Jagga Reddy: ప్రత్యర్థి.. రాజకీయంగా నన్ను కత్తితో పొడవడానికి వస్తే ఊర్కోను
ABN, Publish Date - Sep 15 , 2024 | 04:16 AM
‘‘ప్రత్యర్థి.. నన్ను రాజకీయంగా కత్తితో పొడవాలని వస్తే నేను ఊర్కోను. ఎదురుదాడి చేస్తా. అదే రాజనీతి’’ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
ఎదురుదాడి చేస్తా.. అదే రాజనీతి
బీఆర్‌ఎస్‌పై మా పార్టీ తీరు సరైందే
మా కార్యకర్తలను రెచ్చగొట్టవద్దు
ఆంధ్రోళ్లకు టికెట్లు ఇచ్చింది కేసీఆరే
హరీశ్ రావును ఎలుగుబంటి కరిచినట్టుంది: తూర్పు జగ్గారెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రత్యర్థి.. నన్ను రాజకీయంగా కత్తితో పొడవాలని వస్తే నేను ఊర్కోను. ఎదురుదాడి చేస్తా. అదే రాజనీతి’’ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ విషయంలో తమ పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరైనదేనన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అనవసరమైన రచ్చ పెట్టుకుని హైదరాబాద్ ప్రజల మూడ్‌ను ఖరాబు చేశారన్నారు. వినాయక నవరాత్రుల సమయంలో అన్ని టీవీలూ ఖైరతాబాద్ వినాయకుడి పూజను చూపిస్తాయన్నారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు లొల్లి పెట్టుకుని ఖైరతాబాద్ వినాయకుడిని, వినాయక పూజలను ప్రజలు చూడకుండా చేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంత చిల్లరగా వ్యవహరించబోరన్నారు. గాంధీభవన్‌లో శనివారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. ‘‘బీఆర్‌ఎస్ వాళ్లు ఆంధ్రా వాళ్లను తిడుతున్నరు..! ఆంధ్రాకు వెళ్లి వైసీపీ నేత రోజా ఇంట్లో చేప ల పులుసు తిన్నదీ.. ఆంధ్రా ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నది, ఆంధ్రోళ్లకు టికెట్లు ఇచ్చిందీ కేసీఆరే కదా?’’ అన్నారు. రెండు రోజులుగా హరీశ్‌రావు దునుకుడు చూస్తుంటే.. ఆయనను ఎలుగుబంటి కరిచినట్లనిపిస్తుందన్నారు.
ఫిరాయింపులకు ఆజ్యం పోసిందే కేసీఆర్
వైఎ్‌సఆర్ హయాంలో తానేమీ కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని జగ్గారెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యేలకు నేరుగా కండువా కప్పే సంస్కృతి ఉమ్మడి రాష్ట్రంలో లేదని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఇది మొదలైందన్నారు. 2014 నుంచి 2018 వరకు నలుగురు ఎంపీలు, పాతిక మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలను వివిధ పార్టీల నుంచి బీఆర్‌ఎ్‌సలో చేర్చుకున్నది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. ఈ ఫిరాయింపులకు ఆజ్యం పోసిందే కేసీఆర్ అని చెప్పారు. కేసీఆర్ సీఎం అయ్యాక రాజకీయాల్లో విలువలే పోయాయన్నారు. బీజేపీ డైరెక్షన్‌లో కాంగ్రె్‌సకు కేసీఆర్ వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. కౌశిక్‌రెడ్డి పంచాయితీలో ఉత్తమ్‌కు ఏం సంబంధమని.. ఈ విషయంలో సీఎం రేవంత్, ఉత్తమ్‌లకు పూర్తి స్పష్టత ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా జగ్గారెడ్డి చెప్పారు. ఈ సందులో దూరాలని బీజేపీ వచ్చిందని, రాజకీయం చేయడం తప్పితే ఆ పార్టీకి ఏం తెలుసునని అన్నారు.
సీఎంను పనికిరానోడని అంటే నాలుక కోస్తం
తమ సీఎం రేవంత్‌రెడ్డిని పనికిరానోడని అంటే నాలుక కోస్తం అంటూ జగ్గారెడ్డి హెచ్చరించారు. కేటీఆర్ అన్నా, ఆయన అయ్య కేసీఆర్ అన్నా కూడా నాలుక కోస్తామన్నారు. తమ కార్యకర్తలను రెచ్చగొట్టవద్దని హితవు పలికారు. సీఎం రేవంత్ పాలన.. అసమర్థుని జీవయాత్రలా ఉందంటూ కేటీఆర్ వ్యాఖ్యలపైన జగ్గారెడ్డి ఈ మేరకు స్పందించారు.
Updated Date - Sep 15 , 2024 | 04:16 AM