మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS News: కడెం ప్రాజెక్ట్ ఐదు గేట్లకు మరమ్మతులు..!!

ABN, Publish Date - May 15 , 2024 | 03:31 AM

గోదావరి బేసిన్‌లో ఏటా వరదలతో నిండే ప్రాజెక్టుల్లో ఒకటైన కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత రెండేళ్లూ భారీ వరదలతో ప్రాజెక్టు చిగురుటాకులా వణికిన విషయం విదితమే.

  TS News: కడెం ప్రాజెక్ట్ ఐదు గేట్లకు మరమ్మతులు..!!
kadem project

ఐదు గేట్లకు శరవేగంగా మరమ్మతులు..

నేడు ప్రాజెక్టు వద్దకు కీలక అధికారులు

గత రెండేళ్లూ భారీ వరదలకు వణికిన ప్రాజెక్టు

2 గేట్ల రోప్‌లు తెగిపోవడం, మరో రెండింటి కౌంటర్‌ వెయిట్‌లు కొట్టుకుపోవడంతో సమస్య

మొత్తం 18 గేట్లూ ఒకేసారి తెరుచుకోని వైనం

డీఎ్‌సఆర్‌పీ సూచనపై దృష్టిపెట్టని గత సర్కారు

యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని కొత్త ప్రభుత్వం నిర్ణయం.. ఉత్తర్వుల జారీ

హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): గోదావరి బేసిన్‌లో ఏటా వరదలతో నిండే ప్రాజెక్టుల్లో ఒకటైన కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత రెండేళ్లూ భారీ వరదలతో ప్రాజెక్టు చిగురుటాకులా వణికిన విషయం విదితమే. స్పిల్‌వే (నీరు విడుదలయ్యే భాగం) సామర్థ్యం కన్నా అధికంగా వరద రావడంతో గత ఏడాది 18 గేట్లకు గాను 14 గేట్లు మాత్రమే పైకి లేచాయి. రెండు గేట్ల రోప్‌లు తెగిపోగా... మరో రెండు గేట్ల కౌంటర్‌వెయిట్‌లు కొట్టుకుపోయాయి. దాంతో వరద.. గేట్ల పైనుంచి కిందికి దూకింది. గత రెండేళ్ల అనుభవాల దృష్ట్యా ప్రాజెక్టు 18 గేట్లను ఏకకాలంలో ఎత్తడానికి వీలుగా 5 గేట్లలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇటీవలే వీటి మరమ్మతులకు ఉత్తర్వులు ఇవ్వగా ఎన్నికల సంఘం కూడా ప్రత్యేకంగా అనుమతి ఇచ్చింది. వానాకాలంలోపు ఈ మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ (జనరల్‌) జి.అనిల్‌కుమార్‌ నేతృత్వంలోని అధికారుల బృందం కడెం ప్రాజెక్టును సందర్శించనుంది. గేట్ల మరమ్మతులపై అక్కడే సమీక్ష చేపట్టి, అవసరమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. కాగా, ఈ ప్రాజెక్టుకు ఒక ప్రత్యేకత ఉంది. 18 గేట్లలో 9 జర్మనీ నుంచి తెప్పించుకున్నవి. మరో 9 మన దేశంలోనే తయారుచేసినవి. 1906లోనే నిజాం హయాంలో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించి.. మధ్యలో ఆపేశారు. హైదరాబాద్‌ సంస్థానం పోలీసు చర్య అనంతరం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం అయ్యాకా పూర్తి చేశారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 1.30 లక్షల క్యూసెక్కుల వరద విడుదలయ్యేలా స్పిల్‌ వే డిజైన్‌ చేశారు. అయితే 1958 ఆగస్టు 31న ప్రాజెక్టుకు 3 లక్షల క్యూసెక్కుల వరద వ చ్చింది. దాంతో అంతకుముందు అమర్చిన జర్మనీ గేట్లకు అదనంగా మరో 9 గేట్లు పెట్టి, స్పిల్‌ వే సామర్థ్యం 3 లక్షల క్యూసెక్కులకు పెంచారు. రెండేళ్ల కిందట ప్రాజెక్టుకు ఏకంగా 5 లక్షల క్యూసెక్కుల వరద రాగా గత ఏడాది దాదాపు 4 లక్షల క్యూసెక్కుల దాకా వచ్చింది. జర్మనీ గేట్లు నిక్షేపంగా పనిచేస్తుండగా భారతదేశంలో తయారుచేసినవి నిరంతరం మొరాయిస్తున్నాయి. ఈ ప్రాజెక్టును డీఎ్‌సఆర్‌పీ తనిఖీ చేసి.. అదనంగా 5 గేట్లతో కొత్తగా ఒక స్పిల్‌ వే కట్టాలని నివేదిక ఇచ్చింది. ఏడాదిన్నర కిందటే డీఎ్‌సఆర్‌పీ నివేదిక ఇవ్వగా గత ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టలేదు.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వెనువెంటనే మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించి, ఇటీవలే నిధులు కూడా మంజూరు చే సింది. స్పిల్‌ వే కట్టాలంటే ఏడాది పాటు ప్రాజెక్టు కింద క్రాప్‌ హాలీడే ప్రకటించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి తాత్కాలిక ప్రాతిపదికన గేట్లకు మరమ్మతులు చేసి, గేట్ల ఆపరేషనల్‌ మ్యానువల్‌లో మార్పులకు ఉపక్రమించారు. ప్రాజెక్టు క్యాచ్‌మెంట్‌ ఏరియా అంతా దట్టమైన అడవుల్లో ఉంది. దీంతో అడవుల్లో రెయిన్‌ గేజ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసి, వాటిని ప్రాజెక్టు వద్ద ఉన్న స్కాడా కేంద్రానికి అనుసంధానం చేశారు. వరద సమాచారం అందుకోగానే గేట్లను ఏకకాలంలో తెరవనున్నారు. అడవుల్లో వర్షాలు కురిసిన తర్వాత ప్రాజెక్టుకు వరద చేరడానికి 9 గంటలు పడుతుందని అంచనా వేశారు. ఆ సమయానికి ముందే 18 గేట్లను ఎత్తేసి ప్రాజెక్టును ఖాళీ చేయాలని నిర్ణయించారు. దీని వల్ల రిజర్వాయర్‌పై ఒత్తిడి తగ్గి ప్రమాదం నుంచి కడెం ప్రాజెక్టు బయటపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Updated Date - May 15 , 2024 | 10:30 AM

Advertising
Advertising