T. Jaggareddy: సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి 9 నెలలుగా అందుబాటులోనే..
ABN, Publish Date - Aug 31 , 2024 | 03:02 AM
‘‘తొమ్మిదిన్నరేళ్ల పాలనలో నువ్వు ఎప్పుడూ సచివాలయానికి వచ్చి కూర్చోలేదు కేసీఆర్ గారూ! మా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు మాత్రం 9 నెలలుగా క్రమం తప్పకుండా సచివాలయానికి వచ్చి కూర్చుని.. అందరికీ అందుబాటులో ఉంటున్నరు.
ప్రజల కోసం ఎప్పుడైనా అపాయింట్‌మెంట్
ప్రజలపై ప్రేముంటే అపాయింట్‌మెంట్ అడుగు
అడిగితేనే నువ్వు నిజమైనవిపక్ష నేతవు
కేసీఆర్‌కు జగ్గారెడ్డి సూచన
తొమ్మిదిన్నరేళ్లలో సెక్రటేరియట్‌కు రాని కేసీఆర్
రేవంత్‌కి.. కేసీఆర్‌కి ఉన్న తేడా ఇదే!
రుణమాఫీ కోసం రూ.31 వేలకోట్లు మంజూరు
ఇప్పటికే రూ.18 వేల కోట్లుచెల్లించారు
ప్రభుత్వ వ్యవస్థలను కేసీఆర్ ఖరాబు చేసిండు
అందుకే మాఫీ ఆలస్యం.. రైతులు గమనించాలి
రాహుల్‌ను అనే స్థాయి హరీశ్‌కు లేదు
మళ్లీ మాట్లాడితే నా భాషా మారుద్ది: జగ్గారెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): ‘‘తొమ్మిదిన్నరేళ్ల పాలనలో నువ్వు ఎప్పుడూ సచివాలయానికి వచ్చి కూర్చోలేదు కేసీఆర్ గారూ! మా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు మాత్రం 9 నెలలుగా క్రమం తప్పకుండా సచివాలయానికి వచ్చి కూర్చుని.. అందరికీ అందుబాటులో ఉంటున్నరు. సీఎం రేవంత్‌కు, మీకు ఉన్న తేడా ఇదే! ప్రజల సమస్యల పరిష్కారానికి నువ్వు ఆయన్ను ఎప్పుడు అపాయింట్‌మెంట్ అడిగినా ఇస్తరు.
నీకు నిజంగా ప్రజలపైన ప్రేముంటే ఒక్కసారి సీఎం రేవంత్‌రెడ్డిని అపాయింట్‌మెంట్ అడిగి చూడు’’ అంటూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి సూచన చేశారు. గాంధీభవన్‌లో మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపైన సీఎం అపాయింట్‌మెంట్ అడిగితేనే కేసీఆర్ నిజమైన ప్రతిపక్ష నేత అవుతవుడన్నారు. కేసీఆర్.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల్ని కలిసింది లేదన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో సీఎంగా ఎన్నడూ సెక్రటేరియట్‌కు రాలేదన్నారు.
రాష్ట్రంలో రివర్స్ పాలిటిక్స్
తెలంగాణలో రివర్స్ పాలిటిక్స్ నడుస్తున్నాయని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సహజంగా.. ప్రజల సమస్యలపైన చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు పెట్టాలంటూ ప్రభుత్వాన్ని ప్రతిపక్షం అడగాల్సి ఉంటుందన్నారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డే అసెంబ్లీ సమావేశాలు పెట్టి.. సభకు రావాలంటూ ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను పిలిచే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. బయట మాట్లాడే కేసీఆర్.. అదేదో సభకు వచ్చి రుణమాఫీ గురించి మాట్లాడొచ్చుగదా అని అన్నారు.
ప్రజాక్షేత్రంలోకి వస్తానంటూ మాట్లాడిన కేసీఆర్.. ఇంట్లో కూర్చుని మీడియాలో ప్రకటనలకే పరిమితమయ్యారన్నారు. ప్రభుత్వానికి, బ్యాంకర్లకు మధ్య ఉన్న ఆన్‌లైన్ వ్యవస్థను కేసీఆర్ దెబ్బతీయడం వల్లనే రైతు రుణమాఫీ ప్రక్రియ కొంత ఆలస్యం అవుతోందని జగ్గారెడ్డి అన్నారు. తాము ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ 9 నెలల్లో చేశామన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.31 వేల కోట్లలో రూ.18 వేల కోట్ల మేరకు చెల్లింపులు పూర్తయ్యాయని, మరో రూ.12 వేల కోట్ల మేరకు నిధులూ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్లలో ప్రభుత్వానికి, బ్యాంకర్లకు మధ్య ఉన్న వ్యవస్థనంతా ఖరాబ్ చేశారని, అందుకే కొంత ఆలస్యం అవుతోందని చెప్పారు. ‘‘హరీశ్.. లెక్కలే రాని నువ్వు.. బీఆర్‌ఎస్ హయాంలో ఫైనాన్స్ మినిస్టర్ అయినవు. నీ మేనమామ కేసీఆర్ చెప్పిన పని చేయడమే నీ పని. రాహుల్‌గాంధీని కొడంగల్‌కు రమ్మనే స్థాయా నీది? సిద్దిపేటలో రైతులు లేరా.. నీతో చర్చించేందుకు మాకు నేతలు లేరా? మా రైతు నాయకులు కోదండరెడ్డి, అన్వే్‌షరెడ్డిలను సిద్దిపేటకు పంపిస్తాం. ఏం కావాలో చెప్పుకో!’’ అని జగ్గారెడ్డి అన్నారు. మరోసారి రాహుల్ గురించి హరీశ్ మాట్లాడితే తన భాష కూడా మారుతుందని ఆయన హెచ్చరించారు.
Updated Date - Aug 31 , 2024 | 03:02 AM