Inquiry: కాళేశ్వరంపై విచారణకు కేసీఆర్‌ను పిలవడం తథ్యం!
ABN, Publish Date - Nov 23 , 2024 | 03:53 AM
కాళేశ్వరం విచారణ ప్రక్రియలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును తప్పనిసరిగా విచారణకు పిలిపించాలని మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై విచారణ జరుపుతున్న కమిషన్ భావిస్తోంది.
25 నుంచి అధికారుల విచారణ.. ఆ తర్వాత కేసీఆర్
నాటి సాగునీటి మంత్రి హరీశ్‌రావుకూ పిలుపు?
హైదరాబాద్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం విచారణ ప్రక్రియలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును తప్పనిసరిగా విచారణకు పిలిపించాలని మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై విచారణ జరుపుతున్న కమిషన్ భావిస్తోంది. విచారణ ప్రక్రియలో భాగంగా ఈ నెల 25 నుంచి సంబంధిత వ్యక్తులను పిలిచి విచారించే కార్యక్రమాన్ని పునః ప్రారంభిస్తున్నారు. రోజుకు 14 మందికి పైగా ఇంజనీర్లను విచారిస్తారు. మొత్తం 52 మందికి పైగా అధికారులకు కబురు పంపనున్నారు. తొలి దశలో ఇంజనీర్లు, ఆ తర్వాత ఐఏఎ్‌సలు/మాజీ ఐఏఎ్‌సలు, తెలంగాణ విద్యుత్ రంగ నిపుణుడు కంచర్ల రఘుతో పాటు కాంట్రాక్టర్లు, కాగ్ ప్రతినిధులను ప్రశ్నిస్తారు. చివరిగా కేసీఆర్, హరీశ్‌ను పిలుస్తారు. సమన్లు జారీ చేసినా విచారణకు హాజరు కాకపోతే ఏం చేయాలనే దానిపై కూడా కమిషన్ దృష్టి సారించింది. విద్యుత్ విచారణ సమయంలో కేసీఆర్‌ను విచారణకు పిలవకుండానే ఆయన కమిషన్‌కు రాసిన లేఖనే కేసీఆర్ అభిప్రాయంగా పరిగణనలోకి తీసుకున్నారు. ఆ మేరకు జస్టిస్ లోకూర్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.
కాళేశ్వరం విచారణలో పలువురు అధికారులను విచారిస్తున్నపుడు కేసీఆర్, హరీశ్ పేర్లే ప్రధానంగా వినిపించాయి. కేవలం నీటి మళ్లింపు కోసం వినియోగించాల్సిన కాళేశ్వరం బ్యారేజీల్లో నీటిని ఎక్కువ కాలం నిల్వ చేయడమే కుంగుబాటుకు కారణమని, నీటి నిల్వకు ఆదేశాలు జారీ చేసింది కేసీఆర్, హరీశ్‌రావులేనని విచారణలో పలువురు చెప్పారు. బ్యారేజీల నిర్మాణానికి డిజైన్లు చేసిన సమయంలో షీట్ పైల్స్ వినియోగించాలని నిర్ణయించగా, వాటి స్థానంలో సీకెంట్ పైల్స్‌ను వినియోగించారు. సీకెంట్ పైల్స్ దేశంలో హైడ్రాలిక్ నిర్మాణంలో ఎక్కడా వాడటం లేదని, కేవలం కాళేశ్వరం బ్యారేజీల్లో వినియోగించారని, బ్యారేజీల వైఫల్యానికి ఇది మరో కారణమని విచారణలో తేలింది. ఈ నిర్ణయం వెనుక కూడా కేసీఆర్, హరీశ్ పాత్ర ఉందని కమిషన్ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ(సీడబ్ల్యూపీఆర్‌ఎస్) నివేదికలు కూడా ప్రభుత్వానికి చేరాయి. విజిలెన్స్ విభాగం కూడా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఆ నివేదికను అధ్యయనం చేసి, ఇంజనీర్లు/ఐఏఎ్‌స/మాజీ ఐఏఎ్‌సలు, ప్రజా సంఘాలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను క్రాస్ ఎగ్జామినేషన్ చేశాక కేసీఆర్, హరీశ్‌లను విచారణకు పిలుస్తారు.
Updated Date - Nov 23 , 2024 | 03:54 AM