Placements: జేఎన్‌టీయూ పీజీ విద్యార్థులకు ఆఫర్ల వెల్లువ
ABN, Publish Date - Aug 27 , 2024 | 04:14 AM
జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంపస్ ప్లేస్‌మెంట్ల హవా సాగుతోంది.
33 మందికి రూ.8.5లక్షల చొప్పున వార్షిక వేతనం
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంపస్ ప్లేస్‌మెంట్ల హవా సాగుతోంది. ఈ నెల రెండో వారంలో 9 మంది బీటెక్ విద్యార్థులకు రూ.16.5 లక్షల చొప్పున ప్యాకేజీతో ఒరాకిల్ సంస్థ ప్లేస్‌మెంట్స్ ఆఫర్ చేయగా... తాజాగా 33 మంది ఎంటెక్ విద్యార్థులకు ఫ్రాన్స్‌కు చెందిన ఆల్‌స్తోమ్ సంస్థ నుంచి ప్లేస్‌మెంట్స్ లభించాయి.
వీరందరికి రూ.8.5 లక్షల చొప్పున వార్షిక వేతనంతో సంస్థ ప్రతినిధులు ఆఫర్ లెటర్స్‌ను అందజేశారు. కోర్ బ్రాంచ్‌లైన ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాలకు చెందిన ఎంటెక్ విద్యార్థులకు ఈ వేతనంతో ప్లేస్‌మెంట్లు లభించడం పట్ల విద్యార్థులు, ఆచార్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏటా పీజీ విద్యార్థుల కంటే యూజీ విద్యార్థులకు ఎక్కువగా ప్లేస్‌మెంట్లు ఉండేవని, ఈసారి పీజీ విద్యార్థుల్లోనూ ఎక్కువ మంది ప్లేస్‌మెంట్లు పొందడం మంచి పరిణామమని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.వి.నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
Updated Date - Aug 27 , 2024 | 04:14 AM