రైతును ముంచిన నకిలీ విత్తనాలు

ABN, Publish Date - Nov 13 , 2024 | 06:16 AM

మహబూబాబాద్‌ జిల్లాలో నాసిరకం విత్తనాల వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.

రైతును ముంచిన నకిలీ విత్తనాలు

  • ఓ కంపెనీ వంగడం కొని మోసపోయిన రైతులు

  • మహబూబాబాద్‌ జిల్లాలో ఘటన... ఆలస్యంగా వెలుగులోకి

నర్సింహులపేట, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్‌ జిల్లాలో నాసిరకం విత్తనాల వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ వానాకాలంలో ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన వరి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు విషయం తెలిసి లబోదిబోమంటున్నారు. జిల్లాలోని నర్సింహులపేట మండలంలోని రామన్నగూడెం, ముంగిమడుగు, కౌసల్యదేవిపల్లి, జయపురం గ్రామాలకు చెందిన సుమారు 50 మంది రైతులు మండల కేంద్రంలోని ఓ ఎరువుల దుకాణం నుంచి సదరు కంపెనీకి చెందిన విత్తనాలను 10 కేజీలకు రూ.900 చొప్పున కొనుగోలు చేసి వరి పంట వేశారు. పంట పెరుగుదల ఆశించిన మేరకు లేకపోవడం, అన్నీ బెరుకులు ఉండడంతో నట్టేట మునిగామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు విచారణ జరిపి నాసిరకం విత్తనాలు సరఫరా చేసిన కంపెనీపై కఠిన చర్యలు తీసుకొని, తమకు నష్టపరిహారం అందేలా చూడాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలావుండగా, ఓ కంపెనీకి చెందిన వరి వంగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయంపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని మండల ఏవో వినయ్‌కుమార్‌ తెలిపారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 06:18 AM