Kaleshwaram Project: డిసెంబరు ఆఖరునాటికి నివేదిక ఇవ్వండి
ABN, Publish Date - Nov 14 , 2024 | 05:15 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ నివేదికను ఈ ఏడాది డిసెంబరు నెలాఖరుకల్లా ఇవ్వాలని జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్‌ను ప్రభుత్వం కోరింది.
కాళేశ్వరం కమిషన్ గడువును 2 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ నివేదికను ఈ ఏడాది డిసెంబరు నెలాఖరుకల్లా ఇవ్వాలని జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్‌ను ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కమిషన్ విచారణ చేసి నివేదికను సమర్పించే గడువును డిసెంబరు నెలాఖరుదాకా పొడిగిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా బుధవారం జీవో జారీ చేశారు. వాస్తవానికి ఈ నెల 12 నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మూడో విడత క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంది. అయితే గడువు పొడిగింపు జీవో వెలువడనందున జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ షెడ్యూల్‌ను ప్రకటించలేదు.
తాజాగా గడువు పొడిగింపు జీవో జారీ కావడంతో తదుపరి విచారణ షెడ్యూల్‌ను జస్టిస్ పీసీ ఘోష్ విడుదల చేసే అవకాశం ఉంది. కమిషన్ ఇప్పటికే నీటిపారుదల శాఖ ఈఎన్‌సీలు, మాజీ ఈఎన్‌సీలు, చీఫ్ ఇంజనీర్లు, ఎస్‌ఈలను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. తదుపరిగా నీటిపారుదల శాఖ కార్యదర్శులుగా, ఇతర హోదాల్లో పనిచేసిన ప్రస్తుత, మాజీ ఐఏఎస్ అధికారులను ఇదే నెలలో విచారించి బ్యారేజీల నిర్మాణంలో కీలక నిర్ణయాలను ఎవరు తీసుకున్నారన్న అంశంపై సాక్ష్యాలను ేసకరించేందుకు కమిషన్ సిద్ధమైంది.
Updated Date - Nov 14 , 2024 | 05:15 AM