల సరసన భారత్ చేరిందని రక్ష ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. దీన్నో చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ క్షిపణి ప్రాంగణం సహా దేశంలోని వివిధ డీఆర్‌డీవో పరిశోధనశాలలు, ఇతర పారిశ్రామిక భాగస్వాములతో కలిసి డీఆర్‌డీవో దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణి.. 1500 కిలోమీటర్లకు మించిన దూరంలోని లక్ష్యాలను హైపర్‌సానిక్ వేగంతో దూసుకెళ్లి ఛేదించగలదు.
హైపర్‌సానిక్ క్షిపణులు రెండు రకాలు. ఒకటి.. హైపర్‌సానిక్ గ్లైడ్ వె హికల్స్ (హెచ్‌జీవీ). రెండు.. హైపర్‌సానిక్ క్రూయిజ్ మిసైల్ (హెచ్‌సీఎం). హెచ్‌జీవీలను రాకెట్ బూస్టర్‌తో లాంచ్ చేస్తారు. నిర్ణీత ఎత్తుకు చేరిన తర్వాత.. క్షిపణి బూస్టర్ నుంచి విడివడి నిర్దేశిత మార్గంలో లక్ష్యం దిశగా దూసుకుపోతాయవి. హైపర్‌సానిక్ క్రూయిజ్ క్షిపణులు అలా కాదు. స్ర్కామ్ జెట్ ఇంజ న్ల సాయంతో మొత్తం ప్రయాణంలో హైపర్‌సానిక్ వేగాన్ని అలాగే కొనసాగిస్తాయి(ఈ స్ర్కామ్ జెట్ ఇంజన్లలోకి గాలి సూపర్‌సానిక్ వేగంతో లోపలికి వెళ్లి హైపర్‌సానిక్ వేగంతో బయటకు వస్తుంది).
బాలిస్టిక్ క్షిపణుల కన్నా తక్కువ ఎత్తులో, ఎగువ వాతావరణంలో ప్రయాణిస్తాయి. ఇంకా.. అమిత వేగం, మెన్యూవరబిలిటీ (ప్రయాణంలో ఉండగానే తన దిశ ను మార్చుకోగలగడం) వంటి లక్షణాలు ఉండడం తో.. సంప్రదాయ క్షిపణి రక్షణ వ్యవస్థలు గుర్తించి, అడ్డుకునేలోపే ఇవి లక్ష్యంపై విరుచుకుపడిపోతాయి. కాగా.. ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా, జపాన్ కూడా హైపర్‌సానిక్ క్షిపణుల అభివృద్ధికి కృషి చేస్తున్నాయి.
Updated Date - Nov 18 , 2024 | 02:36 AM