SP Sindhu Sharma: ఇంటికే వెళ్లి లింగ నిర్ధారణ పరీక్షలు
ABN, Publish Date - Oct 29 , 2024 | 03:55 AM
కామారెడ్డి జిల్లాలో కొందరు ముఠాగా ఏర్పడి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని జిల్లా ఎస్పీ సింధూశర్మ తెలిపారు. కామారెడ్డిలోని తన కార్యాలయంలో ఎస్పీ సోమవారం విలేకరులతో మాట్లాడారు.
మహారాష్ట్రతో పాటు కామారెడ్డి జిల్లాలో ముఠా ఆగడాలు
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీరియస్
కామారెడ్డి, కామారెడ్డి టౌన్, అక్టోబరు 28 ( ఆంధ్రజ్యోతి ) : కామారెడ్డి జిల్లాలో కొందరు ముఠాగా ఏర్పడి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని జిల్లా ఎస్పీ సింధూశర్మ తెలిపారు. కామారెడ్డిలోని తన కార్యాలయంలో ఎస్పీ సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఐదు నెలల క్రితం కామారెడ్డిలోని సమన్విత ఆస్పత్రిలో ఓ గర్భిణికి నెలలు నిండకుండానే ఆపరేషన్ చేసి ఆడపిల్లను ఇతరులకు విక్రయించిన విషయమై దర్యాప్తు చేయగా.. సదరు ఆసుపత్రి నిర్వాహకులు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని తేలిందన్నారు. ఈ కేసులో పలువురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని తెలిపారు. అప్పటి నుంచి జిల్లాలో లింగనిర్ధారణ పరీక్షలపై పోలీసు శాఖ నిఘా పెట్టిందన్నారు.
15 రోజుల క్రితం రాజంపేటలో ఓ వ్యక్తి ఇంట్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ యంత్రంతో గర్భిణులకు పరీక్షలు చేస్తుండగా.. పోలీసులు అదుపులోకి తీసుకుని యంత్రాన్ని సీజ్ చేశారన్నారు. సదరు వ్యక్తితో పాటు మరో 16 మంది ఆర్‌ఎంపీలను గుర్తించి కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. రెండు రోజుల క్రితం కౌసల్య ఆసుపత్రికి చెందిన ఇట్టెం సిద్దిరాములు ఓ స్కానింగ్ యంత్రాన్ని కారులో తరలిస్తుండగా స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఇట్టెం సిద్దిరాములుతో పాటు మరికొందరు ముఠాగా ఏర్పడి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని తెలిపారు.
ఈ ముఠా నెట్‌వర్క్‌ను మహారాష్ట్రతో పాటు కామారెడ్డి చుట్టుపక్కల జిల్లాల్లోనూ విస్తరించినట్టు తెలిపారు. వీరు స్కానింగ్ యంత్రాలను వాహనాల్లో గర్భిణుల ఇంటికి తీసుకువెళ్లి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని ఎస్పీ వివరించారు. కాగా, లింగ నిర్ధారణ పరీక్షలపై వైద్య ఆరోగ్య శాఖమంత్రి రాజనర్సింహ జిల్లా వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఫోన్‌లో కామారెడ్డి డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌తో మాట్లాడారు. తీసుకోవాల్సిన చర్యలపై వెంటనే దృష్టి సారించాలని సూచించారు.
Updated Date - Oct 29 , 2024 | 03:55 AM